రాఖీతో మంటలు చల్లారినట్లేనా?
తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఒక ఊహించని, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ పార్టీ అధిష్ఠానం వద్ద బలంగా వినిపిస్తున్న తరుణంలో, సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన రాఖీ పండుగ దృశ్యం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. విభేదాలు, విమర్శల వేడిని పక్కనపెట్టి మంత్రి కొండా సురేఖ నేరుగా సీఎం నివాసానికి చేరుకుని రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం కాంగ్రెస్ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి పర్వదినాన మంత్రులు సీతక్క, కొండా సురేఖలు సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొండా కుటుంబానికి, సీఎం వర్గానికి మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఇరు వర్గాలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్న తరుణంలో అసలు కొండా సురేఖకు సీఎం అపాయింట్మెంట్ దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, సంప్రదాయానికి గౌరవమిస్తూ రేవంత్ రెడ్డి ఆమెకు అవకాశం ఇవ్వడంతో సీఎం కాస్త మెత్తబడ్డారనే రాజకీయ సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈ భేటీలో కొండా సురేఖ వ్యవహరించిన తీరు రాజకీయ విశ్లేషకులను ఆకర్షిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ‘బంగారు రాఖీ’ని ఆమె స్వయంగా కట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రస్తుతం తాను ఎలాంటి రాజకీయాలు మాట్లాడబోనని స్పష్టం చేశారు. సీఎం ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు ఉండాలని కోరుకున్నారు. వివాదాల నడుమ కూడా అనుబంధాన్ని చాటుకుంటూనే, సంక్షోభాన్ని చల్లార్చే వ్యూహాత్మక అడుగుగా కొండా సురేఖ ఈ అవకాశాన్ని వాడుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈ కలయిక అనంతరం ఇరువురు నేతలు ‘ఎక్స్’ వేదికగా పరస్పరం గౌరవప్రదమైన ప్రకటనలు చేశారు. “సహచర మంత్రి సీతక్కతో కలిసి సోదరులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలసి రాఖీ కట్టాను. మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.” అని కొండా సురేఖ ట్వీట్ చేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ, “అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. ఈ రాఖీ పండుగ ప్రతీ ఆడబిడ్డకు ఆనందాలను పంచాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొనడం విభేదాల సెగను తగ్గించే ప్రయత్నంగా కనిపించింది.
ఈ రాఖీ ఎపిసోడ్ తో కొండా సురేఖ వివాదానికి తాత్కాలికంగా ఫుల్స్టాప్ పడినట్లే కనిపిస్తున్నా, తెరవెనుక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. అధిష్ఠానం వద్ద కొనసాగుతున్న అసంతృప్తి, పార్టీలోని అంతర్గత శక్తుల ఒత్తిడి దృష్ట్యా ఈ బంధం పరిపాలన, రాజకీయ వివాదాలకు శాశ్వత చెక్ పెడుతుందా.. లేక భవిష్యత్తులో మరేదైనా కొత్త మలుపు తిరుగుతుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








