మాజీ మంత్రిపై అథ్లెట్ ‘ప్రతిభ’ సంచలన ఆరోపణలు!
తెలంగాణ క్రీడారంగంలో ఓ సంచలనం నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై అంతర్జాతీయ అథ్లెట్ తక్కెడపల్లి ప్రతిభ చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిని నేరుగా టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను, బాధ్యతాయుత పదవులను ఎలా గుప్పిట్లో పెట్టుకున్నారనే దానికి అద్దం పడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశ పతాకాన్ని రెపరెపలాడించిన అథ్లెట్లకే రక్షణ కరవైతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే సూటి ప్రశ్నను ఈ ఉదంతం రాజకీయ వర్గాల ముందు ఉంచింది.
ఇంగ్లాండ్, టర్కీ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై దేశానికి పతకాలు సాధించింది ప్రతిభ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2022లో అప్పటి క్రీడాశాఖ మంత్రి సమక్షంలో జరిగిన ఒక సంఘటనను ప్రతిభ బట్టబయలు చేశారు. క్రీడాకారుల హక్కులు, భద్రత గురించి మాట్లాడే క్రమంలో మంత్రి చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలకు ఆమె తీవ్రంగా ప్రతిస్పందించారు. “క్యూట్ గా ఉన్నావు.. మీటవుతావా..” అన్నట్టు ప్రతిభ చెప్పారు. “రెండు నిమిషాల్లో మీ శరీరంలో ఏదో ఒక భాగం పనిచేయకుండా చేయగలను” అని ఆనాడే మంత్రికి ముఖం మీదే హెచ్చరించినట్లు ప్రతిభ వెల్లడించారు. అధికార మదంతో మాట్లాడే పాలకులకు ఎదురునిలవడం అంత ఆషామాషీ కాదు. అయినా తాను ధైర్యంతో సాహసం చేసినట్లు ప్రతిభ చెప్పారు.
ఈ వ్యవహారంలో మరో కీలకమైన అంశం హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో మైనర్ బాలికలపై జరిగిన వేధింపుల పర్వం. ఆ అభాగ్య బాలికలు తమ బాధను చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ప్రతిభ స్వయంగా ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఫలితంగా ఆగస్టు 2023లో మీడియా కథనాల ఒత్తిడితో ఒక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే, ఈ సమస్యలను క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినప్పుడు బాధితులకు న్యాయం చేయడం పక్కనపెట్టి, ఫిర్యాదు చేసిన ప్రతిభనే బెదిరింపులకు గురిచేయడం వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తప్పు చేసిన అధికారులను కాపాడటానికి గత పాలకులు ఎందుకు ప్రయత్నించారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
“నాకు గొంతు లేకుండా పోయింది.. ఎవరూ తోడులేక ఒంటరినైపోయాను.. కెరీర్, లక్ష్యాలు దెబ్బతింటాయనే భయంతోనే ఆనాడు మౌనం వహించాల్సి వచ్చింది” అంటూ ప్రతిభ ఓ వీడియో విడుదల చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించిన ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారిణులు బెదిరింపులు తట్టుకోలేక, పెళ్లిళ్లు చేసుకుని ఆటకు స్వస్తి పలికారన్న ప్రతిభ మాటలు, ఇప్పుడు గత ప్రభుత్వ క్రీడా విధానాల డొల్లతనాన్ని, పాలకుల ఉదాసీనతను ప్రశ్నించేలా చేస్తున్నాయి.
తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ లబ్ధి లేదని, తాను భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్ను మాత్రమేనని ప్రతిభ తేల్చిచెప్పారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గత పాలకుల అక్రమాలు, అధికార దుర్వినియోగంపై విచారణలు జరుగుతున్న వేళ.. ఈ ఆరోపణలు బీఆర్ఎస్ మాజీ మంత్రికి రాజకీయంగా తీవ్ర ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రీడారంగంలో మహిళా రక్షణ, గతంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.








