ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ కళ, మొదటి ఫ్లైట్ ఎక్కడి నుంచంటే..?
ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్ద కాలంగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక సమయం రానే వచ్చింది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) నుండి ఈ నెల 17వ తేదీ నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలు అధికారికంగా ప్రారంభం కానున్నాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) సంచలన ప్రకటన చేశారు. ఈ అద్భుత పరిణామంతో ఉత్తరాంధ్ర ప్రాంతం అంతర్జాతీయ విమానయాన పటంలో చేరబోతోంది.
విమానాశ్రయ ప్రారంభోత్సవ విశేషాల గురించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల 17న సింగపూర్ నుండి నేరుగా మొదటి అంతర్జాతీయ వాణిజ్య విమానం భోగాపురం రన్‌వేపై ల్యాండ్ కానుందని వెల్లడించారు. తొలిరోజు విదేశాల నుండి భోగాపురం చేరుకోనున్న ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల రూపురేఖలు మారిపోతాయని, పరిశ్రమలు, ఐటీ రంగం మరింత వేగంగా విస్తరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఆధారంగా ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని (Tourism) ఓ రేంజ్లో డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఎస్. కోట (శృంగవరపుకోట) పరిసర ప్రాంతాలలో సుమారు 100 ఎకరాల భారీ విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక భారీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ విమానాశ్రయం మరియు రిసార్ట్ ప్రాజెక్టుల వల్ల స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భోగాపురం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరియు వాణిజ్య రంగాలు రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.








