కొడుకు చనిపోయాక టిక్‌టాక్‌లో తల్లికి కనిపించిన షాకింగ్ నిజం
కన్నబిడ్డను కోల్పోవడం ఏ తల్లి,తండ్రులకైనా జీర్ణించుకోలేని విషాదమే. అదీ ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూడటం మొదలెట్టిన పిల్లాడు చనిపోవటం మరీ బాధాకరం. అయితే ఆ మరణానికి కారణం..టిక్ టాక్ అని తెలిస్తే..ఆ యాప్ చేసిన ప్రయోగం అని తెలిస్తే…
‘ఒక యాప్‌లో చేసిన ప్రయోగం వల్ల ఓ 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు’.
ఈ విషయం వినడానికి కాస్త అతిశయోక్తిలా అనిపించొచ్చు. కానీ ఇప్పుడు అమెరికాలో టిక్‌టాక్‌ను వెంటాడుతున్న విషయం ఇదే.ఆ పిల్లాడు పేరు చేజ్ నాస్కా. అతని మరణం అతని కుటుంబానికి అంతుచిక్కని విషాదం.అసలు టిక్ టాక్ చేసిన ప్రయోగం ఏమిటి.ఈ కుర్రాడు ఎలా ప్రయోగానికి బలి అయ్యాడు అనేది చూద్దాం.
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌కు చెందిన ఆ 16 ఏళ్ల కుర్రాడు చేజ్ నాస్కా. అతను మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.దానికి తోడు ప్రతిభావంతమైన క్రీడాకారుడు. స్నేహితులు ఎక్కువ. కుటుంబంతో సంతోషంగా ఉండే వాడు. మానసిక ఆరోగ్య సమస్యల చరిత్ర కూడా లేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే 2022 ప్రారంభంలో అతడిలో అకస్మాత్తుగా మార్పు కనిపించింది.
ఇంతకుముందు టిక్‌టాక్‌లో సరదా వీడియోలు స్నేహితులకు పంపే చేజ్, ఒక్కసారిగా ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలను షేర్ చేయడం మొదలుపెట్టాడు. స్నేహితులకు అది అర్థం కాలేదు. కుటుంబానికి కూడా అతడు ఇంతటి విషాదంలో ఉన్నాడన్న సంకేతాలు ఏమీ కనిపించలేదు. అయితే ఊహించని విధంగా కొద్ది వారాలకే చేజ్ తన ప్రాణాలు తీసుకున్నాడు. అతడు ఎందుకు ఇలా చేశాడన్న ప్రశ్నకు కుటుంబానికి సమాధానం లేదు. అప్పుడు అతని తల్లి చేజ్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం ప్రారంభించింది.
టిక్‌టాక్ ఖాతాలో కనిపించిన క్లూ
చేజ్ టిక్‌టాక్ ఖాతాలోకి వెళ్లిన అతని తల్లికి ఒక విషయం షాక్ ఇచ్చింది. ఆ యాప్ అతడికి నిరంతరం ఒకే రకమైన వీడియోలను చూపుతోంది. నిరాశ. ఒంటరితనం. నిస్సహాయత. ఆత్మహత్య. అలాంటి వీడియోలు వరుసగా అతని ఫీడ్‌లోకి వస్తున్నాయి. కొన్ని వీడియోలు ఆత్మహత్యను ప్రోత్సహించేలా కూడా ఉన్నాయని తరువాతి నివేదికలు తెలిపాయి.
కొడుకు మరణానికి ముందు అతడు టిక్‌టాక్‌లో అసలు ఏమి చూస్తున్నాడో తెలియని ఆ కుటుంబానికి ఒక్కసారిగా ఇదంతా చూసేసరికి మతిపోయినంత పని అయ్యింది. ఆ పిల్లాడి ఫోన్లోని టిక్‌టాక్ ఖాతా వాళ్ల ముందూ ఒక పెద్ద ప్రశ్నను ఉంచింది. ఒక 16 ఏళ్ల బాలుడికి ఇన్ని విషాదకరమైన వీడియోలు ఎందుకు చూపించబడ్డాయి? ఈ ప్రశ్న అక్కడితో ఆగలేదు.
జర్నలిస్టు ప్రశ్నతో మొదలైన టిక్‌టాక్ విచారణ
చేజ్ మరణించిన దాదాపు ఏడాది తర్వాత Bloomberg Businessweek జర్నలిస్టు ఒలివియా కార్విల్ అతని కథపై దర్యాప్తు ప్రారంభించారు. చేజ్ టిక్‌టాక్ ఖాతాలో కనిపించిన వీడియోలను పరిశీలించిన ఆమె, కంపెనీని నేరుగా ప్రశ్నించారు. చేజ్ ఖాతాకు ఇంత పెద్ద మొత్తంలో ఆత్మహత్య, నిరాశకు సంబంధించిన కంటెంట్ ఎందుకు పంపబడింది? ఆ ప్రశ్న టిక్‌టాక్‌లో అంతర్గత విచారణకు దారితీసింది.
కంపెనీ చేజ్ మరణానికి ముందు రోజులలో అతడు చూసిన వీడియోలను తిరిగి పరిశీలించింది. అతని వాచ్ హిస్టరీని విశ్లేషించింది. చివరి రెండు వారాల్లో అతడు చూసిన 7,563 వీడియోలను పరిశీలించినట్లు అంతర్గత నివేదికలో నమోదైంది. ఆ విచారణలో బయటపడిన విషయం మరింత ఆందోళన కలిగించింది.
చేజ్ చూసిన వీడియోల్లో 73 శాతం వరకు నిరాశ, వ్యక్తిగత సమస్యలు లేదా భావోద్వేగ వేదనకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 10 శాతం వీడియోలు టిక్‌టాక్ సొంత నిబంధనలను కూడా ఉల్లంఘించినవిగా ఇంటర్నెల్ రివ్యూలో తేలినట్లు తరువాత అమెరికా సెనేటర్లు వెల్లడించారు.
అసలు షాక్ వేరే
చేజ్ ఖాతాకు భద్రతా వ్యవస్థ పనిచేయలేదు. 2021లో టిక్‌టాక్ తన అల్గారిథమ్‌లో ఒక భద్రతా మార్పు చేసింది. ఒక వినియోగదారుడికి ఒకే రకమైన ప్రమాదకరమైన కంటెంట్ పదేపదే కనిపించకుండా అడ్డుకోవడమే ఆ వ్యవస్థ లక్ష్యం. ఉదాహరణకు, ఎవరైనా నిరాశకు సంబంధించిన వీడియోలు చూడటం ప్రారంభిస్తే, అల్గారిథమ్ అతడికి అదే తరహా వీడియోలను అంతులేకుండా చూపించకుండా మధ్యలో ఆ క్రమాన్ని విరమింపజేయాలి.
అయితే ఆ భద్రతా వ్యవస్థను టిక్‌టాక్ అందరికీ ఒకేసారి అమలు చేయలేదు. అమెరికాలోని సుమారు 10 శాతం మంది వినియోగదారులను ఒక ప్రయోగం కోసం పాత అల్గారిథమ్లోనే ఉంచింది. అప్పట్లో వారి సంఖ్య సుమారు 1.5 కోట్ల మంది. చేజ్ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. టిక్‌టాక్ ఇంటర్నెల్ ఫైల్స్ లో ఉన్నదాని ప్రకారం, అతడి ఖాతాకు ఈ భద్రతా వ్యవస్థ పనిచేయకపోవడం యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు కాదు. అది ప్రయోగంలో భాగం.
చేజ్‌ను 2022 జనవరిలో ఈ ప్రయోగానికి ఎంపిక చేశారు. ఆ తర్వాత అతని ఖాతా క్రమంగా ఒక ‘ఫిల్టర్ బబుల్’లో చిక్కుకుపోయింది. నిరాశ, స్వీయహాని, ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలు మళ్లీ మళ్లీ అతడికి సిఫారసు చేయబడ్డాయి. నెల రోజులకే చేజ్ మరణించాడు.
అయితే టిక్‌టాక్ ఇలా ఎందుకు చేసింది?
కొత్త భద్రతా వ్యవస్థ వల్ల యాప్‌పై వినియోగదారుల ఆసక్తి తగ్గుతుందా అన్నది తెలుసుకోవడానికే ఈ ప్రయోగం నిర్వహించినట్లు గోప్యమైన పత్రం సూచిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే…వినియోగదారులను హానికరమైన కంటెంట్ నుంచి రక్షిస్తే, వారు టిక్‌టాక్‌లో తక్కువ సమయం గడుపుతారా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి కంపెనీ మిలియన్ల మంది వినియోగదారులను రెండు గ్రూపులుగా విభజించింది.
ఒక గ్రూప్‌కు కొత్త భద్రతా వ్యవస్థ. మరో గ్రూప్‌కు పాత వ్యవస్థ. చేజ్ రెండో గ్రూప్‌లో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వివరాలపై అమెరికా సెనేటర్లు మార్షా బ్లాక్బర్న్, రిచర్డ్ బ్లూమెన్థాల్ టిక్‌టాక్‌ను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకించి ఒక విషయం వారిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ ప్రయోగంలో మైనర్లను ఎందుకు చేర్చారు?
చివరికి మిగిలేది ఒక్కటే…
చేజ్ నాస్కా విషయంలో టిక్‌టాక్ ప్రయోగానికీ అతడి మరణానికీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు ఎవరూ నిర్ధారించలేదు. ఆ ప్రశ్నకు దర్యాప్తులు, కంపెనీ వివరణలు ఇంకా పూర్తి సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ సంఘటన బయటపెట్టిన విషయం మాత్రం స్పష్టమైనది.
టెక్నాలజీ కంపెనీలు తమ యాప్‌లను మెరుగుపరచడానికి చేసే ప్రయోగాలు ఇక స్క్రీన్‌పై బటన్ రంగు మార్చడం, కొత్త ఫీచర్‌ను పరీక్షించడం వరకే పరిమితం కావడం లేదు. మనం ఏమి చూస్తాం, ఎంతసేపు చూస్తాం, ఒకే రకమైన కంటెంట్‌లో ఎంత లోతుకు మనం వెళ్తాం అన్నది సైతం ఆ ప్రయోగాల పరిధిలోకి వస్తోంది.అలాంటప్పుడు ఆ ప్రయోగంలో భాగమైన మనుషుల జీవితాలకు బాధ్యత ఎవరిది? ఇప్పుడు టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా యాప్ లు తేల్చి చెప్పాల్సిన విషయం ఇవే.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








