హైప్ లేకుండా హిట్ కొట్టిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర భక్తి ప్రభంజనం!
స్టార్ హీరోలు లేకపోయినా.. పెద్దగా ప్రచారం చేయకపోయినా ఓ డివోషనల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర నెమ్మదిగా సత్తా చాటుతోంది. ఇటీవల బాలీవుడ్లో రిలీజైన హనుమాన్ అంశ్(Hanuman Amsh) మొదటి రోజుల్లో సాధారణ రెస్పాన్స్ తో మొదలై, మౌత్ టాక్‌తో క్రమంగా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తోంది. మొదట్లో రోజుకు కొన్ని వేల టికెట్లకే పరిమితమైన బుకింగ్స్.. తాజాగా లక్ష టికెట్ల స్థాయికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు భారీ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్ద ఎత్తున ప్రమోషనల్ క్యాంపెయిన్ నిర్వహించకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఉత్తరాది ప్రాంతాల్లో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో షోలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇతర భారీ సినిమాల పోటీ మధ్య పలు షోలు కొనసాగుతుండటం సినిమాకు వచ్చిన ఆదరణకు సంకేతంగా కనిపిస్తోంది.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా(Neem Karoli baba) లైఫ్ లోని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సాధారణ భక్తి కథకు భిన్నంగా ఆయన లైఫ్ లో చోటుచేసుకున్న ఆసక్తికరమైన సంఘటనలను తెరపై ఆవిష్కరించడమే సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది. ముఖ్యంగా బాబాను నమ్మే భక్తుల్లో ఈ సినిమా స్పెషల్ ఇంట్రెస్ట్ ను రేకెత్తిస్తోంది.
విశాల్ చతుర్వేది(Vishal Chathurvedi) దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథ, నేచురల్ లొకేషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ.15 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్టు సమాచారం. పెద్దగా హైప్ లేకుండానే ఈ స్థాయి కలెక్షన్స్ అందుకోవడం.. ప్రస్తుతం డివోషనల్ కంటెంట్‌కు ఉన్న మార్కెట్‌ను మరోసారి చర్చలోకి తెచ్చింది.








