రిషభ్ పంత్‌పై అశ్విన్ తీవ్ర అసంతృప్తి..!
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishab pant) ఆటతీరుపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పంత్ రెండు అర్ధసెంచరీలతో కలిపి మొత్తం 168 పరుగులు చేసినప్పటికీ, అతని నిలకడలేని ప్రదర్శన పట్ల అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానల్ ‘యాష్ కి బాత్’ వేదికగా అశ్విన్ మాట్లాడుతూ.. పంత్ పట్ల మేనేజ్మెంట్ చూపిస్తున్న మితిమీరిన లాయల్టీని, ప్రత్యేక ప్రాధాన్యతను నిలదీశారు.
“రిషభ్ పంత్ నుండి నా అంచనాలు ఇప్పటికీ నెరవేరలేదు, నన్ను క్షమించండి” అంటూ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో పంత్ ఆడిన క్లాస్ ఇన్నింగ్స్‌లను తాను గౌరవిస్తానని, కానీ వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ లాంటి ఆటగాళ్ల భాగస్వామ్యం లేకపోతే ఆ మ్యాచ్‌లు గెలిచేవాళ్లం కాదని గుర్తుచేశారు. ఒక టెస్ట్ మ్యాచ్ గెలవడానికి 11 మంది క్రికెటర్ల కష్టం అవసరమని, కానీ ఒకే ఒక్క క్షణం బుద్ధిహీనత వల్ల మ్యాచ్ చేజారిపోతుందని పంత్ బాధ్యతారాహిత్య షాట్లను ఎండగట్టారు.
వీరేంద్ర సెహ్వాగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ వంటి దిగ్గజాలు కూడా దూకుడుగా ఆడారని, కానీ జట్టు 500 పరుగుల వెనుకంజలో ఉన్నప్పుడు మార్కో జాన్సెన్ లాంటి బౌలర్ల బౌలింగ్‌లో క్రీజ్ వదిలి ముందుకు వచ్చి వికెట్లు పారేసుకోలేదని పరోక్షంగా చురకలు అంటించారు. పంత్‌ను ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్’ అంటూ కీర్తించడాన్ని అశ్విన్ తీవ్రంగా తప్పుపట్టారు. “ఈ మార్కెటింగ్ లైన్లు నా ముందు ఎప్పుడూ వాడకండి.
ఒకవేళ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే యశస్వి జైస్వాల్(Yasaswi Jaiswal) లాంటి ఆటగాళ్లకు కూడా ఇవ్వాలి. పంత్ ఇప్పటికే 50 టెస్టులు ఆడి మంచి అనుభవం గడించాడు, ఇకనైనా బాధ్యత తీసుకోవాలి. అతని తప్పుడు నిర్ణయాల వల్లే ప్రస్తుతం మిగతా రెండు ఫార్మాట్లలో (వన్డే, టీ20) స్థానం కోల్పోయాడనే నిజాన్ని పంత్‌కు ముఖం మీదే చెప్పాలి. ఆ రోజు అతను వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్-ఫార్మాట్ ప్లేయర్ అవుతాడు” అని అశ్విన్ హితవు పలికారు.








