భారత్, చైనా మాకు తల్లి, తండ్రి లాంటివి… నేపాల్ మంత్రి శిశిర్ ఖనాల్ కీలక వ్యాఖ్యలు..!
భారత్, చైనాలు తమ దేశానికి తల్లి,తండ్రి లాంటివని నేపాల్ తెలిపింది. తల్లి స్థానాన్ని తండ్రి, తండ్రి స్థానాన్ని తల్లి భర్తీ చేయలేరని, ఈ రెండు దేశాలతో తమకు ఉన్న అనుబంధం అటువంటిదేనని నేపాల్ మంత్రి శిశిర్ ఖనాల్ పేర్కొన్నారు. ఖాట్మాండులో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్, చైనాలతో సమతుల్య దౌత్యంపై ఎదురైన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
నేపాల్‌ను చైనా తన గుప్పిట్లోకి తీసుకుందంటూ భారత మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తోసిపుచ్చారు. తమ విదేశాంగ విధానం భావోద్వేగాల ఆధారంగా కాకుండా, కేవలం దేశ ప్రయోజనాల ప్రాతిపదికన ఉంటుందని స్పష్టం చేశారు. నేపాల్ మొత్తం వాణిజ్యంలో మూడింట రెండొంతులు వాటా కేవలం భారత్‌తోనే జరుగుతోందని, ఈ విషయంలో మరో దేశం దరిదాపుల్లో కూడా లేదని ఆయన గుర్తుచేశారు.
చైనా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒప్పందంపై కూడా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. 2017లో ఒప్పందం కుదిరినప్పటికీ, గత పదేళ్లలో బీఆర్ఐ ప్రాజెక్టుల కింద తమకు ఒక్క డాలర్ నిధులు కూడా అందలేదని స్పష్టం చేశారు. నేపాల్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఇంధనం, పర్యాటకం, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాల్లో భారత కంపెనీలు ముందుకు రావాలని ఆయన ఆహ్వానించారు.








