‘డోంట్ సే గుడ్ లక్’ రివ్యూ: తల్లి కూతుళ్ల బంధాన్ని కదిలించే కన్నీటి కథ
Rating : 2.5/5
ఒక అమ్మాయికి జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు. స్కూల్లో వేసే నాటకంలో ప్రధాన పాత్ర దక్కుతుంది. తన కల నిజమవుతోంది. ప్రేమ కూడా మొదలవుతోంది. కానీ అదే సమయంలో ఆమె తల్లి జీవితంలోకి ఓ భయంకరమైన విషాదం తిరిగి వస్తుంది. క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది.ఈ క్షణంలో కూతురు తన కలను ఆస్వాదించాలా? లేక తల్లి ప్రాణాల కోసం భయపడాలా? ఈ రెండు భావోద్వేగాల మధ్య నలిగిపోయే ఓ టీనేజ్ అమ్మాయి కథే ‘డోంట్ సే గుడ్ లక్’.
ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కింది. రచయిత్రి లారా హాంకిన్ జీవితంలో జరిగిన అనుభవాల నుంచి ఈ కథ పుట్టింది.
కథేంటి?
సోఫీ ఓ హైస్కూల్ విద్యార్థిని. స్కూల్లో ప్రదర్శించబోయే ప్రసిద్ధ సంగీత నాటకం ‘వెయిట్రెస్’లో ప్రధాన పాత్ర కోసం ప్రయత్నిస్తుంది. చివరకు ఆ అవకాశం ఆమెకే దక్కుతుంది. సోఫీకి ఇది పెద్ద విజయం. వేదికపై తనను తాను నిరూపించుకునే అవకాశం దొరికిందనే ఆనందంలో ఉంటుంది.
అదే సమయంలో ఆమె తల్లి ఎలిజబెత్కు క్యాన్సర్ మళ్లీ తిరగబడుతుంది. కూతురు తన జీవితంలో ఎంతో కీలకమైన దశలో ఉందని తెలిసిన తల్లి, తన అనారోగ్యం గురించి ఆమెకు చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది.“నా కూతురు జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సమయం. నా బాధతో ఆమె ఆనందాన్ని నాశనం చేయకూడదు ”. కానీ నిజాన్ని ఎంతకాలం దాచగలరు?
సోఫీ నాటక రిహార్సల్స్తో బిజీగా ఉంటుంది. అక్కడే ఆమెకు ప్రేమ కూడా మొదలవుతుంది. మరోవైపు ఇంట్లో తల్లి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుంది. సోఫీకి తెలియకుండా కుటుంబం మొత్తం ఆ విషాదాన్ని మోస్తుంటుంది. చివరకు ఆ నిజం బయటకు వచ్చినప్పుడు తల్లీకూతుళ్ల మధ్య ఏర్పడే భావోద్వేగ సంఘర్షణ ఏమిటి, సినిమాకు ముగింపు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలిసిస్ :
‘డోంట్ సే గుడ్ లక్’ను కేవలం ఓ రెగ్యులర్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా సినిమా అనుకుంటే పొరపాటే. స్కూల్ డ్రామా, ప్రేమకథ, యవ్వనంలోకి అడుగుపెట్టే అమ్మాయి వంటి అంశాలు పైకి కనిపించినా.. లోపల మాత్రం ఇది తల్లి కూతుళ్ల బంధం గురించి చెప్పే కథ.
తనకు జీవించే సమయం తక్కువగా ఉందని తెలిసిన తల్లి, కూతురికి చివరి వరకు ఆనందకరమైన జీవితాన్నే ఇవ్వాలని ప్రయత్నించడం మనసును తాకుతుంది. మరోవైపు తన తల్లి ఎందుకు తనకు దూరమవుతోందో అర్థం కాక సోఫీ పడే బాధ కూడా సహజంగా అనిపిస్తుంది.
ముఖ్యంగా సూఫీ మ్యూజికల్ నాటకంలో పోషించే పాత్రకు, ఆమె నిజ జీవితానికి మధ్య దర్శకురాలు సృష్టించిన రిలేషన్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. నాటకంలో తల్లి కావడం గురించి తెలుసుకోవాల్సిన అమ్మాయి.. నిజ జీవితంలో తన తల్లి గురించి కొత్త నిజాలను తెలుసుకోవాల్సి రావడం కథకు మరింత డెప్త్ ను తీసుకొస్తుంది.
హైలెట్ :
సోఫీ తన పాత్ర కోసం తల్లిని అడిగే సన్నివేశం ..డ్రామా టీచర్ వైపు నుంచి ఇది సాధారణ సలహా. కానీ ప్రేక్షకుడికి మాత్రం అది సాధారణ సలహా కాదు. ఎందుకంటే మనకు తల్లి పరిస్థితి తెలుసు. సోఫీకి తెలియదు. అక్కడే స్క్రీన్ప్లే Dramatic Ironyని ఉపయోగిస్తుంది. అంటే ప్రేక్షకుడికి ఒక నిజం తెలుసు. పాత్రకు తెలియదు. ఆ తేడా వల్లే సన్నివేశంలో టెన్షన్ పెరుగుతుంది. సోఫీ అమాయకంగా అడిగే ప్రతి ప్రశ్న ప్రేక్షకుడికి మరింత బాధ కలిగిస్తుంది. తల్లి ఇచ్చే ప్రతి సమాధానం వెనుక మరో అర్థం కనిపిస్తుంది.
సన్నీ సాండ్లర్ ఎలా చేసింది?
ఈ సినిమాకు పెద్ద సర్పైజ్ సన్నీ సాండ్లర్. ఆడమ్ సాండ్లర్ కుమార్తెగా ఆమెకు ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో మాత్రం తండ్రి నీడ లేకుండా తన నటనతో ఆకట్టుకుంటుంది. సోఫీ పాత్రలో ఆనందం, ప్రేమ, కోపం, భయం, బాధ అన్నింటినీ ఆమె సహజంగా పలికించింది. ముఖ్యంగా తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత వచ్చే సన్నివేశాల్లో ఆమె నటన బాగా ఆకట్టుకుంటుంది.
అలాగే తల్లిగా మెలనీ లిన్స్కీ మరోసారి అదరగొట్టింది ఎలిజబెత్ పాత్రలో ఆమె పెద్దగా డైలాగులు చెప్పకుండా, కేవలం ముఖ కవళికలతోనే తన బాధను ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చేస్తుంది. తనకు ఏం జరగబోతోందో తెలిసినా.. కూతురి ఆనందాన్ని మాత్రం చెడగొట్టకూడదని భావించే తల్లిగా ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది.
కొన్ని సన్నివేశాల్లో ఆమె ఏడవకుండా ఉండటమే ప్రేక్షకుడిని ఏడిపిస్తుంది. అదే ఈ పాత్ర ప్రత్యేకత.
దర్శకత్వం ఎలా ఉంది?
జూలియా హార్ట్ సినిమాను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ గా తెరకెక్కించారు. కథలో విషాదం ఉన్నప్పటికీ ప్రతి సీన్ ని బలవంతంగా ఎమోషన్ గా మార్చే ప్రయత్నం చేయలేదు.
ఒకవైపు స్కూల్ మ్యూజికల్ సందడి, మరోవైపు ఇంట్లో పెరుగుతున్న విషాదం.. ఈ రెండింటినీ సమాంతరంగా చూపించడం బాగా పనిచేసింది. దీంతో సినిమా మొత్తం ఒకే రకమైన మూడ్లో సాగకుండా ఉంటుంది.
ముఖ్యంగా నాటకంలోని సన్నివేశాలను సోఫీ వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టిన విధానం దర్శకురాలి టాలెంట్ ని చూపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమా చాలా మందికి నెమ్మదిగా అనిపించొచ్చు. పెద్ద ట్విస్టులు, స్పీడైన కథనం కోసం చూసేవారికి ఇది అంతగా నచ్చకపోవచ్చు. అలాగే కథలో జరిగే సీన్స్ ని ఎక్కువ శాతం ముందుగానే ఊహించే అవకాశం కూడా ఉంటుంది.
అయితే ఈ సినిమా లక్ష్యం థ్రిల్ ఇవ్వడం కాదు. పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకుడికి అనుభవింపజేయడం. ఆ విషయంలో మాత్రం సినిమా విజయవంతమవుతుంది.
ఫైనల్ థాట్ :
‘డోంట్ సే గుడ్ లక్’ గొప్ప ట్విస్టులతో ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచే సినిమా కాదు. ఇది పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని నెమ్మదిగా నిర్మించి, చివరికి దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఓ తల్లి తన కూతురి కోసం చివరి వరకు చేసే ప్రయత్నం గురించి చెప్పే హృదయాన్ని తాకే సినిమా. ఇది క్యాన్సర్ కథ మాత్రమే కాదు. పిల్లలు ఎదిగే సమయంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే భయం, ప్రేమ, త్యాగం గురించి కూడా మాట్లాడుతుంది. కథలో కన్నీళ్లు ఉన్నాయి. బాధ ఉంది. కానీ చివరకు మిగిలేది మాత్రం ప్రేమ, జ్ఞాపకం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఓ చిన్న ఆశ.
చూడచ్చా:
ఎమోషన్ ప్రధానంగా సాగే సినిమాలు ఇష్టపడేవారికి ‘డోంట్ సే గుడ్ లక్’ మంచి ఛాయిస్.
ఎక్కడ చూడవచ్చు :
నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది
—సూర్య ప్రకాష్ జోశ్యుల








