అంతర్జాతీయ న్యాయ సేవలకు కేంద్రంగా హైదరాబాద్.. ‘కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
అంతర్జాతీయ న్యాయ నైపుణ్యాన్ని కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుసంధానం చేస్తూ, వివిధ దేశాలకు సంబంధించిన న్యాయ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ హైదరాబాద్ కార్యాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ న్యాయ సేవలకు సంబంధించిన ఇటువంటి వినూత్న సంస్థ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన సేవలతో సహా అనేక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా విస్తరిస్తోందని, ఇది అపారమైన అవకాశాలను సృష్టిస్తూనే కొత్త సవాళ్లను కూడా ముందుకు తెస్తోందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో బాధ్యత, నైతిక విలువలు, పారదర్శకత అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేక బలాలు , ఏఐ హబ్ సామర్థ్యం:
బలమైన ఐటీ, సాంకేతిక వ్యవస్థ, అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ దేశాలతో మెరుగైన అనుసంధానం హైదరాబాద్‌కు ప్రత్యేక బలాలని మంత్రి చెప్పారు. ఈ అనుకూలతలతో ఏఐ ఆధారిత ప్రొఫెషనల్ , న్యాయ సేవలకు హైదరాబాద్ ఒక ప్రధాన లా ఫర్మ్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. తెలంగాణను అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానించే ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు.
న్యూయార్క్‌లోని కావేటి వ్యవస్థాపకుడు, మేనేజింగ్ అటార్నీ డాక్టర్ శ్రీనివాస్ రావు కావేటి, కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కావేటికి భారత్‌తో పాటు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
అంతర్జాతీయ లీగల్ యాక్సెస్ హబ్‌గా సేవలు:
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ‘ఇంటర్నేషనల్ లీగల్ యాక్సెస్ హబ్’గా తీర్చిదిద్దాలని సంస్థ ప్రతిపాదించింది. భారత్‌లోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రవాస భారతీయులు, పెట్టుబడిదారులు వివిధ దేశాల్లో న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులు, న్యాయ నిపుణులతో అనుసంధానం కావడానికి ఈ కేంద్రం వేదికగా పనిచేయనుంది.
అంతర్జాతీయ న్యాయ నిపుణులు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాల్లో ప్రత్యక్ష సంప్రదింపులు, న్యాయ వ్యూహాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించే అవకాశాన్ని కూడా ఈ సంస్థ కల్పించనుంది. అంతేకాకుండా, ఈ సంస్థ అందించే సేవలు వివిధ దేశాల్లోని పలు కీలక న్యాయ విభాగాలను కవర్ చేయనున్నాయి.









