‘సహ’ సినిమా చూశాను. చాలా బావుంది. : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీవాసు
శివ కుమార్ కాసారం, నిషాంత్ దోటి, తేజేశ్వర్ వెల్పుచర్ల, సుమైరా స్టూడియోస్ ‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు)’ ఎమోషనల్ జర్నీ ట్రైలర్ లాంచ్
నిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
సంజు జీవితంలోని బాల్యం, స్కూల్ డేస్, కాలేజీ, తొలి ప్రేమ, వివాహం.. ఆ తర్వాత చోటుచేసుకునే భావోద్వేగ మలుపులు ఇలా అతడి జీవితంలోని కీలక దశలన్నీ ట్రైలర్లో కనిపిస్తాయి. అయితే సంజు జీవితంలోకి సహా అనే అమ్మాయి రావడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఆమె పేరు మాత్రమే కాదు.. గతంలో తన జీవితంలో ఉన్న ఓ వ్యక్తితో ఆమెకు ఉన్న పోలికలు సంజును ఆలోచనలో పడేస్తాయి.
కొన్ని బంధాలు తిరిగి మన జీవితంలోకి రావడం ముందే నిర్ణయించబడిందా? గతాన్ని నిజంగా పూర్తిగా వదిలి ముందుకు వెళ్లగలమా? కాలం గడిచినా కొన్ని భావోద్వేగాలు ఎందుకు మనలోనే మిగిలిపోతాయి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలను ఈ కథ లేవనెత్తుతుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌కే పరిమితం చేయకుండా.. జ్ఞాపకాలు, భావోద్వేగ గాయాలు, అంగీకారం, గతానికి ముగింపు పలికే ప్రయత్నం వంటి అంశాలను కూడా ఈ చిత్రం ప్రజెంట్ చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
కుమార్ కాసారం సంజు పాత్రలో సహజంగా కనిపించారు. బాల్యం నుంచి జీవితంలోని వివిధ దశల వరకు పాత్రలోని భావోద్వేగాలను చక్కగా పలికించారు. శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
దర్శకుడు నిషాంత్ దోటి కథను సున్నితమైన, సహజమైన ట్రీట్మెంట్తో తెరకెక్కించారు. కేవలం డ్రామాటిక్ సన్నివేశాలపై ఆధారపడకుండా.. ప్రేక్షకులు తమ జీవితాలతో కనెక్ట్ చేసుకునే భావోద్వేగాలు, పరిస్థితుల ద్వారా కథను ముందుకు తీసుకెళ్లారు.
శేఖర్ చంద్ర అందించిన సంగీతం సినిమాకు నాస్టాల్జిక్ వాతావరణాన్ని మరింత పెంచింది. మెలోడీ, ఎమోషన్‌తో కూడిన సంగీతం ఆకట్టుకుంది. కరుణాకర్ కె. సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణగా నిలవగా, దినేష్ పెద్ది ఎడిటింగ్ మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘనా సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సహ పోస్టర్ మీద ‘ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని వేశారు. ఇది కంటెంట్ మీద నమ్మకంతో మేకర్స్ వేశారు. ఆ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను చూశాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కంటెంట్‌లో ఎంతో కొంత విషయం ఉంటేనే నేను ముందుకు వచ్చి మాట్లాడతాను. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి సినిమా. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఒక సినిమా విజయం సాధించాలంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. అవన్నీ కూడా ఈ సినిమాకి కలిసి వస్తాయని భావిస్తున్నాను. టీమ్ అందరూ కష్టపడి చాలా మంచి సినిమా తీశారు. ఈ సినిమా నిర్మాత కొత్త వాళ్లని ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి నిర్మాత తీస్తున్న సినిమా గురించి మాట్లాడాలని వచ్చాను. అలాగే ఈ సినిమా కంటెంట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమాకి థియేటర్లలో మంచి ప్రశంసలు వస్తాయని నమ్ముతున్నాను. డైరెక్టర్ చాలా మంచి కంటెంట్ రాసుకున్నాడు. అంతే అద్భుతంగా తీశాడు. నిజానికి ఈ సినిమా చాలా కాంపిటీషన్లో వస్తుంది. కాకపోతే ధైర్యంతో, కంటెంట్ మీద నమ్మకంతో వస్తున్నారు. హీరో శివ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమా చాలా బాగుంది. తప్పకుండా అందరూ సినిమాని సపోర్ట్ చేసి సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘సహా – ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని పోస్టర్ పెట్టారు. ఇలాంటి టైటిల్ పెట్టాలంటే చాలా దమ్ము కావాలి. ఇదంతా వాళ్ల కంటెంట్, కథ నుంచి వచ్చిన దమ్ము. తేజ, అందరూ కొత్త వాళ్లందరికీ ఒక గొప్ప అవకాశం ఇస్తూ ఈ సినిమా చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలను అందుకుంటుంది. శ్వేత ఛాలెంజ్ చేసింది. తను జుట్టుతో చాలా అందంగా ఉంది. తను జుట్టు ఉండాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ చేసి, వారిని జుట్టుతో చూసే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను (నవ్వుతూ) శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా సెప్టెంబర్ 4న వస్తోంది. చాలా సినిమాలు వస్తున్నాయి. దాంతోపాటు ఈ సినిమా కూడా వస్తుంది. కంటెంట్ మీద నమ్మకంతో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
హీరో శివకుమార్ మాట్లాడుతూ.. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన బన్నీ వాసు గారికి, వంశీ థాంక్యూ సో మచ్. వాళ్లు రావడంతో బ్లాక్‌బస్టర్ వైబ్ వచ్చింది, ఒక అద్భుతమైన సినిమా మీరు థియేటర్లలో చూడబోతున్నారు. మీరు ఎంత అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా అందుకుంటుంది. మీ అంచనాలను సినిమా అందుకుంటే మీ పక్కవారితో షేర్ చేసుకోండి. చిన్న సినిమా బ్లాక్‌బస్టర్ కొడితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపిస్తాం. కచ్చితంగా విజయం సాధిస్తుంది. చాలా రోజులపాటు గుర్తుండిపోతుంది.
హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ. మాకు సపోర్ట్ చేస్తున్న బన్నీ వాసు గారికి వంశీ గారికి థాంక్యూ సో మచ్. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కథ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే సినిమా చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత ఎంత మంచి సినిమా తీశామని మీరు అనుకుంటారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయితే నేను అమీర్‌పేట్ సెంటర్లో నిల్చుని గుండు గీయించుకుంటాను. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీశాం. మేము చాలా గట్టిగా కొట్టబోతున్నాం. అందరూ థియేటర్‌కు వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను. ఇది ఒక సినిమా మాత్రమే కాదు.. 50 మంది కొత్తవారి జీవితం, వాళ్ల కళ. సెప్టెంబర్ 4న థియేటర్లో కలుద్దాం.
డైరెక్టర్ నిశాంత్ మాట్లాడుతూ.. బన్నీ వాసు గారికి, వంశీ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మాది చిన్న సినిమా అయినా ఇందులో ఉన్న ఎమోషన్ చాలా పెద్దది. మా కల దానికంటే పెద్దది. గత పది ఏళ్లలో వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా మాది అవుతుందని నమ్మకంగా చెబుతున్నాను. అందుకే ‘ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని పేరు పెట్టాము. మన జీవితంలో కొన్ని ఎమోషన్స్ మనతో ఎప్పుడూ పాటు ట్రావెల్ అవుతుంటాయి. అలాంటి ఎమోషన్ ‘సహా’. ఈ సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు కచ్చితంగా ఈ సినిమా గురించి మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటారు.
వ్రజన పాండ్య మాట్లాడుతూ.. ఈ సినిమా మీరు చూసి బయటకు వస్తున్నప్పుడు మీ మనసు చాలా మంచి ఎమోషన్‌తో నిండిపోతుంది. అలాగే ఒక తెలియని నిశ్శబ్దం కూడా ఏర్పడుతుంది. తర్వాత మీరు ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. కచ్చితంగా ఈ సినిమా మీ మీద అలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. సెప్టెంబర్ 4న ఈ సినిమా అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.








