దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’రివ్యూ
Rating : 2.5/5
—సూర్య ప్రకాష్ జోశ్యుల
చాలా మంది వ్యాపారాన్ని జూదంలా మార్చేసి అందులోనే కిక్ అనుభవిస్తూంటారు. అయితే మన హీరో డ్యాన్ జాన్ (దుల్కర్ సల్మాన్)కి రెండింటి మధ్యా గీత చాలా స్పష్టంగా తెలుసు అనుకుంటాను. అందుకే వ్యాపారం, జూదం రెండూ వేర్వేరుగా చూస్తూంటాడు. అయితే చాలా మందిలాగే అతనికు కూడా వ్యాపారం మీద కన్నా జూదం మీదే ఎక్కువ మక్కువ.గాలి పీల్చటం అయినా మానేస్తాడు కానీ గ్లాంబ్లింగ్ కు ఇచ్చే గౌరవం తగ్గించలేనంటాడు.అదే పనిమీద శ్రమిస్తూంటాడు. అయితే ఎప్పుడూ డబ్బు తెచ్చి పెడితే దాన్ని గాంబ్లింగ్ అని ఎందుకంటారు. చాలా సార్లు జూదం తన సోదరులైన అప్పులు,తిప్పలుతోనే కలిసి వస్తుంది. ఈ సారి అలాగే జరిగింది.
జూదం ఆడి తనకు చేతనైన మేరకు డబ్బులు మొత్తం పోగొట్టుకుంటాడు డ్యాన్ జాన్. అంతేకాదు అప్పులు వాళ్లు కాస్త ఎగ్రిసివ్ కావటంతో వాళ్ల చేత తన్నులు తినే పరిస్దితి కూడా వస్తుంది.అప్పుడు వేరే దారిలేక తల్లి మెర్సీ (జయసుధ) సీన్ లోకి వస్తుంది. కొడుకుని జూదం నుంచి ఎలాగో సేవ్ చేయలేకపోయాను..చివరకు ఆ అప్పులు నుంచి అయినా సేవ్ చేద్దామని డెసిషన్ తీసుకుని తను దాచుకున్న డబ్బులు ఇస్తుంది.
అయితే ఇక్కడ మీకూ విషయం గుర్తుండి ఉండాలి. జూదగాడు అవ్వటానికి ప్రధమ రూల్ ..మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పులు తీర్చకండి.. మరో ఆట ఆడి చూడండి అని. ఆ రూల్ ని అనుసరించి ఈ సారి క్రికెట్ బెట్టింగ్ ఆడి ఆ మొత్తం పోగొడతాడు.ఇప్పుడు ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు. అమ్మ దగ్గర డబ్బులు ఖాళీ, వెనక్కి వెళ్తే జీవితం ఖాళీ. దాంతో కాస్తంత ధైర్యం చేసి ఆ బెట్టింగ్ బ్యాచ్ ని చావకొట్టి ఆ డబ్బులు ఎత్తుకు పారిపోయే పనిలో పడతాడు.
అయితే స్పీడుగా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయనేది ట్రాఫిక్ సెన్స్ బేసిక్ రూల్. వాళ్లు పోన్లే కదా అని జూదగాళ్లకు, తాగుబోతుకు ప్రత్యేక కన్శెక్షన్స్ ఇవ్వరాయే. దాంతో ఆ క్రమంలో బాబు యాక్సిడెంట్ చేసి…కుడి చేయి పోగొట్టుకుంటాడు. రెండు చేతులు కొన్ని రకాల గ్లాబ్లింగ్ లకు అత్యవసరం. ఇలా జరిగిందేమిటా అని బాధపడుతూంటే… హాస్పటిల్ లో డాక్టర్లు అతడి కోసం ఓ దాత చేతిని గుర్తించి, హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు.
హమ్మయ్యే…ఏదో హ్యాండ్ మన చేతికి వచ్చేసింది అని ఆనందపడేలోగా కొత్త ట్విస్ట్ పడుతుంది. ఆ కొత్త చేయి వచ్చిన తర్వాత డాన్ జీవితంలో ఊహించని, భయంకరమైన పరిణామాలు మొదలవుతాయి. ఆ కొత్త చేయి కు కూడా మెదడు, గత జ్ఞాపకాలు ఉన్నట్లుగా రెచ్చిపోవటం మొదలెడుతుంది.అప్పుడు డ్యాన్ జాన్ ఏం చేస్తాడు. అతడి శరీరానికి అమర్చిన ఆ చేయి ఎందుకు డాన్ చేసే పనులను కంట్రోలు చేయటం ప్రారంభించింది? అసలు ఆ చేయి అసలు ఎవరిది? ఆ దాత ప్లాష్ బ్యాక్ ఏమిటి.. ముఖ్యంగా, ఆ దాతకు డాన్‌కు మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలిసిస్
వింటానికి ఇదేదో కొత్తగా ఉండేలా ఉందే మురిసిపోయేలోగా ఇదో హాలీవుడ్ ఐడియా ఎత్తివేతల పథకం అర్దమై నీరసం వస్తుంది.1991 లో వచ్చిన Body Parts అనే బాడీ హార్రర్ ఫిల్మ్ నుంచి వచ్చిన ఆలోచన ఇది. సర్లే ఎవరిమాత్రం ఒరిజనల్ అని సరిపెట్టుకుని ముందుకు వెళ్దామంటే కథ మాత్రం నేను ఓ చోటే ఆగిపోయానంటుంది. కదలనని మొరాయిస్తుంది. దుల్కర్ ఆ కొత్తగా వచ్చిన చెయ్యితో ఇబ్బంది పడుతున్నట్లే మనం ఈ సినిమాతో ఇబ్బంది పడుతూంటాం.
నిజానికి ఈ సినిమాలో వాల్యుబుల్ ఐడియా ఏమిటి..? ఒక మనిషి చేయి మరో మనిషి శరీరంలోకి వెళ్లి, అతడిని కంట్రోలులోకి తీసుకోవడం. అంటే ఇది కేవలం revenge కథ కాదు. ఇందులో ఒకేసారి మూడు జానర్స్ దాగి ఉన్నాయి: Body Horror, Dark Comedy
Psychological Conflict. కానీ సినిమా చివరికి వాటన్నింటినీ పక్కన పెట్టి… మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన revenge dramaగా మారిపోతుంది.అబ్బబ్బే నేను ప్రేక్షకుడి మీద రివేంజ్ తీర్చుకోవటం గురించి మాట్లాడటం లేదు.
సరదాగా ఓ చిన్న ఆలోచన చేద్దాం..ఈ కథలో డాన్ జాన్ ఒక compulsive gambler. అతడికి తన మీదే కంట్రోలు లేదు. తర్వాత యాక్సిడెంట్ జరుగుతుంది. అతడి చేయి పోతుంది. కొత్త చేయి వస్తుంది. ఇప్పుడు మరో సమస్య మొదలవుతుంది.డాన్ తన శరీరాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేడు. అంటే ఇది కేవలం supernatural hand కథ కాదు. ఇది నిజానికి “control” గురించి కథ కావచ్చు.ఎంత అద్భుతమైన thematic progression! అనిపిస్తుంది. అయితే అది కథలో ఎక్సప్లోర్ కాలేదనిపించింది.
అలాగే యాక్సిడెంట్ అయ్యి కొత్త చేయి పెట్టేదాకా కథలో కిక్ లేదు. ఆ తర్వాత కాసేపు బాగానే ఉంది. అంటే ఇంటర్వెల్ దాగా బాగానే నడిచింది. అదే సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ చేయి ఎవరిది అనే ప్లాష్ బ్యాక్ , బ్యాక్ స్టోరీ లోంచి పుట్టిన రొటీన్ రివేంజ్ డ్రామాగా కథ మారేసిరికి మొత్తం కిక్ ఖతం అయ్యిపోయింది.
అసలు ఈ కథకు అన్నటికన్నా పెద్ద డ్రాబ్యాక్ చెప్పనా…సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ వచ్చేసరికే దాన్ని అప్పటికే అందరూ ఊహించేసేలా ఉండటం. అదే బోరింగ్ గా ఉండటం. మొత్తానికి ప్లాష్ బ్యాక్ చేయి చేసుకుని సినిమాని చంపేసింది.
టెక్నికల్‌గా చూస్తే …
‘ఐయామ్ గేమ్’కు విజువల్స్ చాలా బాగున్నాయి. జిమ్షి ఖలీద్, జోమన్ టి. జాన్ కెమెరా పనితనం సినిమాకు రిచ్,ట్రెండీ లుక్ తీసుకొచ్చింది. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్‌లో బాగానే పనిచేసినా, సెకండ్ హాఫ్‌లో మాత్రం అదే స్థాయి ఇంపాక్ట్ చూపలేదు. పాటలు వినడానికి జస్ట్ ఓకే. ఇక ఈ సినిమాకు అసలు టెక్నికల్ సమస్య ఎడిటింగ్. చమన్ చక్కో మరింత షార్ప్ గా కత్తెర వాడి ఉంటే ,రిపీట్ సీన్స్.. అనవసర యాక్షన్ ఎపిసోడ్స్ తగ్గి క్రిస్ప్‌గా ఉండేది.
ఫైనల్ థాట్
‘I’m Game’ సినిమా ఫస్టాఫ్ అంతా చేయి ని పట్టుకుని పరుగెత్తటంతో ఇంట్రస్టింగ్ గా ఉంది. సెకండాఫ్ లో స్క్రీన్‌ప్లే ఆ చేతిని వదిలేసి, ఫ్లాష్‌బ్యాక్ చేతిలోకి వెళ్లిపోతుంది. దాంతో సినిమా మనకు మొహమాటం లేకుండా హ్యాండ్ ఇచ్చేసింది.








