రాఖీ బంధం వెనుక రాజకీయ చదరంగం!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు అనూహ్యంగా తెరపడింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు, వివాదాల నేపథ్యంలో ఆమె మంత్రి పదవిపై వేటు పడటం దాదాపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. అధిష్ఠానం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్న తరుణంలో, సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆమె రాఖీ కట్టడం ఒక్కసారిగా సమీకరణాలను మార్చేసింది. ప్రతి ఏటా రాఖీ కట్టే ఆనవాయితీని కొనసాగించడమే ఇందులో కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక ఇరువైపులా పక్కా రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో కొండా సురేఖ వేసిన రాఖీ ఎత్తుగడ అత్యంత వ్యూహాత్మకమైనదిగా కనిపిస్తోంది. ఒకవేళ రాఖీ కట్టిన తర్వాత కూడా తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని మంత్రివర్గం నుంచి తప్పిస్తే, అది రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డికే నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. “ఎంతో ఆప్యాయంగా స్వయంగా వెళ్లి రాఖీ కట్టినా.. కనికరం లేకుండా గెంటేశారు” అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆమెకు బలమైన రాజకీయ ఆయుధం దొరుకుతుంది. దానికితోడు, తాను ఒక బీసీ మహిళా నాయకురాలినని, అందుకే తనపై ఇంతటి వివక్ష చూపారంటూ బీసీ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చి పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టే ఆస్కారం ఉంది. ఈ సమీకరణాలన్నింటినీ బేరీజు వేసుకునే సురేఖ.. సంక్షోభ నివారణకు రాఖీని ఒక రక్షణ కవచంగా మలుచుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేశారు. తీవ్ర వివాదాలు చుట్టుముట్టినా, ఆమె రాఖీ కడతానని కోరగానే అనుమతినిచ్చి ఒక సంయమనశీలిగా కనిపించే ప్రయత్నం చేశారు. తనను ఎవరెన్ని విమర్శలు చేసినా, వివాదాలు సృష్టించినా పార్టీ సహచరురాలి పట్ల పెద్ద మనసుతో వ్యవహరించాననే సంకేతాన్ని పార్టీ శ్రేణుల్లోకి, ప్రజల్లోకి పంపడంలో రేవంత్ సఫలమయ్యారు.
అయితే, ఈ పరిణామం రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో మరింత వ్యూహాత్మక పైచేయిని అందిస్తుంది. అంతగా సయోధ్య కుదిరిన తర్వాత కూడా కొండా వర్గం మళ్లీ హద్దులు దాటితే, అప్పుడు కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తి నైతిక బలం రేవంత్ చేతికి వస్తుంది. “ఇంతగా గౌరవించి అవకాశం ఇచ్చినా మళ్లీ పార్టీకి నష్టం కలిగించారు” అని హైకమాండ్ ముందు గట్టిగా వాదించి వేటు వేయడానికి ఇది తిరుగులేని గ్రౌండ్‌ను సిద్ధం చేసింది.
ప్రస్తుతానికి ఈ రాఖీ ఎపిసోడ్‌తో కొండా సురేఖ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. హైకమాండ్ దృష్టిలో తీవ్ర చర్యల నుంచి ఆమెకు తక్షణ ఉపశమనం లభించినప్పటికీ, ఇది శాశ్వత పరిష్కారం కాదనేది స్పష్టమవుతోంది. కొండా కుటుంబం నుంచి భవిష్యత్తులో పార్టీ లైన్‌కు భిన్నంగా మరో చిన్న ప్రకంపన వచ్చినా, ఈసారి చర్యలు ఊహించని రీతిలో తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య నెలకొన్నది కేవలం ‘రాజకీయ కాల్పుల విరమణ’ మాత్రమేనని, రాబోయే రోజుల్లో కొండా దంపతుల వ్యవహారశైలిపైనే వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.








