మహా విపత్తులో నేపాల్.. కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న సరస్సు..!
హిమాలయ దేశం నేపాల్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఓవైపు మహావిలయం వల్ల వాటిల్లిన విషాదం.. ఆదేశాన్ని తీవ్రంగా అతలాకుతలం చేసింది. వందల మృతదేహాలు బయటపడుతుండగా.. మరికొంతమంది గల్లంతయ్యారు. వారి ఆచూకి ఇప్పటికీ తెలియడం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ తమ వారికోసం బాధితుల ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. మృతులను తలచుకుని కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి.
అయితే… నేపాల్‌కు వరదముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఆకస్మిక వరదలు వచ్చిన రెండు రోజుల తర్వాత టిబెట్ వైపున ఉన్న ఒక సరస్సు కట్టలు తెంచుకొని ప్రవహిస్తోందని నేపాల్ (Nepal) వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతోన్న బృందాలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.
‘‘టిబెట్ వైపున ఒక సరస్సు నుంచి నీరు పొంగిపొర్లుతోందనే సమాచారం ఉంది. సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు, భద్రతా సిబ్బంది, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అంతా సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలి’’ అని నేపాల్ పోలీసులు హెచ్చరించారు. సరస్సులో నీటి ప్రవాహం పెరుగుతోందని రసువా జిల్లా ఉన్నతాధికారి నరేంద్ర పరియార్ వెల్లడించారు. దీంతో స్థానికులు కొండ ప్రాంతాలవైపు తరలివెళ్తున్నారని తెలుస్తోంది.
హిమానీనదం (గ్లేసియర్) విరిగిపడటం నేపాల్‌లో బుధవారం నాటి జల ప్రళయానికి కారణమైంది. ఆ విపత్తు వల్ల పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్ వైపున ఒక సరస్సు ఏర్పడింది. అక్కడ నీటి పరిమాణం పెరగడంతో ప్రస్తుతం అది పొంగిపొర్లుతోంది. దీంతో చైనా (China) కూడా సహాయక చర్యలు నిలిపివేసింది. టిబెట్‌లో మళ్లీ వరదముప్పు పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరిస్థితులను సమీక్షించారు.
టిబెట్ సరిహద్దులోని భోటే కోషి నదీ ప్రవాహం మొదలయ్యే దగ్గర కొత్తగా ఓ సరస్సు ఏర్పడిందని నేపాల్‌కు చైనా ఇప్పటికే అలర్ట్ ఇచ్చింది. గురువారం ఉదయం నాటికి 20లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో ఉన్న ఈ సరస్సులోకి.. మూడు రోజుల్లో మరో 30లక్షల క్యూ.మీ నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో అది తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.








