క్రైమ్ థ్రిల్లర్: ‘ఉన్మాదం’ OTT మూవీ రివ్యూ!
Rating: 2.5
అనగనగా ఓ కానిస్టేబుల్ ‘షెల్లీ’ (కుంచాకో బోబన్). అతనికి పోలీస్ అవ్వటం అనేది బ్రతుకు తెరువే కానీ సినిమాల్లోకి వెళ్లాలనేది అతని జీవితాశయం.పగలంతా పోలీస్ స్టేషన్లో డ్యూటీ. సాయంత్రం ఇంటికి వచ్చాక కథల డ్యూటీ. అయినా బుర్రలో సినిమా పురుగు ఓ సారి తొలవటం మొదలెడితే ఇంకేముంది. ఎదురుగా కనపడే ప్రతీదీ కథగానే కనపడుతుంది. అయితే ఆ కథలతో నిర్మాతలను ఒప్పించటమే పెద్ద టాస్క్. ఎందుకంటే వాళ్ళకు కథలో విషయం కన్నా డబ్బు వచ్చే విధానం కనపడాలి. షెల్లీ పట్టువదలని విక్రమార్కుడులా ట్రైల్స్ వేస్తూనే ఉంటాడు.
అయితే ఇవన్నీ భార్య ‘సౌమ్య’ ( లిజోమోల్ జోస్) కు నచ్చవు. ఈయన చెప్పే కథలు తనే నమ్మదు..నిర్మాతలు ఎక్కడ నమ్మి పెట్టుబడి పెడతారనేది ఆమె వాదన. ఇలాంటి రోదనలు సినిమా ఫీల్డ్ లోకి వెళ్దామనుకునేవాడికి తప్పవు అని ప్రగాఢంగా నమ్మి ఉండటంతో తగ్గేదేలే అన్నట్లు మరింత విచ్చలవిడిగా కథలు రాసేసి తిరుగేస్తూంటాడు. కథలు కోసం కొత్త ఐడియాలు వెతికేస్తూంటాడు. అలాంటి టైమ్ లో అతని స్టేషన్ లోనే చాలా కాలంగా తేలని ఓ కేసు గురించి తెలుస్తుంది. మామూలు పోలీస్ కు ఆ కేసుని టేకప్ చేసి పరిష్కరించి,ప్రమోషన్ కొట్టాలని అనిపిస్తుంది. కానీ ఇతను పోలీస్ రూపంలో ఉన్న రైటర్ కదా. ఇతనికి అందులో గొప్ప కథ కనిపిస్తుంది.
ఇంతకీ ఆ ఫైల్ లో ఏముంది. ఆ కేసు గొడవ ఏమిటి అంటే…ఆరేడేళ్ల క్రితం ఓ అమ్మాయి రైల్వై పట్టాల ప్రక్కన శవంగా కనిపిస్తుంది. అందరూ యాక్సిడెంటల్ గా పోయిందనుకుంటారు. అలా పోలీస్ లు కేసు క్లోజ్ చేద్దామనుకుంటారు. అయితే ఆ కేసు ఫైల్ ఎవరు ముట్టుకున్నా ..ఆ రోజున వాళ్లు రక్తం చూడాల్సిందే అన్నట్లు పరిస్ధితులు క్రియేట్ అవుతూంటాయి.ఈ కేసు లో ముందుకు వెళ్ళిన కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే, కొందరు సస్పెండ్ అవుతారు.
ఆ కేసు వెనకాల ఏదో తెలియని శక్తి ఉంది. అది ప్రేతాత్మో, అమ్మాయి ఆత్మో తెలియక కొట్టుమిట్టాడి ప్రక్కన పెట్టేస్తారు. ఈ కథ వినగానే మన రైటర్ గారెకి అద్బుతమైన కథ ఇంతకాలం తన ఎదురుగానే ఉన్నా మిస్ చేసుకున్నానే అనిపిస్తుంది. వెంటనే రంగంలోకి దూకి దాన్ని కథగా రాసేసి అమ్మేయాలనుకుంటాడు.
ఓ స్టోరీ లైన్ రెడీ చేసి, దాన్ని ఓ నిర్మాతకు కూడా వినిపిస్తాడు. అయితే ఆ నిర్మాత ..స్క్రిప్టు పూర్తిగా రాసుకురమ్మని అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు ఆ ఫైల్ ని సీక్రెట్ గా పరిశీలించి, మొత్తం తెలుసుకుని ముందుకు వెళ్లాలనుకుంటాడు. అలా ఆ ఫైల్ ని మన హీరో టచ్ చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. మరి ఆ ఫైల్ ని ముట్టుకుంటే మసి అయ్యిపోతారని చెప్పుకున్నాం కదా..ఇప్పుడు అదే పరిస్ధితి మన షెల్లీకి వస్తుందా…అసలు ఆ అమ్మాయి నిజంగానే ప్రేతాత్మగా మారిందా..లేక అది కూడా ఓ కథనా, అసలు ఉన్మాదం ఎవరికి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు…అసలేం జరిగింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి
విశ్లేషణ
ఈ సినిమా సెటప్ చూస్తూంటే మనకు అంజలి హీరోయిన్ గా వచ్చిన గీతాంజలి గుర్తుకు వస్తుంది. అది చూసే ప్రేరణ పొందారేమో మరి. అది ప్రక్కన పెడితే..‘ఉన్మాదం’కి అసలు స్ట్రెంత్ హైకాన్సెప్ట్. సినిమా రచయిత కావాలని కలలు కనే ఒక పోలీస్ కానిస్టేబుల్ చేతికి దెయ్యం పట్టిన కేసు ఫైల్ దొరకడం అంటే కథకు కావాల్సినంత మసాలా దొరికినట్టే. ‘ఉన్మాదం’ కూడా మొదట్లో ఇదే నమ్మకం మనకు కలిగిస్తూ ముందుకు వెళ్తుంది.
పైగా ఆ ఫైల్‌ను ముట్టుకున్న పోలీసులకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అరిష్టం జరిగిందనే ప్రచారం ఉండటంతో, సాధారణంగా ఆ ఫైల్ దగ్గరకు వెళ్లడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. కానీ సినిమా కథ కోసం తిరుగుతున్న హీరోకి మాత్రం దెయ్యం కన్నా నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కువ భయాన్ని కలిగించినట్టుంది.ఎక్కడ వెనక్కి అడుగుతాడనే భయమూ ఏమో కానీ ఫైల్ తెరిచేస్తాడు. తెరవకపోతే మనం అయినా బలవంతంగా తెరిపించేస్తాం. ఎందుకంటే మనకు ఇప్పుడు కానిస్టేబుల్ కన్నా…ముందు అసలు ఫైల్ ని పట్టుకున్న దెయ్యమే ముఖ్యం. దాని మేటర్ ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ ప్లాష్ బ్యాక్ ఏదో తెలిసిపోతే సినిమా అయ్యిపోతుంది కదా అని ఆశిస్తాం.
అయితే దర్శకుడు ఇక్కడ నుంచి కాస్త దెయ్యిం పట్టినవాడిలా కన్ఫూజ్ అయ్యాడు.దాంతో ఇక్కడి నుంచి కథ ఏ వైపు వెళ్తుందో చెప్పడం కష్టమవుతుంది. నిజంగానే ఆ యువతి ప్రేతాత్మ తిరుగుతోందా? లేక హీరో మానసిక పరిస్థితి అతనితో ఆటలాడుతోందా? అనే సందేహంతో ఎదురుచూస్తూంటాం. అంటే దెయ్యం గోల సరిపోనట్లు దర్శకుడు..మన హీరో మానసిక స్దితిని కూడా కొద్దిగా తేడాగా పెట్టాడు. తనకు నచ్చిన విషయాలు అన్ని ఒకే సినిమాలో పెట్టాయాలంటే ఇలాగే జరుగుతుంది.
దాంతో సెకండాఫ్ మొదట్లో కూడా సినిమా ఈ గందరగోళాన్ని బాగానే కొనసాగిస్తుంది. హీరోకు కనిపించే వింత దృశ్యాలు, పీడకలలు, చుట్టూ తిరిగే బల్లులు చూసి విసుగొస్తుంది. దెయ్యం గోల కన్నా ఈ భ్రమలగోల ఎక్కువైందే అని విసుగొస్తుంది.
అయితే అసలు కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సినిమా చేతులెత్తేసి, ఎన్నో పాత సినిమాల దారిలోకి వెళ్లిపోయింది. మొదట్లో దెయ్యం, భ్రమలు, మానసిక పరిస్థితి అంటూ పెద్ద మిస్టరీతో బిల్డప్ ఇచ్చిన కథ చివరికి మనకు బాగా పరిచయమైన revenge drama వీధిలోకి వచ్చేస్తుంది. ఇంతసేపు “ఈ ఫైల్ వెనుక ఏం ఉంటుందో?” అని ఆసక్తిగా తెరిచిన మనకి, ఏ ఫైల్ చూసినా చివరకు రివేంజ్ పేజీలే కదా అనే నిట్టూర్పు వస్తుంది.
మొదట్లో చాలా ప్రమాదకరంగా కనిపించిన మిస్టరీ, చివరికి సుపరిచితమైన విలన్ల దగ్గరకు చేరుకోవడంతో కథలో ఉన్న ప్రత్యేకత క్రమంగా తగ్గిపోతుంది.
ఫైనల్ థాట్:
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఒక cursed file, మానసికంగా ఇబ్బందిపడుతున్న పోలీస్ కానిస్టేబుల్, దెయ్యం ఉందా లేదా అనే సందేహం… ఇన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా, వాటిని చివరి వరకు అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లి ముగించలేకపోయింది. ఇంటర్వెల్ వరకు ప్రేక్షకుడిని “నెక్ట్స్ ఏం జరుగుతోంది?” అని అడిగించిన సినిమా, తర్వాత “ఇక్కడ నెక్ట్స్ జరిగేది ఇదే కదా!” ఊహించే స్దాయికి వెళ్లింది.
ఎక్కడ చూడవచ్చు?
సోనీ లివ్ లో తెలుగులో ఉంది.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








