ఇరగదీసిన ‘ఇరుముడి’ కథా కథనం
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థలు : మైత్రి మూవీ మేకర్స్, టీ సీరిస్
నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయికుమార్, బేబీ నక్షత్ర,
రమేష్ ఇందిర, అజయ్ ఘోష్, మీసాల లక్ష్మణ్ తదితరులు
సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రఫి: విష్ణు శర్మ
ఎఢిటర్: ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్
స్టంట్స్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్, ఆర్ట్: భార్గవ ఎన్
సహ నిర్మాత: శివ్ చనానా,
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్,
దర్శకత్వం: శివ నిర్వాణ
విడుదల తేది : 21.08.2026
నిడివి : 2ఘంటల 25 నిముషాలు
రవితేజ(Ravi Teja) హీరోగా ధమాఖ తరువాత సరైన హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. శివ నిర్వాణ(Shiva Nirvana) సైతం మజిలీ తర్వాత మళ్లీ తన సత్తాను చాటుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో ‘ఇరుముడి’(Irumudi) సినిమా వచ్చింది. మరి ఈ చిత్రంలో నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్ వంటి ఆర్టిస్టులు ముఖ్య పాత్రలను పోషించారు.మైత్రి మూవీ మేకర్స్,(Mythri Movie Makers) టీ సీరిస్‌ల (T-Series) నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకుడిగా రవితేజ చేసిన చిత్రం ‘ ఇరుముడి ’. ఫాదర్ డాటర్ సెంటిమెంట్, సోషల్ మెసెజ్, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కించినట్టు టీజర్, ట్రైలర్లతో అనిపిస్తోంది. మరి ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? అన్నది ఓ సారి సమీక్షలో చూద్దాం.
కథ :
పొల్లూరులో త్రినాథ్ (రవి తేజ) అరటి పళ్ల వ్యాపారి. ట్రక్కు డ్రైవర్‌గా భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), మణికంఠ (నక్షత్ర) అలియాస్ మణెమ్మతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. కూతురు మణికంఠ అంటే త్రినాథ్‌కి వల్లమాలినా ప్రేమ మమకారం. స్కూల్‌కి వెళ్లేటప్పుడు గానీ వచ్చేటప్పుడు గానీ ఏం చూసినా సరే అన్నీ చెప్పాలి అంటూ కూతురిని పెంచుతాడు త్రినాథ్. అయ్యప్ప దీక్ష వేసిన 41 రోజులు తప్పా మిగతా అన్ని రోజులు త్రినాథ్ తాగుతూనే ఉంటాడు. కావేరి ఎంత చెప్పినా త్రినాథ్ మాత్రం వినడు, తాగడం మానడు. కూతురు మణెమ్మ కూడా త్రినాథ్ తాగుడుకే సపోర్ట్ చేస్తుంటుంది. అయ్యప్ప కృపతో కలిగినట్టు భావించే కూతురు మణెమ్మ అంటే పంచ ప్రాణాలు. పొల్లూరు గ్రామంలో ప్రతీ ఆడపిల్లను తన కూతురిగా చూసుకొంటాడు. అలాంటి త్రినాథ్ కూతురికే తీరని అన్యాయం జరుగుతుంది.
అదే ఊర్లోని గురుస్వామి గోపరాజు (సాయి కుమార్)ని సొంత మనిషిలా భావిస్తాడు త్రినాథ్. ఊర్లో ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా, ఎవరు కష్టం కలిగించినా త్రినాథ్ ఊరుకోడు. అలా త్రినాథ్‌కి ఎంతో మంది శత్రువులు తయారువుతుంటారు. ఓ సారి గోపరాజు కూతురు గాయత్రికి ఓ కష్టం వస్తుంది. ఆ కష్టం గురించి మణెమ్మకి తెలుస్తుంది. కానీ మణెమ్మ తన తండ్రికి ఆ విషయాన్ని చెప్పలేకపోతుంది. త్రినాథ్ మద్యం వ్యసనం ఫ్యామిలీలో ఎలాంటి చింతనకు గురి చేసింది? కూతురు అంటే త్రినాథ్‌కు కొండంత ప్రేమ ఎందుకు? తండ్రి మాటను కూతురు మణెమ్మ ఎందుకు జవదాటదు? పొల్లూరు గ్రామంలో త్రినాథ్ వ్యవహరశైలిలో ఎలా కొనసాగింది? గురుస్వామి గోపరాజు తో త్రినాథ్ అనుబంధం ఎలా ఉంది? ఈ కథలో ఎమ్మెల్యే (రమేష్ ఇందిర) పాత్ర ఏమిటి? మణెమ్మకు జరిగిన అన్యాయం ఏమిటి? తన కూతురుకు జరిగిన అన్యాయానికి త్రినాథ్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? అసలు గాయత్రికి వచ్చిన కష్టం ఏంటి? ఊర్లో జరిగే అమ్మాయిల అనుమానాస్పద మృతి వెనుకున్నది ఎవరు? ఈ కథలో టీచర్ ధనలక్ష్మీ (స్వాసిక), ఎమ్మెల్యే బుజ్జి, నాగులు, డొంకరాయ ఊర్లోని నలుగురు ఆకతాయి రౌడీల పాత్ర ఏంటి? అన్నది కథ. అనే ప్రశ్నలకు సమాధానమే ఇరుముడి సినిమా కథ.
నటీనటుల హవబవాలు:
ఈ సారి రవితేజ ఓ సాధారణ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా అద్భుతంగా అనిపిస్తాడు. తన మాస్ మహారాజ్ ఇమేజ్‌కు భిన్నంగా రూట్ మార్చి చేసిన పాత్ర త్రినాథ్. తన పాత్ర కోసం ఆయన తన ఇమేజ్ను పూర్తిగా వదలిపెట్టి క్యారెక్టర్లోనే ఒదిగిపోయాడని చెప్పాలి. త్రినాథ్ పాత్రలో రవితేజ సహజంగా నటించినట్టు కనిపిస్తుంది. కొన్ని సీన్లలో రవితేజ ఏడ్పించేస్తాడు. తండ్రి, కూతుళ్ల కెమిస్ట్రీని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. తన నైజానికి భిన్నంగా పూర్తిగా కంట్రోల్ ఉండి క్యారెక్టర్ ను ఎలివేట్ చేశాడని చెప్పాలి. ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా అదరగొట్టాడు. ఇక మణెమ్మగా నక్షత్ర ఈ సినిమా మెయిన్ అసెట్. అత్యంత సహజ సిద్దంగా పాత్రను పండించడమే కాకుండా కొన్ని సీన్లలో ఉద్వేగానికి గురిచేసేలా నటించింది. రవితేజ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే విధంగా నక్షత్ర పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రియా భవానీ శంకర్ సినిమా కావాల్సిన ఫీల్ గుడ్ను అందించింది. ప్రియా భవానీ శంకర్ పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేనట్టుగానే కనిపిస్తుంది. కానీ తెరపై ఈ ఇద్దరి జోడి బాగానే అనిపిస్తుంది. సాయి కుమార్, ఈ సినిమాకు బ్యాక్ బోన్‌లా నిలిచాడు. ఈ చిత్రంలో నటించిన అజయ్ ఘోష్, స్వాసిక, మీసాల లక్ష్మణ్, గాయత్రి ఇలా అన్ని పాత్రలు బాగుంటాయి. తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టోరిని మాత్రమే డ్రైవ్ చేయకుండా సీన్లను ఎమోషనల్‌గా, యాక్షన్ పరంగా కూడా హై రేంజ్లో ఎలివేట్ చేసింది. విజువల్స్ టాప్ రేంజ్ లో వున్నాయి. మన దగ్గర ఇలాంటి విజువల్స్ ఉన్నాయా? అని అనిపిస్తుంది. అమ్మాయిల్ని పెంచాల్సిన తీరు గురించి శివ నిర్వాణ చెప్పిన ప్రతీ డైలాగ్ అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఓ చోట హీరో.. నా ఊరి అమ్మాయిల జోలికి వస్తే అని డైలాగ్ చెప్తాడు. అక్కడ ఏ అమ్మాయి జోలికి వచ్చినా అని ఇలా డైలాగ్ పెడితే బాగుండేదనిపించింది. సబ్ టైటిల్స్ మాత్రం ఒక్కటి కూడా సింక్‌లో ఉండదు. అది మలయాళీ వర్షెన్ కోసం సబ్ టైటిల్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. ఇక ఈ సినిమా కావాల్సిన మూడ్‌ను, ఎమోషన్స్‌ను సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ క్రియేట్ చేశాడు. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. మైత్రీ మూవీస్ ఎప్పటిలానే ప్రొడక్షన్ వాల్యూస్ స్టాండర్డ్స్‌ను హై రేంజ్లో వున్నాయి.
విశ్లేషణ:
ఇరుముడి సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే..
ఫస్ట్ హాఫ్ వరకు కథలో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. త్రినాథ్ పాత్ర తీరు, మణెమ్మతో ఉన్న కాంబినేషన్ సీన్స్, ఊర్లో అమ్మాయిలకు ఎదురవుతున్న సమస్యలు.. వీటిలో త్రినాథ్ ఎలా ఇరుక్కుంటాడు.. ఆ సమస్యలు త్రినాథ్ ఇంటి వరకు వస్తాయా? కూతురి మీద ప్రభావం చూపిస్తాయా? అన్న ఉత్కంఠను రేకెత్తించేలా స్క్రీన్ ప్లేని రాసుకున్నాడు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. సెకండాఫ్ అంతా కూడా డివైన్ ఫీలింగ్ కలుగుతుంది. అయ్యప్ప భక్తులకు మాత్రం కన్నుల పండువగా అనిపిస్తుంది. ఈ సినిమా కార్తీకమాసంలో వచ్చి ఉంటే మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉండేదేమో అన్నట్టుగా సెకండాఫ్ సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మరింతగా పరుగులు పెడుతుంది. చివరకు ట్విస్ట్ రివీల్ అవ్వడం, హీరో విజృంభించడం కామన్. అయితే ఇందులోని క్లైమాక్స్ కొత్తగా అనిపిస్తుంది. చివర్లో వచ్చే పాట అందరినీ కదిలిస్తుంది. క్లైమాక్స్ పూర్తయ్యే సరికి ఓ సంతృప్తి అయితే కలుగుతుంది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, అయ్యప్ప స్వామి డివైన్, రూరల్ డ్రామాగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ అంశాలను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. దాంతో ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ఎమోషనల్ కనెక్ట్ చేసి సినిమాతో జర్నీ చేసేలా ఉంటుంది. రవితేజ కెరీర్లో ది బెస్ట్ మూవీ. బేబీ నక్షత్ర, ఆడపిల్లలందరూ బాగా నటించారు. ఈ వారం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాను చూడాలంటే.. ఇరుముడిని మాత్రం మిస్ కావద్దు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.








