వర్జీనియాలో మధుర జ్ఞాపకాలతో సాగిన తానా మహిళల వేడుక..
తానా ఆధ్వర్యంలో జరిగిన మహిళల రెట్రో మీట్ అప్ కార్యక్రమం విజయవంతమైంది. “రెట్రో అంటే కేవలం గడిచిపోయిన కాలం, పాత పాటలు లేదా నాటి ఫ్యాషన్ మాత్రమే కాదు… మన బాల్యం, జ్ఞాపకాలు, సంస్కృతి మరియు సంప్రదాయ విలువల కలబోత.” ఈ వినూత్న ఆలోచనతో తానా కల్చరల్ కో ఆర్డినేటర్ సాయిసుధ పాలడుగు మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రెట్రో రీట్రీట’ కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. కేవలం ఒక వినోద వేడుకగా కాకుండా, తెలుగు సినీ రంగానికి పునాదులు వేసిన పాతతరం సూపర్స్టార్లకు ఒక అత్యద్భుతమైన నివాళిగా ఈ ఈవెంట్ నిలిచింది. వర్జీనియాలోని ఛాంటిల్లీలో నిర్వహించిన తానా మహిళల రెట్రో మీటప్ కార్యక్రమానికి పలువురు మహిళలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాయి సుధ పాలడుగు ఇది కేవలం వినోద కార్యక్రమం కాదు. మన పాతతరం మహానటులు, గాయకులు, కళాకారులకు ఇచ్చే హృదయపూర్వక నివాళి. తమ ప్రతిభ, కృషి, పట్టుదలతో కళారంగంలో విశిష్ట స్థానం సంపాదించి, తరువాతి తరాలపై చెరగని ముద్ర వేసిన ఆ మహనీయులను మనం ఎప్పటికీ మరువలేం.వారి కళను గౌరవించడం, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత. ఈ వేడుక ద్వారా మన సంప్రదాయాలు, కళలు, సంగీతం, వస్త్రధారణ, కుటుంబ విలువలు వంటి మన మూలాలను మరోసారి స్మరించుకున్నాం. మన మూలాలే మన గుర్తింపు. వాటిని గౌరవిస్తూ, పరిరక్షిస్తూ, భావితరాలు తమ కొత్త ఆలోచనలతో వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నామని చెప్పారు.
తానా కేవలం ఒక వేదిక కాదు. మన మూలాలను కాపాడుతూ, మన సంస్కృతిని ఘనంగా జరుపుకుంటూ, మన ప్రతిభను భావితరాలకు అందించే సజీవమైన కుటుంబం. మన మూలాలు బలంగా ఉంటే, మన భవిష్యత్తు మరింత బలంగా ఉంటుంది.” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తానా సాంస్కృతిక బృంద సభ్యులు సుష్మ అమృతలూరి, శ్రీవిద్య సోమ, హరిత వెలగా, నివేదిత, శైలజ, గీత, శ్రీదేవి, తనూజ, శాంతి, శ్వేత, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.








