యాపిల్ పే ఎంట్రీ, డిజిటల్ చెల్లింపుల రంగంలో ఎలాంటి మార్పులు రావచ్చు..?
దేశీయ డిజిటల్ చెల్లింపుల (Digital Payments) రంగాన్ని శాసిస్తున్న ‘యూపీఐ’ (UPI) కి సవాలు విసురుతూ గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ‘యాపిల్ పే’ (Apple Pay) సేవలను భారత్‌లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో మెజారిటీ ప్రజలు క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులకే అలవాటు పడిన తరుణంలో.. యాపిల్ పే రాకతో భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మరియు యూపీఐ ఇకోసిస్టమ్‌లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందో ఇక్కడ విశ్లేషిద్దాం.
కాంటాక్ట్‌లెస్ NFC చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణ
భారత్‌లో ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి పేమెంట్స్ చేయడం సర్వసాధారణం. అయితే యాపిల్ పే పూర్తిగా ‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్’ (NFC) టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారులు తమ ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌ను స్వైపింగ్ (POS) మిషన్ల వద్ద కేవలం ‘టాప్’ చేయడం ద్వారా సులభంగా పేమెంట్స్ పూర్తి చేయవచ్చు. యాపిల్ పే ఎంట్రీతో దేశంలో ఇంటర్నెట్ అవసరం లేని ఈ ‘టాప్-టు-పే’ (Tap-to-Pay) సంస్కృతి మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.
ప్రీమియం కస్టమర్ల విభాగంలో యూపీఐకి గట్టి పోటీ:
భారతదేశంలో ఐఫోన్ల అమ్మకాలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మరియు అధిక ఆదాయం ఉన్న వర్గాలలో యాపిల్ డివైజ్‌ల వాడకం ఎక్కువే. ఈ ప్రీమియం కస్టమర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను యాపిల్ పే వాలెట్‌కు అనుసంధానించుకుని నేరుగా చెల్లింపులు చేయడానికి మొగ్గు చూపవచ్చు. దీనివల్ల హై-వాల్యూ లావాదేవీలు జరిగే మాల్స్, లగ్జరీ స్టోర్స్, ఎయిర్‌పోర్టుల వంటి ప్రదేశాలలో యూపీఐ వాడకం కొంత తగ్గి యాపిల్ పే వైపు కస్టమర్లు మళ్లీ అవకాశం ఉంది.
యూపీఐ చెల్లింపులు జరిగేటప్పుడు వ్యాపారులకు వినియోగదారుల వర్చువల్ పేమెంట్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్లు కనిపించే అవకాశం ఉంటుంది. కానీ యాపిల్ పే ‘డివైజ్ టోకనైజేషన్’ పద్ధతిని వాడుతుంది. అంటే, లావాదేవీ జరిగేటప్పుడు వ్యాపారులకు కస్టమర్ అసలు కార్డ్ నంబర్ గానీ, వ్యక్తిగత వివరాలు గానీ వెల్లడి కావు. దీనితో పాటు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉండటం వల్ల ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ భద్రతా ప్రమాణాలు యూపీఐ అప్లికేషన్లు కూడా తమ ప్రైవసీ ఫీచర్లను మరింత మెరుగుపరుచుకునేలా ఒత్తిడి తెస్తాయి.
కార్డ్ ఆధారిత చెల్లింపుల ఇకోసిస్టమ్ పునరుజ్జీవనం:
యూపీఐ వచ్చిన తర్వాత రూపే మినహా మిగిలిన విసా, మాస్టర్‌కార్డ్ వంటి అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌ల వాడకం దేశంలో గణనీయంగా తగ్గింది. యాపిల్ పే రాకతో ఈ అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌లకు మళ్లీ ఊతం లభించనుంది. ఎందుకంటే యాపిల్ పే క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ఆధారంగానే లావాదేవీలను పూర్తి చేస్తుంది. తద్వారా కార్డ్ లావాదేవీలపై లభించే క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు మరియు క్రెడిట్ కార్డుల ద్వారా లభించే ‘చార్జ్‌బ్యాక్ ప్రొటెక్షన్’ వంటి ప్రయోజనాలను ఇష్టపడే కస్టమర్లు దీనికి ప్రాధాన్యత ఇస్తారు.
అయితే, యాపిల్ పే కేవలం యాపిల్ డివైజ్‌లలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, ఇది భారతదేశంలోని మెజారిటీ ఆండ్రాయిడ్ వినియోగదారులను చేరుకోలేదు. అందువల్ల దేశీయంగా ఉన్న అట్టడుగు స్థాయి రిటైల్ నెట్‌వర్క్‌లో యూపీఐ ఆధిపత్యానికి తక్షణమే వచ్చే ముప్పేమీ లేనప్పటికీ, పట్టణ మరియు ప్రీమియం పేమెంట్ మార్కెట్లో మాత్రం ఇది సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపనుంది.








