తెలుగు భాషాభివృద్ధికి ఎపి ప్రభుత్వం చర్యలు…రఘురామకృష్ణంరాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించి తగు విధివిధానాలను రూపొందించనున్నదని ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు తెలిపారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తానా ప్రపంచసాహిత్యవేదిక “తెలుగే మన వెలుగు” అనే అంశంపై ఆగస్టు 30వ తేదీన నిర్వహించిన 95వ అంతర్జాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మన తెలుగు భాషకు అద్భుతమైన సేవ చేసిన మహనీయులను, ప్రముఖ వ్యక్తులను మరచిపోకూడదని అందువల్లనే ఉండి ప్రాంతంలో పుట్టిన తిరుపతి వెంకట కవులలో ఒకరైన తిరుపతిశాస్త్రి విగ్రహం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, కొత్తగా కడుతున్న ఒక బ్రిడ్జికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఎల్లాప్రగడ సుబ్బారావు బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామన్నారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఆంగ్ల భాష ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుంటూనే తెలుగుభాషను నిలబెట్టుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యత గురుతరమైనదని అలాగే ప్రభుత్వం అన్ని శాఖలలోను తెలుగుభాషను వాడాలని, పరిపాలనా భాషగా తెలుగు ఉండాలని, ఆంగ్లంలో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులన్నీ వెంటనే తెలుగులో అనువాదం అయ్యేటట్లు చూడాలని, కనీసం ఐదవ తరగతి వరకు మాతృబాషలో విద్యాభోదన జరగవలసిన అవసరం ఉందన్నారు.
ఆచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ.. ఇతర భాషల పదాలను సులభంగా తనలో కలుపుకునే ప్రత్యేకత తెలుగు భాషకు ఉందన్నారు. తెలుగు భాష వైభవాన్ని అనేక మంది ప్రముఖులు ప్రశంసించారని, భాషను విస్తరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా, కళారత్న పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు.
గిడుగు రామమూర్తి మునిమనుమరాలు గిడుగు లక్ష్మీకాంతికృష్ణ మాట్లాడుతూ తన ముత్తాత ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గ్రాంథిక భాష స్థానంలో వ్యవహారిక భాషకు ప్రాధాన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినప్పటికీ కేంద్రం నుంచి తగిన నిధులు సాధించడంలో మరింత కృషి అవసరమన్నారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకు తెలుగు నేర్పేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కేవలం మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థులకు భాష ఎంతవరకు అర్థమవుతోందో చూడాలని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ.. కాలానుగుణంగా తెలుగు భాషలో మార్పులు వస్తున్నాయని, అందరూ కలిసి భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.








