టీం ఇండియా మిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్ 2027..!
శ్రీలంకతో ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్(Shubhman Gill) జట్టు లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని గిల్ స్పష్టం చేసాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉందని, రాబోయే మ్యాచుల్లో గెలిస్తేనే లండన్ లోని ఓవల్ వేదికగా జరిగే ఫైనల్కు అర్హత సాధించే అవకాశం ఉంటుందని గిల్ వెల్లడించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి టీమిండియా ముందున్న సమీకరణాలను కెప్టెన్ మీడియాకు వివరించాడు. “మాకు ఇంకా తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఫైనల్ రేసులో పటిష్టంగా నిలవాలంటే అందులో కనీసం ఆరు లేదా ఏడు మ్యాచ్లలో ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ కోణంలో చూస్తే శ్రీలంకతో జరగబోయే ఈ రెండు టెస్టుల సిరీస్ మాకు అత్యంత కీలకం” అని గిల్ పేర్కొన్నాడు. ఈ సిరీస్ కోసం జట్టు ముందే లంక చేరుకుని కొలంబోలో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడిందని, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి ఈ సన్నద్ధత ఎంతగానో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేనప్పటికీ, జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగంపై తనకు పూర్తి నమ్మకం ఉందని గిల్ చెప్పుకొచ్చాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ, యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ వంటి వారికి ఈ సిరీస్ ఒక మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. అలాగే గాలే వేదికగా జరిగే ఈ చారిత్రాత్మక 600వ టెస్ట్ మ్యాచ్లో మైదానం చుట్టూ ఉండే గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దానికి తగినట్లుగా స్పిన్నర్లను ఎదుర్కోవడానికి తాము వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు కెప్టెన్ స్పష్టం చేశాడు.








