జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కాంబోలో రూపొందుతోన్న ‘ఘమాసాన్’ సెప్టెంబర్ 11న జీ5లో స్ట్రీమింగ్
బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒకే ఆలోచనతో ఏర్పడే క్రియేటివ్ కాంబినేషన్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. వైవిధ్యమైన కథలను ప్రోత్సహించడం, ధైర్యమైన సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ప్రేక్షకులను కేంద్రంగా చేసుకుని వినోదాన్ని అందించాలనే ఆలోచనతో జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి ఓ ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ సినిమాయే ‘ఘమాసాన్’. ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ బుధవారం రోజున విడుదల చేశాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న హిందీ జీ5లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది. ‘ఘమాసాన్’ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే (జియో స్టూడియోస్), పీయూష్ సింగ్, అభయానంద్ సింగ్, సౌరభ్ గుప్తా, అశ్విని చౌదరి (గోల్డెన్ రేషియో ఫిల్మ్స్), మితెన్ షా (యేల్స్టార్ ఫిల్మ్స్) సంయుక్తంగా నిర్మించారు.
టిగ్మాన్షు ధూలియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘమాసాన్’ ట్రైలర్.. అధికారం, వెంటాడటం, మనుగడ చుట్టూ సాగే రఫ్ అండ్ గ్రిప్పింగ్ కథతో కూడిన సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. హిందీ హార్ట్‌ల్యాండ్ (హిందీ భాష, సంస్కృతి ప్రధానంగా ఉండే ఉత్తర, మధ్య భారత ప్రాంతాలు) నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. సంక్లిష్టతతో కూడిన ప్రపంచాలను తనదైన శైలిలో ఆవిష్కరించే టిగ్మాన్షు ధూలియా కథా శైలిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ అధికారం, మనుగడ మధ్య సాగే పోరాటంలో ప్రశ్నలే కాదు.. వాటి సమాధానాలు కూడా కఠినంగా ఉంటాయి. మహారాజ్‌గా అర్షద్ వార్సీ, ఆదిత్యగా ప్రతీక్ గాంధీ కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య జరిగే పోరాటం కేవలం పోలీస్, నేరస్థుడి మధ్య జరిగే సాధారణ ఘర్షణలా ఉండదు. అధికారం, నమ్మకం, రాజకీయాలు, మనుగడతో ముడిపడిన ఓ పూర్తి వ్యవస్థపై నియంత్రణ కోసం సాగే పోరాటంగా మారుతుంది. ఈ కథలో పూర్తిగా మంచి హీరోలు అంటూ ఎవరూ ఉండరు.. ఇక్కడ హీరో ఎవరు, విలన్ ఎవరు అన్నది అంత సులభంగా తేలదు.. మంచి, చెడుల మధ్య స్పష్టమైన గీత ఉండదు. పాత్రల్లో గ్రేషేడ్స్ కనిపిస్తాయి.
‘ఘమాసాన్’ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, సినీవెంచర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ప్రముఖ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శించబడింది.ట్రైలర్ విడుదల సందర్భంగా.. హిందీ జీ5 బిజినెస్ హెడ్, టీవీ చీఫ్ ఛానల్ ఆఫీసర్ కావేరి దాస్ మాట్లాడుతూ..“మా దృష్టిలో మంచి కథలతో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేయడం, వైవిధ్యమైన కథలను అందించే రైటర్స్, డైరెక్టర్స్‌ను ప్రోత్సహించడం, మూస ధోరణులను సవాలు చేయడానికి వెనుకాడకపోవడం నుంచే పుడతాయి. ‘ఘమాసాన్’ వంటి కథను ప్రత్యేకంగా నిలబెట్టేది కూడా అదే. ఈ కథ మన నేటివిటీకి దగ్గరగా, ఎంతో తీవ్రతతో సాగుతుంది. ఇందులోని పాత్రలను కేవలం కొన్ని పరిధుల్లో ఇమిడ్చలేం.. అదే వాటిని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీల మధ్య జరిగే పోరు సాధారణ పోలీస్ వర్సెస్ నేరస్థుడి ఘర్షణను దాటి కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇక టిగ్మాన్షు ధూలియా తనదైన కథన శైలితో అధికారం, నమ్మకం, రాజకీయాలు, మనుగడ వంటి అంశాలు స్పష్టమైన మంచి-చెడు అనే గీతలతో కనిపించని ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఇందులో హీరోలు, విలన్లు అంటూ సులభంగా విభజించడానికి వీలుండదు.. అదే ప్రేక్షకులను కథలో మరింతగా లీనమయ్యేలా చేస్తుంది. జియో స్టూడియోస్‌తో మా భాగస్వామ్యం కూడా విభిన్నమైన కథలను ప్రోత్సహించాలనే ఉమ్మడి ఆలోచన నుంచే ఏర్పడింది. ఏదో కొత్తగా చెప్పాలనుకునే కథలకు, వాటిని తమదైన శైలిలో చెప్పాలనుకునే ప్రతిభావంతులైన సృజనకర్తలకు పూర్తి స్వేచ్ఛ, అవకాశాలు కల్పించాలన్నదే మా ఉద్దేశం’’ అన్నారు.
గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ రచయిత, నిర్మాత పీయూష్ సింగ్ మాట్లాడుతూ..“బుందేల్‌ఖండ్ లోయల్లో చట్టం, చట్టవిరుద్ధం మధ్య ఉన్న సరిహద్దు దుమ్ము, రక్తంలో కలిసిపోయినట్టుగా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో సాగే ‘ఘమాసాన్’ కేవలం ఒకరిని మరొకరు వెంటాడే కథ కాదు.. ఎక్కడా వెనక్కి తగ్గని రెండు శక్తుల మధ్య జరిగే తీవ్రమైన పోరాటం. ఒక వ్యక్తి తన భుజాలపై న్యాయ భారాన్ని మోస్తూ వేట సాగిస్తాడు. మరొక వ్యక్తి తన రక్తంలో రగులుతున్న తిరుగుబాటు జ్వాలతో తన సామ్రాజ్యాన్ని నడిపిస్తాడు. నేను చెప్పాలనుకున్న కథ ఇదే.. ఎలాంటి దాపరికాలు లేకుండా, పచ్చిగా, మన హిందీ ప్రాంతాలకు చెందిన నేలతో ముడిపడి ఉన్న కథ. ప్రతిభావంతుడైన టిగ్మాన్షు ధూలియా దర్శకత్వంలో, ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీల అద్భుతమైన నటనతో ప్రాణం పోసుకున్న ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ నిర్మించాయి. ‘ఘమాసాన్’.. ప్రేక్షకులు చూపు తిప్పుకోలేనంత బలమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు టిగ్మాన్షు ధూలియా మాట్లాడుతూ..“‘ఘమాసాన్’ కథ నాకు ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిని కలిగించే సరికొత్త ప్రపంచంలో సాగుతుంది. అదే హిందీ హార్ట్‌ల్యాండ్.. అక్కడి ప్రజలు, వారి జీవితాలను ప్రభావితం చేసే సంక్లిష్ట పరిస్థితులు ఈ కథకు మూలం. కథలో ప్రధానంగా మహారాజ్, ఆదిత్యల మధ్య సాగే పోరాటం ఉంటుంది. భిన్నమైన ప్రపంచాల నుంచి వచ్చిన ఈ ఇద్దరూ అధికారం, న్యాయం విషయంలో పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. అర్షద్, ప్రతీక్ తమ పాత్రలకు ఎంతో నమ్మకాన్ని, తీవ్రతను తీసుకొచ్చారు. రా అండ్ నేటివిటీకి దగ్గరగా, బలమైన పాత్రల చుట్టూ సాగే ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు జియో స్టూడియోస్‌తో కలిసి హిందీ జీ5ను సరైన వేదికగా ఎంచుకున్నాం” అన్నారు.
నటుడు అర్షద్ వార్సీ మాట్లాడుతూ..“మహారాజ్ పాత్ర నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఒక నటుడిగా నాలోని పూర్తిగా భిన్నమైన కోణాన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం ఈ పాత్ర ద్వారా నాకు లభించింది. ఇంత చీకటి, ఊహించలేని మలుపులు, సహజమైన క్రూరత్వం ఉన్న నెగెటివ్ పాత్ర చేయడం సవాలుగా అనిపించింది. అదే సమయంలో ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో నచ్చింది. టిగ్మాన్షు ధూలియాతో కలిసి పనిచేయడం వల్ల మహారాజ్ ప్రపంచాన్ని, అతని ఆలోచనా విధానాన్ని మరింతగా అర్థం చేసుకోగలిగాను. ఆయన విజన్‌పై పూర్తిగా నమ్మకంతో పాత్రలో లీనమైపోయాను. ‘ఘమాసాన్’ ద్వారా నాలోని ఈ కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాను” అన్నారు.
నటుడు ప్రతీక్ గాంధీ మాట్లాడుతూ..“‘ఘమాసాన్’లో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం ఆదిత్య పాత్రలోని పట్టుదల, తీవ్రత. మహారాజ్‌ను న్యాయం ముందు నిలబెట్టాలనే లక్ష్యంతో ఆదిత్య ధైర్యంగా, భయమెరగకుండా, వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతాడు. కానీ అతని వేట మరింత లోతుకు వెళ్లే కొద్దీ, తాను కేవలం ఒక వ్యక్తితో మాత్రమే పోరాడటం లేదని.. ఒక పకడ్బందీగా పనిచేస్తున్న వ్యవస్థతో పోరాడుతున్నానని తెలుసుకుంటాడు. ఈ విషయం అతని పోరాటం స్థాయినే మార్చేస్తుంది. అదే సమయంలో అతని ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. టిగ్మాన్షు సర్‌తో కలిసి పనిచేయడం, అర్షద్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతమైన అనుభవం. ‘ఘమాసాన్’ పచ్చిగా, తీవ్రమైన భావోద్వేగాలతో, బలమైన పాత్రల చుట్టూ సాగే కథ. ఈ చిత్రాన్ని జీ5లో ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
భారత్‌లోని ప్రముఖ దర్శకులు, క్రియేటర్స్, నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేస్తున్న జీ5.. విభిన్నమైన కథలకు, కొత్త తరహా కథనాలకు ప్రేక్షకులను చేరువ చేసే వినోద వేదికగా తన స్థానాన్ని ప్రేక్షకుల హృదయాల్లో మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ‘ఘమాసాన్’, ‘సుమో దీదీ’, ‘ఇక్రూప్’ వంటి విభిన్నమైన కథలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి భిన్నమైన జోనర్స్, వైవిధ్యమైన కథనాలు, వైవిధ్యమైన ఆలోచనా కోణాలను ఆవిష్కరించనున్నాయి. అధికారం, మనుగడ చుట్టూ సాగే నైతిక సంక్లిష్టతలతో కూడిన ‘ఘమాసాన్’ నుంచి, ఫ్రెష్ లైమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన పట్టుదల, స్ఫూర్తి, పోరాట స్ఫూర్తిని చాటే ‘సుమో దీదీ’ వరకు.. అలాగే మిథిలా పాల్కర్, గౌహర్ ఖాన్ నటించిన AAZ ఫిల్మ్స్ ‘ఇక్రూప్’.. మనుగడ, న్యాయం కోసం సాగే శక్తివంతమైన కథను ఆవిష్కరించనుంది. సాంప్రదాయ కథన పద్ధతులకు భిన్నంగా, తమదైన ప్రత్యేకమైన దృక్కోణంతో కథలు చెప్పే సృజనకర్తలకు ఈ భాగస్వామ్యం మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.








