చదువు పెరిగే కొద్దీ ఉద్యోగం దూరమవుతోందా! లెక్కలు ఏం చెప్తున్నాయి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“అరేయ్, రేపు ఉదయాన్నే ట్యూషన్‌కి వెళ్లాలి.. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండకు” అని అమ్మ కేకలు వేస్తుంటుంది.
ఎదురుగా ఉన్న హాల్లో సోఫా మీద కూర్చుని టీ తాగుతూ నాన్న పేపర్ తిరగేస్తుంటారు. పక్కనే టేబుల్ మీద టెన్త్ క్లాస్, ఇంటర్ లేదా డిగ్రీ పుస్తకాలు తిరగవేస్తూ కుస్తీ పడుతున్న మన ఇంట్లోని పిల్లవాడో, అమ్మాయో కనిపిస్తారు. మిడిల్ క్లాస్ ఇళ్లల్లో నిత్యం నడిచే సంభాషణే ఇది.
“బాగా చదువురా.. పెద్ద కాలేజీలో సీటు తెచ్చుకో.. డిగ్రీ అయిపోగానే మంచి ఉద్యోగంలో సెటిలైపోతావు” అని మనం వందేళ్లుగా నమ్ముతూ వస్తున్న ఫార్ములా ఇదే. పిల్లలు కూడా అదే నమ్ముతారు. తెల్లారితే లేచి కాలేజీకి పరుగెడతారు. రాత్రి పొద్దుపోయేదాకా కుస్తీ పడతారు.
కానీ, ఏడేళ్లు గడిచి.. చేతిలో డిగ్రీ సర్టిఫికెట్ పట్టుకుని ఆ పిల్లాడు బయటికి రాగానే.. ఎదురుగా నిలబడి మార్కెట్ వేసే ఒకే ఒక ప్రశ్న.. మన గుండెల్ని పిండేస్తుంది.
“చదువు బాగానే ఉంది బాబూ.. కానీ, నువ్వు ఏ పని చేయటానికి పనికొస్తావు?” ఈ మాట వినగానే ఆ కుర్రాడు మైండ్ బ్లాంక్.
“అదేంటి..పిల్లాడు ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు, డిగ్రీ తెచ్చాడు, మరి ఉద్యోగం ఎందుకు రావడం లేదు?” అని తల్లితండ్రులు తల పట్టుకుంటారు. ఇదంతా నిజమేనా? నీతి అయోగ్ తాజా లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి.
నీతి అయోగ్ చెప్పేదాని ప్రకారం.. దేశంలో మొత్తం మీద నిరుద్యోగ రేటు కేవలం మూడు శాతమే.. కానీ డిగ్రీ చదివిన యువత దగ్గరికి వచ్చేసరికి ఆ లెక్క ఏకంగా పదమూడు శాతానికి పెరిగిపోతోంది! ఆడపిల్లలు గ్రాడ్యుయేట్లు అయితే.. ఆ నిరుద్యోగం ఏకంగా ఇరవై శాతం దాటేస్తోంది. చదువు పెరిగితే ఉద్యోగం రావాలి కదా, ఇక్కడ మాత్రం రివర్స్‌లో ఎందుకు జరుగుతోంది? ఇదే అసలు పాయింట్.
నిజం ఏమిటంటే.. డిగ్రీ చేతిలో ఉన్న వంద మందిలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే తాము చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం దొరుకుతోంది. మరి మిగతా తొంబై రెండు మంది?
వాళ్లంతా ఖాళీగా ఉన్నారని కాదు. బీకామ్ చేసినోడు మొబైల్ షోరూమ్‌లో సేల్స్‌మెన్ అవుతున్నాడు. బీఏ చదివిన అమ్మాయి ఏదో ఒక కాల్ సెంటర్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా కూర్చుంటోంది. ఇంజినీరింగ్ చేసినవాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం రాక చివరకు వేరే దారు వెతుక్కుంటున్నాడు.
ఇది చూసి ప్రభుత్వాలు, “పర్వాలేదులే , ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు కదా” అనుకుని సర్దుకుపోతున్నాయి. కానీ ఆ ఇళ్లల్లో పరిస్దితి వేరేగా ఉంటోంది. ఆ పిల్లాడి కోసం తండ్రి పడిన పాట్లు, తల్లి పడిన కష్టాలు, కట్టిన ఫీజులు, కాలేజీ బస్సులు, హాస్టల్ ఖర్చులు.. అన్నీ తలచుకుని..ఏదో చిన్న ఉద్యోగం అదీ సంభందం లేనిది చేయటం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.నాల్గేళ్లు ప్రాణం పెట్టి చదివింది దీనికేనా?
ఇక్కడ అసలు సమస్య పిల్లలది కాదు, మన విద్యా వ్యవస్థది.
మన కాలేజీలు “ఏం చదవాలి?” అని మాత్రమే చెప్తున్నాయి. కానీ బయటి ప్రపంచంలో బతకాలంటే “ఏం చేయగలవు?” అని మార్కెట్ అడుగుతోంది. ఈ రెండింటి మధ్యే ఇప్పుడు అంతులేని గ్యాప్ వచ్చేసింది.
ఇంట్లో కూర్చుని మనం పిల్లలతో అంటుంటాం.. “చదువుకోండి, లైఫ్ సెటిల్ అవుతుంది” అని. కానీ నిజానికి వాళ్లకు డిగ్రీ అయిపోయాక అసలు సినిమా మొదలవుతుంది. అప్పుడు అర్థమవుతుంది.. కాలేజీలో నేర్చుకున్నది కేవలం కాగితాల మీద రాతలు మాత్రమేనని, అసలు లోకం వేరేలా ఉందని!
అందుకే డిగ్రీ అయిపోగానే.. మళ్లీ పరుగుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్లి డిజిటల్ మార్కెటింగ్ అని, కోడింగ్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని అదనపు కోర్సులు నేర్చుకోవాల్సి వస్తోంది. అంటే అసలు విద్య కాలేజీలో కాకుండా, డిగ్రీ అయిపోయిన తర్వాత బయట నేర్చుకోవాల్సి వస్తోందన్నమాట.
ఒక చిన్న నిజం తెలుసా? ఇలా డిగ్రీతో పాటు ఏదో ఒక అదనపు స్కిల్ నేర్చుకున్న యువత నెలకు ముప్పై వేలదాకా సంపాదిస్తుంటే.. కేవలం డిగ్రీ పట్టుకుని తిరుగుతున్నవాళ్ల జీతం ఇరవై వేల లోపే ఉంటోంది. ఆ తేడా నెలకు పది వేలే కావచ్చు.. కానీ అదే పదేళ్లలో లెక్కేస్తే దాదాపు పది లక్షల రూపాయల తేడా వస్తుంది!
ఇప్పుడు మనం, మన పిల్లలు ఆలోచించాల్సిన అసలైన విషయం ఇక్కడే ఉంది.
ఇకపై పిల్లలను “ఏం చదువుతున్నావు?” అని మాత్రమే అడగడం ఆపేద్దాం. ” ఈ డిగ్రీతో పాటు నీ ఏ స్కిల్ వస్తుంది? మార్కెట్ నిన్ను ఎందుకు ఎంచుకోవాలి, నువ్వు దేనికి పనికొస్తావు?”
ఈ ప్రశ్నకి సమాధానం వాళ్ల దగ్గర ఉంటేనే.. రేపు మన ఇంట్లో వాళ్ల ముఖంలో నిజమైన చిరునవ్వు కనిపిస్తుంది. లేదంటే.. సర్టిఫికెట్ల కట్టలతో గదుల్లో కూర్చుని దిగులుపడే రోజులు తప్పవు. మరి, మీ ఇంట్లో ఉన్న ఆ పిల్లాడికి ఈ పాటికే వేరే స్కిల్ ఏదైనా వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి!








