స్టీవ్ జాబ్స్‌ను అమెరికా గూఢచారి సంస్థ CIA ఎందుకు వెతుక్కుంటూ వచ్చింది?
స్టీవ్ జాబ్స్ అంటే మనకు వెంటనే Apple గుర్తుకొస్తుంది. iPhone గుర్తుకొస్తుంది. ప్రపంచాన్ని మార్చిన టెక్నాలజీ గుర్తుకొస్తుంది. అలాంటి హై ప్రొఫైల్ ఉన్న స్టీవ్ జాబ్స్‌ను కలవడానికి అమెరికా గూఢచారి సంస్థ CIA అధికారులు వస్తే? అది ఖచ్చితంగా న్యూసే. కానీ నలభై ఏళ్ల క్రితం అది జరిగినప్పుడు అసలు ఆ విషయమే బయిటకు రాలేదు. ఇన్నాళ్లకు ఈ విషయం మీడియాకు ఎక్కింది.
CIA కు జాబ్స్‌తో ఏం పని ఉంటుంది?
స్టీవ్ జాబ్స్ లాంటి మేధావిని గూఢచారిగా నియమించుకోవడానికా? ఏదైనా రహస్య మిషన్ కోసం సహాయం అడగడానికా? అసలు అదేమీ కాదు.మరేంటి అంటారా?
ఈ కథ 1986లో జరిగింది. అప్పటికి స్టీవ్ జాబ్స్ పరిస్థితి అంత గొప్పగా లేదు! ఈరోజు మనం చూసే స్టీవ్ జాబ్స్ విజయాన్ని వేరు, 1986లో ఆయన జీవితం చాలా భిన్నంగా ఉంది. ఆయనను తన సొంత కంపెనీ Apple నుంచే బయటకు పంపించారు. అవును… ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కంపెనీల్లో ఒకటిగా మారబోయే Apple నుంచి దాని సహ-వ్యవస్థాపకుడైన జాబ్స్ బయటకు రావాల్సి వచ్చింది.
దీంతో జాబ్స్ కొత్తగా NeXT అనే కంప్యూటర్ కంపెనీని ప్రారంభించాడు. కానీ కొత్త కంపెనీ పెట్టడం ఒకత్తు అయితే. దాన్ని నిలబెట్టడం మరొక ఎత్తు. కొత్త సంస్ద NeXTకు డబ్బు కావాలి. పెద్ద కస్టమర్లు కావాలి. మార్కెట్లో తమను తాము నిరూపించుకోవాలి.ఇలా రకరకాలుగా స్టీవ్ జాబ్స్ సతమతమవుతున్న సమయంలో సమయంలో ఊహించని అతిథులు జాబ్స్‌ను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్లే CIA అధికారులు. CIAకి స్టీవ్ జాబ్స్‌తో ఏం పని?
అసలు కథ ఇక్కడే మొదలవుతుంది.
అప్పట్లో ప్రపంచం Cold War మధ్యలో ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ ఒకరిపై మరొకరు నిఘా పెట్టుకుంటున్న కాలం అది. ఆకాశంలో తిరిగే గూఢచారి ఉపగ్రహాలు భూమిపై వేలాది ఫోటోలు తీస్తున్నాయి. కానీ CIA కి ఒక పెద్ద సమస్య ఉంది. ఫోటోలు అంటే తీయగలుగుతున్నారు కానీ ఆ ఫోటోలలో ఏముందో గుర్తించడం కష్టమైపోతోంది!
ఒక ఉపగ్రహం తీసిన చిత్రంలో ఎక్కడో ఒక చోట కొత్తగా క్షిపణి స్థావరం కనిపించవచ్చు.మరో చిత్రంలో సైనిక వాహనాలు ఉండవచ్చు. మరొకచోట అణు కేంద్రంలో మార్పులు కనిపించవచ్చు. కానీ ఇవన్నీ గుర్తించాలంటే మనిషి కళ్లతో ఒక్కో ఫోటో గంటల తరబడి చూస్తూ కూర్చోవడం సరిపోదు. అక్కడే CIAకి ఒక విషయం క్లారిటీ వచ్చింది. “మనకు మరింత శక్తివంతమైన కంప్యూటర్లు కావాలి!”.
అప్పుడు CIA కళ్లలో పడింది… NeXT
సిలికాన్ వ్యాలీలో అప్పటికే కంప్యూటర్ విప్లవం మొదలైంది. కొత్త కంపెనీలు వస్తున్నాయి. కొత్త సాఫ్ట్వేర్లు తయారవుతున్నాయి. కంప్యూటర్లు వేగంగా శక్తివంతమవుతున్నాయి. అప్పుడు CIAలోని కొందరు అధికారులు ఇలా ఆలోచించారు: “ఈ సిలికాన్ వ్యాలీ టెక్నాలజీని మన నిఘా పనులకు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది?” అని. అయితే విషయం బయిటకు రాకూడదు. అలాంటి సంస్ద, వ్యక్తులు కావాలి. ఆ వెతుకులాటలో వారి దృష్టి స్టీవ్ జాబ్స్ కొత్త కంపెనీ NeXTపై పడింది.
జాబ్స్‌ను ఎంచుకోవడానికి కారణం ఆయన కంపెనీ తయారు చేస్తున్న కంప్యూటింగ్ లేటెస్ట్ టెక్నాలజీ.దాంతో CIA ప్రతినిధులు జాబ్స్‌ను కలిశారు. “మీరు సంవత్సరానికి ఎన్ని కంప్యూటర్లు తయారు చేయగలరు?”. జాబ్స్ కు అర్దం కాలేదు కానీ..ఏదో ఉందని మాత్రం అర్దం అయ్యింది. ఎందుకంటే వాళ్లు తమ అసలు ఉద్దేశాన్ని పూర్తిగా బయటపెట్టలేదు.
జాబ్స్ కూడా అంత సులభంగా తన కంపెనీ సామర్థ్యం గురించి వివరాలు చెప్పలేదు. మీకు ఎన్ని అవసరం అన్నాడు. అప్పుడు CIA ప్రతినిధి చెప్పిన సంఖ్య మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉంది. 20,000 కంప్యూటర్లు. అవును. వారికి వేల సంఖ్యలో NeXT వర్క్స్టేషన్లు కావాలి. కానీ అవి దేనికి ఉపయోగిస్తారో జాబ్స్‌కు చెప్పలేదు!
ఎందుకంటే ఇది సాధారణ వ్యాపార ఒప్పందం కాదు. ఇది అత్యంత రహస్యమైన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారం. CIA తమ అసలు రహస్య కార్యక్రమం గురించి పూర్తి వివరాలు ఆయనకు చెప్పలేదు. జాబ్ కు అర్దం అయ్యింది. దాంతో ఆయన కూడా తనకు తెలియకూడని రహస్యాలు చెప్పవద్దని చెప్పారట.
అంటే జాబ్స్‌కు ఒక విషయం తెలుసు. ఇది చాలా రహస్యమైన వ్యవహారం.అయితే ఆ రహస్య కార్యక్రమం ఏమిటో మాత్రం తనకు అనవసరం. అందుకు సరేనని ఎగ్రిమెంట్ సైన్ చేసి, అడ్వాన్స్ తీసుకుని పని మొదలెట్టాడు.
ఈ ఒప్పందం జాబ్స్‌కు ఎంత ముఖ్యమైంది?
ఇది జాబ్స్ జీవితంలో జరిగిన చిన్న సంఘటన మాత్రమే కాదు. ఆ సమయంలో NeXT కంపెనీకి భారీ ఆదాయం అవసరం. కొత్త కంపెనీ. ఖరీదైన కంప్యూటర్లు. అమ్మకాలు ఇంకా స్థిరపడలేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ వ్యవస్థ నుంచి వేల కంప్యూటర్లకు సంబంధించిన అవకాశం రావడం చాలా పెద్ద విషయం.
ఆదాయం మాత్రమే కాదు…
పెద్ద కస్టమర్ తమ టెక్నాలజీపై ఆసక్తి చూపడం అంటే మార్కెట్‌కు కూడా ఒక సందేశమే. “NeXT టెక్నాలజీని సీరియస్‌గా తీసుకోవాలి.” అని అనుకుంటాయి. దాంతో బిజినెస్ పెరిగింది.
ఫైనల్ గా…
1986లో CIA అధికారులు స్టీవ్ జాబ్స్‌ను కలిసినప్పుడు, బహుశా భవిష్యత్తు గురించి ఎవరూ ఊహించి ఉండరు.తర్వాత ఏమైందో మనకు తెలుసు. NeXT కంపెనీ చివరకు Apple చేత కొనుగోలు చేయబడింది. స్టీవ్ జాబ్స్ మళ్లీ Appleలోకి వచ్చాడు. ఆ తర్వాత Apple చరిత్రే మారిపోయింది. Mac OS X వచ్చింది. తర్వాత iPod. తర్వాత iPhone. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని మార్చేసిన ఉత్పత్తులు వచ్చాయి. అందుకే వెనక్కి తిరిగి చూస్తే ఈ CIA–NeXT కథ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








