నెక్ట్స్ జేమ్స్ బాండ్ ఈ కొత్త కుర్రాడేనా? ఏమిటి ఇతని స్పెషాలిటీ?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక పాత్ర ఓ నటుడికి డబ్బు ఇవ్వొచ్చు. ఒక పాత్ర ఓ నటుడికి స్టార్డమ్ ఇవ్వొచ్చు. కానీ జేమ్స్ బాండ్ పాత్ర… ఆ స్టార్ పేరునే మార్చేయగలదు.
ఒక్కసారి ఆ టక్సీడో వేసుకున్నారంటే చాలు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా “ఆ నటుడు” అని కాదు… “007” అని గుర్తుపట్టే స్థాయికి వెళ్లిపోతారు. ఆ పాత్ర ఇస్తే వచ్చే ఇమేజ్ అలాంటిది. మీ నడక నుంచి మాట్లాడే స్టైల్ వరకు, ఆ నటుడు తర్వాత చేసే సినిమాల వరకు కూడా బాండ్ ఇమేజ్ వెంటాడుతుంది. డేనియల్ క్రెగ్ విషయంలో అది ఎంత బలంగా పనిచేసిందో మనం చూశాం.
అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా పాత్రల్లో ఒకటైన జేమ్స్ బాండ్ కోసం పోటీ కూడా మామూలుగా ఉండదు. ఎవరో ఒక హీరోను పిలిచి “ట్రై చేసి చూడు” అని చెప్పి పాత్ర ఇచ్చే వ్యవహారం కాదు ఇది. ఎవరి ముఖం బాండ్‌కు సరిపోతుంది? ఎవరిలో ఆ స్టైల్ ఉంది? యాక్షన్ చేస్తే నమ్ముతామా? సీరియస్ సీన్లలో బరువు మోయగలడా? కామెడీ, చార్మ్ రెండూ కలపగలడా? అన్నీ చూస్తారు.
అన్నిటికంటే ముఖ్యంగా… ఒక్క సినిమా కాదు, రాబోయే ఎన్నో సంవత్సరాలు ఈ పాత్రను మోయగలడా? అన్నదే ముఖ్యంగా చూసే విషయం. అందుకే ఈ పాత్రకోసం ఉండే పోటీ కూడా ఓ రేంజిలో ఉంటుంది.
ఈసారి రేసులో ఉన్న పేర్లు చూస్తేనే విషయం అర్థమైపోతుంది. జాకబ్ ఎలోర్డి, పాల్ మెస్కల్, కాలమ్ టర్నర్, జాక్ లోడెన్, హారిస్ డికిన్సన్… ఇవన్నీ ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిన పేర్లు. ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ ఉంది. ఎవరికైనా స్టార్డమ్ ఉంది, ఎవరికైనా నటుడిగా మంచి పేరుంది. అయితే ఈ పేర్లన్నింటి మధ్యలోకి ఇప్పుడు ఒక పేరు వచ్చి నిలబడింది.
జాక్ బార్టన్.
“ఎవరు ఇతను?” అని మీరు అనుకుంటే… అదే ఈ కథలో అసలు ట్విస్ట్.
బాండ్ పాత్రకు ఇంత క్రేజ్ ఎందుకు?
జేమ్స్ బాండ్ అంటే కేవలం ఒక స్పై క్యారెక్టర్ కాదు. ఆ పాత్రలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఖరీదైన సూట్, చేతిలో గన్, ప్రమాదకరమైన మిషన్, మధ్యలో ఒక డ్రింక్, ఒక కార్, ఒక అద్భుతమైన గాడ్జెట్, అమ్మాయిలు… ఇవన్నీ కలిపి బాండ్ అనే ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని తయారు చేశాయి.
అందుకే సీన్ కానరీ నుంచి డేనియల్ క్రెగ్ వరకు ప్రతి నటుడు బాండ్‌ను తనదైన విధంగా మార్చుకున్నా, ఆ పాత్ర మీదున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఇప్పుడు డేనియల్ క్రెగ్ వెళ్లిపోయాడు. అయితే ఖాళీ అయినది కేవలం ఒక హీరో పాత్ర కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులకు అలవాటైన ఒక ఇమేజ్ ఖాళీ అయింది. ఆ స్థానంలోకి ఎవరు వస్తారన్నదే ఇప్పుడు అసలైన ఆసక్తి.
ఎందుకంటే కొత్త నటుడు బాండ్‌గా కనిపించిన మొదటి క్షణం నుంచే అతని మీద పోలికలు మొదలవుతాయి. “క్రెగ్లా ఉన్నాడా?”, “పియర్స్ బ్రాస్నన్లా చార్మింగ్‌గా ఉన్నాడా?”, “సీన్ కానరీ స్థాయి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందా?” అంటూ ప్రేక్షకులు కొలవడం మొదలుపెడతారు. అంటే ఆ పాత్ర దక్కడం ఎంత పెద్ద అదృష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం అంత పెద్ద పరీక్ష. అందుకే కాస్టింగ్ అంత ఈజీ కాదు
మన దగ్గర ఒక సినిమాకు హీరోను సెలెక్ట్ చేసేటప్పుడు ఆడిషన్ చేస్తారు. ఒకటి రెండు సన్నివేశాలు చూస్తారు. దర్శకుడికి నచ్చితే ఓకే. బాండ్ విషయంలో మాత్రం వ్యవహారం చాలా పెద్దది. ఎందుకంటే ఇక్కడ వాళ్లు ఒక నటుడిని మాత్రమే ఎంచుకోవడం లేదు. ఒక ఫ్రాంచైజీకి కొత్త ముఖాన్ని ఎంచుకుంటున్నారు.
ఈ సారి కొత్త మార్పులు
ఇప్పటికే ఈ సినిమాను డెనిస్ విల్నేవ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. Dune సినిమాలతో భారీ స్థాయిలో విజువల్ కథలు చెప్పిన దర్శకుడు. స్క్రీన్‌ప్లేను Peaky Blinders సృష్టికర్త స్టీవెన్ నైట్ రాస్తున్నాడు. నిర్మాతలుగా అమీ పాస్కల్, డేవిడ్ హేమన్ ఉన్నారు. అంటే కొత్త బాండ్ ఎలా ఉండాలి అన్నదానిపై వీళ్లందరికీ ఒక ఆలోచన ఉంటుంది. అందుకే “హీరో బాగున్నాడు” అనేది సరిపోదు. “ఈ వ్యక్తిని చూస్తే మనకు బాండ్ కనిపిస్తున్నాడా?” అన్నదే అసలు టెస్ట్.
మరి జాక్ బార్టన్ ఎందుకు?
బార్టన్‌కు పెద్ద స్టార్ ఇమేజ్ లేదు. Heartstopper, SAS: Rogue Heroes లాంటి సిరీస్‌లలో నటించాడు. Poor Thingsలో కూడా కనిపించాడు. కానీ జాకబ్ ఎలోర్డి, పాల్ మెస్కల్ లాంటి పేర్లతో పోలిస్తే అతని కెరీర్ చాలా చిన్నదే. బుకీల దగ్గర కూడా అతని పేరు పెద్దగా కనిపించకపోవడానికి కారణం అదే. అంతగా పరిచయం లేని నటుడు. అయితే… బాండ్ విషయంలో అదే అతని స్ట్రెంత్ గా మారుతుందేమో!
ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే…
ప్రేక్షకుల ముందు ఇప్పటికే ఒక హీరోకి పాత ఇమేజ్ ఉందనుకోండి, స్క్రీన్ మీద అతను బాండ్ గా కనిపిస్తే మన మైండ్ వెంటనే “అరే, వీడు ఆ సినిమాలో ఇలా చేశాడుగా” అని కంపేర్ చేస్తుంటుంది. అదే, జనాలకు పెద్దగా తెలియని కొత్త ముఖాన్ని పెడితే… ఆన్ స్క్రీన్ కనిపించేది ఆ నటుడు కాదు, కేవలం ‘జేమ్స్ బాండ్’ మాత్రమే. ఆ మిస్టరీనే బాండ్ పాత్రకు మెయిన్ స్ట్రెంత్. పైగా క్రెగ్ లాగే ఈ కొత్త బాండ్ కూడా చాలా ఏళ్లపాటు ఈ ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లాలని స్టూడియో భావిస్తోంది. అందుకే పెద్ద స్టార్ల కంటే, దీర్ఘకాలం ఈ కొత్త ఇమేజ్ పనిచేస్తుంది. దర్శకుడు డెనిస్ విల్నేవ్కు నచ్చింది ఇదే కావచ్చు.
కానీ పోటీలో ఉన్నది చిన్నవాళ్లు కాదు
జాక్ బార్టన్ ఎదురుగా ఉన్నవాళ్లను చూస్తే మాత్రం పరిస్థితి అంత ఈజీగా కనిపించదు. జాక్ లోడెన్కు Slow Horsesతో మంచి గుర్తింపు ఉంది. కాలమ్ టర్నర్‌కు పెద్ద సినిమాల అనుభవం ఉంది. హారిస్ డికిన్సన్ ఇప్పటికే హాలీవుడ్లో తనకంటూ స్థానం సంపాదించుకున్నాడు. పాల్ మెస్కల్ అయితే ఇప్పటి తరం ప్రతిభావంతులైన నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక జాకబ్ ఎలోర్డి పేరు వస్తే, అతని స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అయితే ఇదంతా ఇప్పటికైతే రూమర్స్, ఇండస్ట్రీ గుసగుసలే. అమెజాన్ ఇంకా అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు. సెప్టెంబర్ మొదట్లో ఈ హీరోలందరికీ అసలైన స్క్రీన్ టెస్టులు జరగబోతున్నాయి. టక్సీడో వేసుకుని కెమెరా ముందుకు వెళ్లాక అసలు సిసలు బాండ్ మెటీరియల్ ఎవరో అప్పుడే తేలనుంది.
చివరకు ఈ జాక్ బార్టన్ నిజంగానే బాండ్ కోటు వేసుకుంటాడా, లేక మరో పేరు తెరపైకి వస్తుందా అనేది ఈ ఏడాది చివరికి కానీ తెలియదు. ఏదేమైనా, హాలీవుడ్ స్టార్ సిస్టమ్‌ను పక్కన పెట్టి ఒక కొత్త కుర్రాడితో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీని రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారంటే మాత్రం విశేషమే!








