స్టాక్ మార్కెట్లో అదరగొట్టిన ల్యుమినో ఇండస్ట్రీస్: 34% ప్రీమియం!
ఆగస్టు 31న ముగిసిన ‘ల్యుమినో ఇండస్ట్రీస్ లిమిటెడ్’ (Lumino Industries) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) మార్కెట్ అంచనాలను మించి అత్యంత ఘనంగా స్టాక్ ఎక్స్ఛేంజీలలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 3న లిస్ట్ అయిన ఈ సంస్థ షేర్లు ఇన్వెస్టర్లకు తొలిరోజే కాసుల వర్షం కురిపించాయి. రూ. 700 కోట్ల ఈ పబ్లిక్ ఇష్యూ ధరను రూ.78 – రూ.82గా నిర్ణయించగా, అప్పర్ బ్యాండ్ రూ. 82 వద్ద షేర్లను కేటాయించారు. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన భారీ డిమాండ్ నేపథ్యంలో ఈ షేరు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో (NSE) 34.15 శాతం ప్రీమియంతో రూ. 110 వద్ద, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో (BSE) 32.93 శాతం లాభంతో రూ. 109 వద్ద లిస్ట్ అయ్యి దలాల్ స్ట్రీట్లో అద్భుతమైన బోణీ కొట్టింది.
ఈ ఐపీఓకి (Lumino Industries) ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. మూడు రోజుల బిడ్డింగ్ వ్యవధిలో ఓవరాల్గా ఈ ఇష్యూ ఏకంగా 124.02 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ కావడం విశేషం. ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల (QIB) విభాగంలో అత్యధికంగా 232.79 రెట్లు బిడ్లు దాఖలవగా.. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) విభాగం 185.21 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 40.27 రెట్ల చొప్పున సబ్స్క్రైబ్ అయ్యాయి.
లిస్టింగ్ రోజున వచ్చిన లాభాలతో పాటు, ఆ తర్వాత కూడా మార్కెట్లో ఈ (Lumino Industries) షేరుకు కొనుగోళ్ల మద్దతు బలంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 4వ తేదీ నాటికి షేరు ధర మరింత పుంజుకుని సుమారు 4.20 శాతం లాభంతో రూ. 114.95 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో ఇది రూ. 122 గరిష్టాన్ని తాకడం గమనార్హం. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ తన రుణాల చెల్లింపునకు ఉపయోగించనుండటం, కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఈ స్టాక్ దీర్ఘకాలిక వృద్ధిని నమోదు చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు పాజిటివ్ అంచనాలతో ఉన్నారు.








