ఏఐ ఖర్చులు తడిసిమోపెడు.. టోకెన్ చార్జీలతో కంపెనీల బెంబేలు..!
మొన్నటివరకూ ఏఐ సర్వరోగ నివారణి అన్నట్లుగా కంపెనీలు క్యూ కట్టాయి. దీంతో ఏఐ టూల్స్ తయారు చేసే కంపెనీలు సైతం డిమాండ్ ను ఒడిసి పట్టాయి. ఏఐ వాడే ప్రతీ పనికి టోకెన్ చార్జీలు విధించాయి. నెమ్మదిగా కంపెనీలకు వాస్తవం బోధపడింది. ఈలోపే కంపెనీల్లోని టెకీలు… ఏఐ సౌలభ్యాన్ని గుర్తించి .. ఎడా,పెడా వాడేయడం మొదలుపెట్టారు. అది ఎంతలా అయిందంటే.. వాస్తవ ఖర్చుకు మూడురెట్లు అదనంగా కంపెనీలకు ఖర్చైంది. దీంతో వాటి ఆలోచన ధోరణి మారుతున్నట్లు కనిపిస్తోంది.
ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కంపెనీల ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలోని టాప్ 1 కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై ఏఐ టూల్స్ కోసం సగటున రూ.7 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయి. ర్యాంప్ ఏఐ ఇండెక్స్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. జనవరిలో ఇదే కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై సుమారు రూ.2.47 లక్షలు ఖర్చు చేశాయి. అంటే కొద్ది నెలల్లోనే ఏఐపై వ్యయం దాదాపు మూడు రెట్లు పెరిగింది.
ఏఐ వినియోగంలో కంపెనీల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. టాప్ 10 శాతం కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై సుమారు రూ.62 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి. అన్ని కంపెనీలను కలిపి చూస్తే ఒక్కో ఉద్యోగిపై వ్యయం కేవలం రూ.1,140గా ఉంది. ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న సంస్థలకు, పరిమితంగా ఉపయోగిస్తున్న సంస్థలకు మధ్య అంతరం వేగంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
ఏఐ సేవల ఖర్చు పెరగడానికి టోకెన్ ఆధారిత చార్జీలు కూడా కారణమవుతున్నాయి. ఏఐతో ఎక్కువ పని చేస్తే ఎక్కువ టోకెన్లు వినియోగమవుతాయి. దానికి అనుగుణంగా కంపెనీల బిల్లులు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని సంస్థలు ఉద్యోగుల ఏఐ వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. ఉబర్, అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు టోకెన్ వినియోగానికి పరిమితులు పెట్టినట్లు నివేదిక తెలిపింది.
వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగంలో ఆంథ్రోపిక్ 43.5 శాతంతో ముందుంది. ఓపెన్ఏఐ 39.7 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. ఓపెన్ సోర్స్, చైనా ఏఐ మోడళ్లను అందించే ప్లాట్‌ఫామ్‌ల వినియోగం కూడా పెరుగుతోంది. జులైలో వీటి వాటా 6.1 శాతానికి చేరింది. అయినా భారీగా ఏఐ వాడుతున్న కంపెనీల్లో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్‌పై ఖర్చు మాత్రం తగ్గలేదని నివేదిక పేర్కొంది.








