ఘనంగా ముగిసిన టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మూడు రోజుల మహాసభలు ఘనంగా ఘనంగా జరిగాయి. అమెరికా గడ్డపై తెలుగుదనాన్ని, మన సంస్కృతిని, గొప్పతనాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతో జరిగిన ఈ మహోత్సవం, ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. చార్లెట్ నగరంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మొట్టమొదటిసారి మెగా కన్వెన్షన్ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
జూలై 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించిన ఈ కన్వెన్షన్‌లో మొదటిరోజైన బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం అతిరథ మహారధుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. అమెరికా నలుమూలల నుండి టిటిఎ నాయకులు, సభ్యులు, చార్లెట్ ప్రవాస తెలుగువారు హాజర య్యారు. అందరి అంచనాలను దాటి ఎయిర్పోర్ట్ పికప్స్ దగ్గిర నుండి, హోటల్ అకామడేషన్, రెజిస్ట్రేషన్, టికెట్స్ వరకు ఒక పద్దతి ప్రకారం నీటుగా చేశారు. కాక్టైల్ అవర్ అనంతరం ముందుగా ప్రముఖ యాంకర్ సుమ అందరికీ స్వాగతం పలికారు. అనంతరం, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాయకత్వం అంతా కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. సిటీ కౌన్సిల్ సభ్యురాలు డింపుల్ అజ్మీరా, మేయర్ హరింగ్టన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలను మొదలుపెట్టారు. టీటీఏ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు. చార్లెట్ నగరంలో కన్వెన్షన్ జరపడానికి గత ఆరు నెలలుగా కష్టపడిన విజయపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, భరత్ రెడ్డి, వంశీ రెడ్డి వంటి సభ్యుల కృషిని టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది కొనియాడారు. సప్త సముద్రాలు దాటి వచ్చిన తెలుగు ప్రజలందరికీ సాదర స్వాగతం పలికారు.
జానపదాల జాతర…
ఈ వేడుకల్లోని ప్రధాన ఆకర్షణగా నిలిచిన ‘జానపదాల జాతర’, సభను ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయకులు రసమయి బాలకిషన్, వందేమాతరం శ్రీనివాస్, నర్సిరెడ్డి కాసాలా, సంధ్య, నల్గొండ గద్దర్, గీత రచయిత కాసర్ల శ్యామ్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వందేమాతరం శ్రీనివాస్ పాడిన ‘చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే’, ‘తెలంగాణ గట్టు మీద సందమమయ్యో’ వంటి పాటలు సభికులలో జోష్ నింపాయి. రసమయి బాలకిషన్ పాడిన ‘గున్నా గున్నా మామిడి’, ‘మమిడి కొమ్మలా మీద’ వంటి జానపదాలకు తోటి కళాకారులు కోరస్ పాడటంతో సభ ప్రాంగణం హోరెత్తింది. వందేమాతరం శ్రీనివాస్ కి అవార్డు అందించిన తర్వాత తన సారధ్యంలో గాయనీగాయకులు జానపదాలు పాడి అందరినీ అలరించారు. ముఖ్యంగా తెలంగాణ యాసతో పాడిన పాటలు అందరినీ అలరించాయి.
అవార్డుల పండుగ.. ప్రతిభకు పట్టం
తెలుగు కీర్తిని ప్రపంచవ్యాప్తం చేస్తున్న పదిమంది విశిష్ట వ్యక్తులకు టీటీఏ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేసింది. వెంకట సుబ్బారావు చెన్నూరి (జర్నలిజం అవార్డు): వందేమాతరం శ్రీనివాస్ (సాంస్కృతిక, సాహిత్య అవార్డు):, టి.రాంచంద్ర రెడ్డి, కంది విశ్వభారత్ రెడ్డి (కమ్యూనిటీ సర్వీస్ అవార్డు), డాక్టర్ రమ్య చిత్రాంగద (యూత్ అచీవ్మెంట్), డాక్టర్ మహిధర్ రాయసం (ఐటీ రంగం), డాక్టర్ రవీందర్ రెడ్డి రెగట్టె (సైన్స్, టెక్నాలజీ), ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రవీంద్రన్ (మెడిసిన్) కళారంగంలో అశోక్ చింతకుంట దంపతులకు ఇతరులకు ఆయా రంగాల్లో పరిశోధనలు, సేవలకు గుర్తింపుగా టిటిఎ అవార్డుతో సత్కరించారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ, అమెరికాలో కూడా తెలుగు సంస్కృతిని కాపాడుతున్న తీరు అభినందనీయమని అన్నారు. వినాయక చవితి, భరతనాట్యం వంటి కళలను వారు ప్రోత్సహిస్తున్న తీరును ఆయన కొనియాడారు.
మిన్నంటిన శోభా యాత్ర
కన్వెన్షన్ రెండోరోజు ఉదయం నిర్వహించిన ‘శోభా యాత్ర’ ప్రవాస తెలుగువారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ పండుగ వాతావరణంలో జరిగిన శోభా యాత్రతో కన్వెన్షన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో, బతుకమ్మలను ధరించి శోభా యాత్రలో పాల్గొన్నారు. అమెరికా, భారత జాతీయ జెండాలను చేతబూని, ‘టీటీఏ యూత్ కమిటీ’ బ్యానర్లతో యువత ప్రదర్శించిన యాత్ర అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ వాయిద్యాలైన డోలు, సన్నాయి వాయిద్యాల నడుమ జరిగిన ఈ యాత్ర, చార్లెట్ వీధుల్లో తెలుగుదనాన్ని చాటిచెప్పింది. అమెరికా గడ్డపై మన మూలాలను, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ శోభా యాత్ర, తెలుగు వారి ఐక్యతను చాటిచెప్పింది. ప్రవాస తెలుగువారందరూ ఎంతో ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొని, కన్వెన్షన్ వేడుకలకు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు.
దాతలు, స్పాన్సర్లకు ఘనంగా సన్మానం
అమెరికాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన’ మెగా కన్వెన్షన్ 2026 ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ప్రవాస తెలుగువారిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతం కావడానికి అంకితభావంతో పనిచేసిన టీటీఏ నాయకత్వంతో పాటు, ఉదారంగా విరాళాలు అందించిన దాతల పాత్ర మరువలేనిది. సమాజ సేవ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలనే లక్ష్యంతో వ్యాపారవేత్తలు, సామాజిక నాయకులు, స్పాన్సర్లు, టీటీఏ ముఖ్య నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ నిధులను సమకూర్చారు. ఈ సందర్భంగా దాతలు, స్పాన్సర్లను టీటీఏ బృందం ఘనంగా సన్మానించింది.
మహాసభల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవం అనంతరం అందరూ ఆశీర్వచనాలు, ప్రసాదం అందుకున్నారు. వివిధ ఎక్సిబిట్ రూమ్స్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. బ్యూటీ పేజియంట్ ఫైనల్స్, వివిధ రాజకీయ పార్టీల సమావేశాలు, బిజినెస్ సెమినార్స్, సాహితీ సమావేశం, సెలబ్రిటీ మీట్ & గ్రీట్, కాలేజీల ఎన్నారై మీట్స్ వంటి బ్రేకౌట్ సెషన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఫోటోబూత్స్, సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆహ్వానితులందరూ ఫోటోలు దిగుతూ కన్పించారు. మహిళలు వెండర్ బూత్స్ దగ్గిర కోలాహలంగా తిరిగారు. ఈ సందర్భంగా ఎఐజి హాస్పిటల్స్ స్థాపకులు, పద్మ విభూషణ్ డా. దువ్వూర్ నాగేశ్వర రెడ్డికి టిటిఎ కార్యవర్గం, బోర్డు సభ్యులు,ఎగ్జిక్యూటివ్ కమిటీ సమక్షంలో జీవన సాఫల్య పురస్కారాన్ని అంది ంచారు. ఈ సందర్భంగా డా. నాగేశ్వర రెడ్డి తన అమెరికా, ఇండియా అనుభవాలను పంచుకున్నారు. వచ్చీరావడంతోనే వేదికపైన డాన్సులతో హీరో నవీన్ పోలిశెట్టి అలరించారు. తర్వాత యువతను ఉద్దేశించి మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. TTA నాయకులు శాలువా, పుష్పగుచ్చంతో నవీన్ పోలిశెట్టిని సన్మానించారు. ఇక పరంపర టీం వారు కన్వెన్షన్ లోగోలో ఉన్న సేవ, బంధం, ఐక్యత చాటుతూ చేసిన నృత్యంతో స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు.
తానా, ఆటా, నాట్స్, జిటిఎ, టిడిఎఫ్, మాటా వంటి ఇతర జాతీయ తెలుగు సంఘాల నాయకులు ఎక్కువమంది ఈ కన్వెన్షన్‌కి హాజరయ్యారు, వీరందరినీ వేదికపైకి ఆహ్వానించి అభినందించారు. ఫోటో బూత్స్, అలంకరణలు, డిస్ప్లేలు చక్కగా ఏర్పాటు చేశారు. టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి మరియు వంశీ రెడ్డి కంచరకుంట్ల పర్యవేక్షణలో కన్వెన్షన్ మొదటిరోజు విజయవంతంగా సాగింది. ఇండియా నుంచి వచ్చిన వారిలో తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, ఇతర రాజకీయ నాయకులు, ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే టాలీవుడ్ నుంచి దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా, యాంకర్ సుమ, నిర్మాత దిల్ రాజు, నటీమణులు దివి, అన్షు రెడ్డి, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, మిమిక్రీ ఆర్టిస్ట్ & నటులు శివారెడ్డి, పాటల రచయిత శ్యామ్ కాసర్ల అందరూ అడిగినవారితో కాదనకుండా ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.
ఆరంజ్ స్ట్రీట్ బ్యాండ్ వారి లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ యూత్, మహిళలు ఎనర్జిటిక్ పాటలకు పోటాపోటీగా డాన్స్ చేశారు. బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం ఆసాంతం యాంకర్ సుమ కనకాల తనదైన శైలి వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు. ఈసారి టీటీఎ మహాసభలకు వేలాదిమంది తరలివచ్చారని నిర్వాహకులు ప్రకటించారు.
పుట్టిన గడ్డను, సంస్కృతిని మర్చిపోవద్దు”: మంత్రి సీతక్క
‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన’ మెగా కన్వెన్షన్ 2026లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికాలో వేలాది మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, ఇక్కడ జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు చూస్తుంటే తాను తెలంగాణ గడ్డపైనే ఉన్నాననే భావన కలిగిందని ఆమె పేర్కొన్నారు. విదేశాల్లో స్థిరపడి, తమ కలలను సాకారం చేసుకుంటున్న ప్రవాసులు, తమ మూలాలను, భాషను, సంస్కృతిని మర్చిపోకుండా కాపాడుతున్నందుకు ఆమె ప్రశంసించారు. ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ, భారత్‌లో ఉన్న కన్నవారికి కేవలం ఆర్థిక సహాయం పంపడం మాత్రమే కాకుండా, తమ కుటుంబ సభ్యులపై ప్రేమను, ఆప్యాయతను పంచాలని సూచించారు. తాత ముత్తాతలను, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలని, ఎప్పటికప్పుడు స్వగ్రామాలకు వచ్చి వెళ్తూ సంబంధాలను బలపరుచుకోవాలని కోరారు. ఎన్ని విదేశీ సంస్కృతుల్లో జీవిస్తున్నా, మన మూలాలను మాత్రం విస్మరించకూడదని గాంధీజీ మాటలను గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో నేర్చుకున్న కొత్త ఆవిష్కరణలను, నైపుణ్యాలను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలని ఆమె కోరారు. ఒక ఊరును దత్తత తీసుకోవడం, మహిళా సంఘాలను బలోపేతం చేయడం లేదా విద్యార్థులకు మెంటార్‌గా వ్యవహరించడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. అడవిలో పుట్టిన తాను, ఇవాళ అసెంబ్లీ నుండి అమెరికా దాకా ప్రయాణించానని, అదే స్ఫూర్తితో మన వనదేవతలను ఇక్కడ చూడటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె భావోద్వేగంతో తెలిపారు. మీకు ఏ సమస్య ఉన్నా ‘మీ ఆడబిడ్డ సీతక్క ఉంది’ అని గుర్తుపెట్టుకోవాలని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
లక్ష డాలర్ల విరాళం అందించిన వారు…
డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి: టీటీఏ సంస్థను 11 ఏళ్ల క్రితం ఒక చిన్న ఆశయంతో ప్రారంభించిన టీటీఏ ఫౌండర్, విద్యావేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, ఇవాళ టీటీఏను అమెరికాలోని నంబర్ వన్ తెలుగు సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఆయన సతీమణి శ్రీమతి సాధన రెడ్డి. పైళ్ల మల్లారెడ్డి కేవలం ఒక ఫౌండర్గానే కాకుండా, ప్రవాస తెలుగువారికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. విద్య, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేస్తున్న కృషి అసాధారణం. టీటీఏ సంస్థకు ఆయన ఒక పెద్దన్నలా ఉంటూ, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నిరంతరం దిశానిర్దేశం చేస్తుంటారు. ప్రతి మెగా కన్వెన్షన్‌లోనూ నిధుల సేకరణలో, సంస్థ విస్తరణలో స్వయంగా పాలుపంచుకుంటారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ఆయన నిరంతరం ప్రోత్సహిస్తుంటారు.
నవీన్ రెడ్డి మలిపెద్ది: టీటీఏ ప్రస్తుత అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, తన అద్భుతమైన నాయకత్వ పటిమతో సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం ఈ కన్వెన్షన్ నిర్వహణలోనే కాకుండా, గత ఆరు నెలలుగా ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. దాతలను కలిసి నిధులు సమకూర్చడం, కన్వెన్షన్ సెంటర్లో ప్రతి నిమిషం జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడం, వేలమంది అతిథులను సమన్వయం చేయడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం. యువ నాయకుడైన నవీన్, టీటీఏలో కొత్త రక్తాన్ని నింపుతూ, ముఖ్యంగా యువతను, తదుపరి తరాన్ని సంస్థ వైపు ఆకర్షించడంలో విజయం సాధించారు. కన్వెన్షన్ విజయవంతం కావడానికి ఆయన రేయింబవళ్లు శ్రమించడమే కాకుండా, కన్వీనర్ ప్రవీణ్ చింత, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో కలిసి టీమ్ వర్క్‌ను చక్కగా సమన్వయం చేశారు.
రాజ పుష్ప (చంద్రమౌళి, శాంతికిరణ్): ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజ పుష్ప గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్లు. వీరిద్దరూ వ్యాపార రంగంలో రాణిస్తూనే, తెలుగు సంస్కృతిని ప్రోత్సహించేందుకు వీరు ఎల్లప్పుడూ ముందుంటారు.








