PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. WhatsApp లోనే బ్యాలెన్స్ నుంచి క్లెయిమ్ వరకు!
ఉద్యోగులకు నెలనెలా జీతం వస్తుంది.. అందులో PF కోసం కొంత మొత్తం కట్ అవుతుంది. కంపెనీ కూడా తన వాటా జమ చేస్తుంది. ఇలా నెలలు, సంవత్సరాలు గడిచేసరికి కొంత మొత్ితం మన PF ఖాతాలో పోగవుంది. అయితే అది ఎంత మొత్తం? అని ఎప్పుడైనా తెలుసుకోవాలనిపిస్తుంది. ఏం చేస్తారు.
EPFO సైట్ ఓపెన్ చేయాలి.. లాగిన్ అవ్వాలి.. OTP కోసం ఎదురుచూడాలి.. ఏదైనా సర్వర్ సమస్య వస్తే మళ్లీ ప్రయత్నించాలి. ఒక్కసారి బ్యాలెన్స్ చూసుకోవడానికి ఇంత తలనొప్పి ఎందుకని చాలామందికి అనిపిస్తుంటుంది.
ఇకపై అలాంటి పరిస్థితి మారబోతోంది. మీరు రోజూ ఉపయోగించే WhatsAppలోనే PFకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంటే ప్రత్యేకంగా ఏదైనా కొత్త యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
మీ ఫోన్లో ఉన్న WhatsApp నుంచే పని మొదలవుతుంది. అధికారిక వెరిఫైడ్ EPFO నంబర్‌కు ‘హలో’ అని మెసేజ్ చేస్తే.. అక్కడి నుంచి అందుబాటులో ఉన్న సేవలను ఎంచుకుని మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు.
EPFO now on WhatsApp too!
📢Join EPFO’s official WhatsApp Channel to get important updates and useful information. Click on the link to join. https://t.co/k2KmISipxw #EPFO #EPFOWithYou #HumHainNa #EPFOWhatsAppChannel pic.twitter.com/mgLueBG1GD
— EPFO (@officialepfo) September 13, 2026
‘హలో’ తర్వాత ఏం తెలుసుకోవచ్చు?
ఒక్కసారి WhatsApp సేవలోకి వెళ్లిన తర్వాత … మీ PF ఖాతాలో ప్రస్తుతం ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇటీవల ఖాతాలో జరిగిన ఐదు లావాదేవీల వివరాలను కూడా చూడొచ్చు. అంటే ఉద్యోగి వాటా, కంపెనీ వాటా వంటి కాంట్రిబ్యూషన్లు ఎలా జమ అవుతున్నాయో పరిశీలించడానికి ఇది ఉపయోగపడుతుంది.
అంతేకాదు… PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి లేదా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడానికి క్లెయిమ్ పెట్టారా? అది ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి మళ్లీ మళ్లీ EPFO పోర్టల్‌లోకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. WhatsAppలోనే క్లెయిమ్ స్టేటస్‌ను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆఖరి 5 ట్రాన్సాక్షన్స్ కూడా చేతిలోనే..
WhatsAppలో అందించే చివరి ఐదు లావాదేవీల సమాచారం ఉంటుంది. ఇటీవల మీ PF ఖాతాలో ఏం జరిగింది? ఎప్పుడు కాంట్రిబ్యూషన్ జమైంది? వంటి ప్రాథమిక వివరాలను త్వరగా చూసుకోవచ్చు. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే దానిపై దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంటుంది.
ఎలా ఉపయోగపడుతుంది?
PF క్లెయిమ్ పెట్టిన తర్వాత అసలు టెన్షన్ మొదలవుతుంది. డబ్బులు ఎప్పుడు వస్తాయి? క్లెయిమ్ ప్రాసెస్ అయిందా? ఇంకా పెండింగ్‌లోనే ఉందా? ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి.
ఇలాంటి సమయంలో WhatsAppలోనే క్లెయిమ్ స్టేటస్ తెలుసుకునే సదుపాయం ఉద్యోగులకు కొంత ఊరటనిస్తుంది. ప్రతిసారీ సైట్ ఓపెన్ చేసి వివరాలు వెతకాల్సిన పని తగ్గుతుంది. ముఖ్యంగా PF డబ్బులు అత్యవసరంగా అవసరమైన సమయంలో క్లెయిమ్ ఏ దశలో ఉందో తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రాంతీయ భాషల్లో సమాచారం.. ఇదే అసలు ప్లస్ పాయింట్
ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాంతీయ భాషల్లో కూడా సేవలను అందించే దిశగా వ్యవస్థను రూపొందించారు. ప్రతి ఉద్యోగి ఇంగ్లీష్‌లోనే డిజిటల్ సేవలను ఉపయోగించగలగాలి అనేది అవసరం లేదు కదా. మనకు అర్థమయ్యే భాషలో సమాచారం వస్తే పని ఇంకా సులభంగా ఉంటుంది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో WhatsApp ఉండటంతో, అదే వేదికను ఉపయోగించి ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తే ఉద్యోగులకు మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. అవసరమైన ప్రతిసారీ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గించడమే కాకుండా, సమస్యలను త్వరగా పరిష్కరించడంలో కూడా టెక్నాలజీ ఉపయోగపడుతుందని వివరించారు.
హైదరాబాద్‌లో ఉన్నవారికి ఈ నంబర్లు
మీరు తెలంగాణలో ఉంటే కొన్ని EPFO ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించిన WhatsApp నంబర్లు అందుబాటులో ఉన్నాయి. మాదాపూర్ కార్యాలయానికి 9100026146, బర్కత్పురాకు 9100026170, కూకట్‌పల్లికి 9392369549, పటాన్‌చెరుకు 9494182174 నంబర్లు ఉన్నాయి.
జాగ్రత్త
అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. PF పేరుతో మోసాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి Googleలో కనిపించిన ఏ నంబర్‌కైనా మీ వివరాలు పంపకుండా, అధికారికంగా ధృవీకరించిన EPFO WhatsApp నంబర్‌నే ఉపయోగించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా OTP, పాస్వర్డ్ లేదా ఇతర సున్నితమైన వివరాలను ఎవరికీ షేర్ చేయకండి.
PMVBRY లబ్ధిదారులకూ ఉపయోగమే
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRY) కింద ప్రయోజనం పొందుతున్న వారికి కూడా ఈ తరహా డిజిటల్ సేవలు ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా DBT యాక్టివేషన్ లేదా అథెంటికేషన్ వంటి అంశాల్లో సమస్యలు ఎదురైతే, వాటిని ఎలా సరిచేసుకోవాలనే దానిపై మార్గదర్శకాలు తెలుసుకోవడానికి WhatsApp సేవ ఉపయోగపడుతుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








