కేసీఆర్ బాటలోనే కవిత ‘ఆంధ్రా సెంటిమెంట్’ అస్త్రం!
తెలంగాణ రాజకీయాలు మరోసారి స్థానికత, ప్రాంతీయ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగానైతే ‘ఆంధ్రా పెత్తనం’, ‘ఆంధ్రా పాలకులు’ అనే నినాదాలను అస్త్రంగా మలచుకుని ఉద్యమాన్ని ఉధృతం చేసి అధికారాన్ని దక్కించుకున్నారో, సరిగ్గా అదే తరహా వ్యూహాన్ని ఆయన కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభాన్ని అధిగమించేందుకు, ప్రజల్లో తిరిగి ప్రాంతీయ భావోద్వేగాలను రగిల్చేందుకు కవిత సరికొత్త పోరాట బాటను ఎంచుకున్నారనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. రేవంత్ రెడ్డిని ‘అనుముల రేవంత్ రెడ్డి’ కాదు, ‘ఆంధ్రా రేవంత్ రెడ్డి’ అని అభివర్ణిస్తూ, ఆయన ఆంధ్రా శక్తుల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పాలనాపరమైన, నామినేటెడ్ పదవుల్లో ఆంధ్రా వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారని ఆమె ఆధారాలతో సహా ఆరోపణల దాడి ప్రారంభించారు.
తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను ఆంధ్రా వారికి కట్టబెట్టడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో బ్రాహ్మణ మేధావులు లేరా అని ప్రశ్నిస్తూ, ప్రస్తుత ఛైర్మన్ బసవరాజు శ్రీనివాసరావు గతంలో తెలంగాణ ఉద్యమకారులను, దళిత మహిళలను కించపరిచిన పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. పేద బ్రాహ్మణులకు అండగా ఉండాల్సిన పరిషత్‌ను అడ్డాగా మార్చారని ఆరోపించారు.
అదేవిధంగా తెలంగాణ భక్తుల నిధులతో పునర్నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డులో ఆంధ్రా సినీ హీరో భార్యకు సభ్యత్వం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. రెడ్కో ఛైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు ఇరిగేషన్, విద్యుత్ వంటి అత్యంత కీలకమైన శాఖల్లో ఆంధ్రా అధికారుల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. కృష్ణా జలాలను ఆంధ్రా పాలకులు తరలించుకుపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, బీజేపీ, ఆంధ్రా శక్తులతో రేవంత్ రెడ్డికి ఉన్న రహస్య లాలూచీ వల్లే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఆంధ్రా ఎంపీ కుమారుడు ఆరు కోట్ల రూపాయల విలాసవంతమైన కారుతో ఢీకొట్టి, ఒడిశాకు చెందిన 25 ఏళ్ల పేద గృహ కార్మికురాలిని బలితీసుకున్న ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో తండ్రి పేరు కూడా లేకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తన విదేశీ పర్యటనకు అడ్డంకులు ఎదురైతే 48 నిమిషాల పాటు మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన ముఖ్యమంత్రి, నిరుపేద యువతి ప్రాణం పోయినప్పుడు కనీసం ఒక్క క్షణం కూడా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అలాగే బయోకాన్ సంస్థలో తెలుగు మాట్లాడినందుకు 200 మందిని తొలగించినా, నారాయణ విద్యాసంస్థల్లో విద్యా సంవత్సరం మధ్యలో సిబ్బందిని తొలగించినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని పేర్కొన్నారు.
కవిత తాజా విమర్శల వెనుక ఒక పక్కా రాజకీయ ఎత్తుగడ కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాలనాపరమైన వైఫల్యాలను కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, ‘తెలంగాణ వర్సెస్ ఆంధ్రా’ కోణంలోకి మళ్లించడం ద్వారా ప్రజల సెంటిమెంట్‌ను తన పార్టీ వైపు తిప్పుకోవచ్చనేది కవిత వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. అయితే, ఒకప్పుడు ఉద్యమకాలంలో తిరుగులేని అస్త్రంగా పనిచేసిన ఈ ఆంధ్రా సెంటిమెంట్, రాష్ట్రం ఏర్పాటైన దశాబ్దం తర్వాత ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతీయ అస్త్రాలను ఎలా తిప్పికొడుతుందో చూడాలి.








