నువ్వేం ప్రిన్సెస్ కావు.. బంతిని బాదు..!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) మైదానంలో ఎదుర్కొన్న ఒక వింత నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య డార్విన్ వేదికగా గురువారం ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో స్మిత్ ఒంటరి పోరాటం చేస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ‘సైట్ స్క్రీన్’ (Sight Screen) సమస్య కారణంగా స్టీవ్ స్మిత్ ఆటను కాసేపు నిలిపివేశాడు. ఈ ఆలస్యం కాస్తా ఎక్కువ అవ్వడంతో స్టేడియంలోని ఒక అభిమాని అసహనానికి గురయ్యాడు. స్మిత్ వైఖరిపై సదరు ఫ్యాన్ గట్టిగా అరుస్తూ.. “ఆ బంతిని బాదడం నేర్చుకో స్మడ్జ్.. ప్రిన్సెస్‌లా ప్రవర్తించడం ఆపు! నువ్వేం ఆట కంటే పెద్దోడివి కావు స్టీవ్.. ఆ కాస్త సమస్యను భరించు” అంటూ హిలేరియస్‌గా కామెంట్స్ చేశాడు. ఫాక్స్ క్రికెట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పేస్ బౌలర్ హసన్ మహమూద్ (4/49) అద్భుతమైన స్పెల్‌తో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్మిత్ పట్టుదలగా ఆడి తన కెరీర్లో 45వ టెస్ట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీ ద్వారా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా (Steve Waugh) పేరిట ఉన్న రికార్డును స్మిత్ సమం చేశాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు 50 ప్లస్ (82 సార్లు) స్కోర్లు చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా రికార్డు సృష్టించగా, రికీ పాంటింగ్ (103 సార్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.








