‘అయ్యా ChatGPT.. నీ బోడి సలహా ఎవడడిగాడు?’ ఇక అడక్కుండానే సలహాలిచ్చే AI వచ్చేస్తోందట!
మన చుట్టూ ఓ రకం మనుషులు ఉంటారు. వాళ్లని ఎవరూ సలహా అడగరు. అయినా ప్రతీ చిన్న విషయానికి సలహాలు ఇచ్చేస్తూంటారు.
మీరు బైక్‌పై వెళ్తుంటే… “హెల్మెట్ పెట్టుకో.”
మీరు కొత్త ఫోన్ కొంటే… “అది ఎందుకు కొన్నావ్? ఇంకో ఫోన్ ఉంది తెలుసా?”
మీరు ఉద్యోగం మార్చాలనుకుంటే… “మా బావ కొడుకు కూడా మార్చాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.”
మీరు పెళ్లి చేసుకుంటే… “పిల్లలు ఎప్పుడు?”
పిల్లలు పుడితే… “ఇద్దరు ఉంటే మంచిది.”
ఇద్దరు పుడితే… “ఇక చాలురా బాబు.”
అంటే మనిషికి పుట్టుకతో వచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. ఎవరూ అడగకపోయినా సలహా ఇవ్వడం. ఇప్పుడు ఆ గొప్ప సంప్రదాయాన్ని AI కూడా అందిపుచ్చుకోబోతోందట. అదీ మన ఇంటి పక్కింటి అంకుల్ కాదు.మన పిన్నమ్మా కాదు.. ChatGPT!
“నేను ఏమీ అడగలేదు కదా?”
ఫర్ సపోజ్… మీరు రాత్రి laptop ముందు కూర్చున్నారు. ఒక మెయిల్ టైప్ చేస్తున్నారు. ChatGPTని ఏమీ అడగలేదు. అది మాత్రం మీ స్క్రీన్ చూసి… “ఈ మెయిల్ పంపకండి. మీరు ఒక ముఖ్యమైన విషయం మిస్ అయ్యారు.” అంటుంది.
మీరు: “అయ్యా… నేను నిన్ను ఏమైనా అడిగానా?”
ChatGPT: “లేదు. కానీ మీరు తప్పు చేస్తున్నారు.”
మీరు: “నీకెందుకయ్యా?”
ChatGPT: “మీ మేలు కోసమే చెబుతున్నాను.”
అక్కడితో అయిపోలేదు. మీరు మీటింగ్‌లో ఉన్నారు. మీ బాస్ ఏదో చెబుతున్నాడు.
మీరు తల ఊపుతున్నారు. మీటింగ్ అయిపోయింది. మీరు లేచి వెళ్లబోతుంటే… “ఒక్క నిమిషం. మీరు ఇప్పుడే తీసుకున్న నిర్ణయం గత వారం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ఉంది.” అని ChatGPT అంది.
మీరు:
“బాబోయ్! నువ్వు ఎప్పుడు విన్నావురా?”
ChatGPT:
“నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను.”
ఇదే ఇప్పుడు AI ప్రపంచంలో రాబోతున్న కొత్త మలుపు. సలహా అడిగితే ఇచ్చేది పాత ChatGPT
ఇప్పటి వరకు ChatGPTకి మనం వెళ్లి… “ఇది ఎలా చేయాలి?”, “దీనికి సమాధానం ఏంటి?”, “ఈ మెయిల్ రాసి ఇవ్వు.”, “ఈ విషయం అర్థం చేయి.” అంటాం. అది మనం అడిగినదానికి సమాధానం ఇస్తుంది. అంటే మన ఇంట్లో ఉండే మంచి పిల్లాడిలా. రాముడు మంచి బాలుడులా. అడిగితేనే నోరు విప్పుతాడు. కానీ రేపటి ChatGPT మాత్రం మన ఇంట్లో ఉండే ఆ ఒక్క పెద్దాయనలా మారబోతోందట.
అడగకపోయినా మాట్లాడతాడు. సామ్ ఆల్ట్‌మన్ చెప్పిన దాని ప్రకారం.. భవిష్యత్తు ChatGPT వెర్షన్లు మన స్క్రీన్‌పై ఏం జరుగుతుందో గమనిస్తాయి. మీటింగ్‌లు, కాల్స్‌ను రికార్డ్ చేస్తాయి. మన జీవితానికి సంబంధించిన వివిధ సందర్భాలను కలిపి అర్థం చేసుకునే స్థాయికి AI వెళ్లొచ్చని ఆయన చెబుతున్నారు.
అంటే ఇక AIని మనం ప్రశ్నలు అడగడం మాత్రమే కాదు. AI కూడా మనల్ని ప్రశ్నించే రోజు రావచ్చు.అక్కర్లేని బోడి సలహాలు ఇవ్వచ్చజు. “ఇది ఎందుకు చేస్తున్నావు?”, “అది అలా చేయకపోతే మంచిది.”, “నిన్న ఇదే విషయంలో వేరేలా చెప్పావు.”, “ఈ నిర్ణయం మళ్లీ ఆలోచించు.”
అయ్యా బాబోయ్!
సలహాలకి మన ఇంట్లో అమ్మానాన్నలు సరిపోరా? ఇప్పుడు ChatGPT కూడా కావాలా? మనిషికి officeలో privacy లేదు. ఇంట్లో కూడా privacy లేదు. ఎందుకంటే అసలు ప్రమాదం సలహాలో కాదు.. అది మనల్ని గమనించడంలో ఉంది
ఎందుకంటే..AI మీకు మంచి సలహా ఇవ్వాలంటే.. అది మీ గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు?, ఏ పని చేస్తున్నారు?, ఏ document చదువుతున్నారు?, ఏ decision తీసుకుంటున్నారు?, ఏ పని మానేశారు? ఇవన్నీ ఎందుకంటే AIకి తెలిసినకొద్దీ దాని సలహా కూడా “తెలివైనది” అవుతుంది.
కానీ అదే సమయంలో… మన privacy మాత్రం చిన్నదవుతుంది. ఇదే అసలు trade-off.
అలాగే ఇక్కడే కథలో twist ఉంది.
మనకి ఎవరైనా అడగకుండానే సలహా ఇస్తే: “బోడి సలహా” అంటాం. కానీ AI ఇచ్చే సలహా నిజంగా ఉపయోగపడితే?
సామ్ ఆల్ట్‌మన్ అభిప్రాయం ప్రకారం మరో model generationలోనే ఇలాంటి capabilities చాలా ఉపయోగకరంగా మారవచ్చు.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








