రిజర్వేషన్ ఉన్నా మీ బెర్త్ ఆక్రమించారా? ఇలా చేస్తే రైల్వే నుంచి రూ.75,000 పొందొచ్చు!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
రైలులో రిజర్వేషన్ చేసుకున్నారు. బెర్త్ నంబర్ కూడా కన్ఫర్మ్ అయింది. హ్యాపీగా ట్రైన్ ఎక్కారు. కానీ చూస్తే అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీ బెర్త్‌పై మరో వ్యక్తి కూర్చున్నాడు. పక్కనే మరికొందరు నేలపై కూర్చున్నారు. నడిచేందుకు కూడా చోటు లేదు. వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ఇబ్బందే. టికెట్ ఉన్నా.. మీరు చెల్లించిన సీటును మీరు ఉపయోగించుకోలేని పరిస్థితి.
ఇలాంటి అనుభవం మనలో చాలామంది రైల్వే ప్రయాణికులకు ఎదురవుతూనే ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తాం? టీటీఈకి చెబుతాం. ఎవరినైనా లేపి మన బెర్త్‌లో కూర్చుంటాం. ప్రయాణం అయిపోయిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతాం.
కానీ కేరళలో ఓ కుటుంబం మాత్రం అలా వదిలేయలేదు. తమకు కేటాయించిన బెర్త్‌లను ఇతరులు ఆక్రమించుకోవడం, కోచ్‌లో తీవ్ర రద్దీ కారణంగా ఎదురైన ఇబ్బందులను ఆధారాలతో సహా నమోదు చేసింది. చివరకు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఫలితంగా రైల్వే శాఖ ఆ కుటుంబానికి రూ.50,000 పరిహారం, మరో రూ.25,000 న్యాయపరమైన ఖర్చులు.. మొత్తం రూ.75,000 చెల్లించాల్సి వచ్చింది.
ఈ తీర్పులో అసలు ఆసక్తికరమైన విషయం డబ్బు కాదు. కన్ఫర్మ్డ్ రైల్వే టికెట్ అంటే కేవలం ప్రయాణానికి ఫర్మిషన్ మాత్రమే కాదు.. మీరు చెల్లించిన సీటును ఉపయోగించుకునే హక్కు కూడా ఉందని ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగింది?
2023 డిసెంబర్ 10న పార్ధసారథి , ఆయన భార్య నిర్మల ,కుమారుడు ఆదిత్య కలిసి కన్యాకుమారి–పుణే ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ముగ్గురికీ స్లీపర్ క్లాస్‌లో కన్ఫర్మ్డ్ రిజర్వేషన్ ఉంది.
తల్లిదండ్రులకు S2 కోచ్‌లో లోయర్ బెర్త్‌లు కేటాయించారు. కుమారుడికి S6లో అప్పర్ బెర్త్ ఉంది. కానీ రైలు ప్రయాణం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారిపోయింది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు, వెయిట్‌లిస్ట్‌లో ఉన్నవారు, టికెట్ లేకుండా వచ్చినవారు కూడా రిజర్వ్డ్ కోచ్‌లలోకి వచ్చి బెర్త్‌లను ఆక్రమించుకున్నారు.
కోచ్‌లో కేవలం బెర్త్‌లే ఆక్రమించబడలేదు. నేలపై కూడా ప్రయాణికులు కూర్చోవడం, పడుకోవడం జరిగింది. దాంతో కోచ్‌లో కదలడానికి కూడా ఇబ్బందిగా మారింది. వాష్‌రూమ్‌కు వెళ్లడం కూడా సమస్యగా మారింది.
కుటుంబంలోని తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు కావడంతో సమస్య మరింత తీవ్రమైంది. చాలాసార్లు ఇతర ప్రయాణికులను అడిగిన తర్వాతే తమ లోయర్ బెర్త్‌లను ఉపయోగించుకోగలిగారు. కుమారుడు కూడా తనకు కేటాయించిన అప్పర్ బెర్త్‌ను ఖాళీ చేయించుకోవడానికి పలుమార్లు కోరాల్సి వచ్చింది.
రైల్వేకు ఫిర్యాదు చేసినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు
కుటుంబం ఈ విషయాన్ని మౌనంగా భరించలేదు. రాత్రి 8.12 గంటలకు RailMadad ద్వారా ఫిర్యాదు చేసింది. తర్వాత మరోసారి ఫిర్యాదు చేస్తూ S6 కోచ్‌లో రిజర్వేషన్ లేని ప్రయాణికులతో తీవ్ర రద్దీ ఉందని, టీటీఈ కూడా ఆ కోచ్‌ను సరిగా తనిఖీ చేయలేదని పేర్కొంది.
రైల్వే మాత్రం తమ సిబ్బంది ఫిర్యాదులపై స్పందించారని, వివిధ స్టేషన్ల వద్ద అనధికారికంగా ప్రయాణిస్తున్న వారిని తొలగించారని వాదించింది.
అయితే ఇక్కడే కేసులో కీలకమైన మలుపు వచ్చింది.
రైల్వే చెప్పిన విషయాన్ని నిర్ధారించేందుకు సంబంధిత సిబ్బంది వాంగ్మూలం లేదా ఇతర ఆధారాలను కమిషన్ ముందు సమర్పించలేకపోయింది. మరోవైపు కుటుంబం మాత్రం RailMadad ఫిర్యాదులతో పాటు కోచ్ పరిస్థితిని చూపించే ఫొటోలను కూడా సమర్పించింది.
అంటే ఒకవైపు రైల్వే వాదన ఉంది. మరోవైపు ప్రయాణ సమయంలోనే నమోదు చేసిన ఫిర్యాదులు, ఫొటోలు ఉన్నాయి. కమిషన్‌కు రెండోది బలమైన ఆధారంగా మారింది.
రిజర్వేషన్ టికెట్ ఉంటే.. బెర్త్‌పై హక్కు కూడా ఉంటుంది
పాలక్కాడ్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ కేసులో ఒక ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది. కన్ఫర్మ్డ్ రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడికి తాను చెల్లించిన బెర్త్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉండాలి.
అది సరిగా కల్పించకపోతే కేవలం “రైలులో రద్దీ ఎక్కువగా ఉంది” అని చెప్పి రైల్వే బాధ్యత నుంచి తప్పించుకోలేదని కమిషన్ భావించింది.
వినియోగదారుల చట్టంలో దీనిని “Deficiency in Service”, అంటే సేవలో లోపంగా పరిగణించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణికుడు చెల్లించిన సేవను వాస్తవంగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడితే ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది.
ఈ కేసులో సీనియర్ సిటిజన్లు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. లోయర్ బెర్త్ ఉపయోగించుకోలేకపోవడం, రద్దీ కారణంగా కోచ్‌లో కదలలేకపోవడం వంటి సమస్యలు వృద్ధ ప్రయాణికులకు సాధారణ అసౌకర్యం కంటే తీవ్రమైనవిగా మారవచ్చు.
రూ.75 వేల పరిహారం ఎందుకు?
కుటుంబం ప్రయాణాన్ని పూర్తిగా ముగించినందున టికెట్ ఛార్జీని తిరిగి ఇవ్వాలని కమిషన్ ఆదేశించలేదు.
అయితే అందుకు బదులుగా రైల్వే సేవలో లోపం, కుటుంబం ఎదుర్కొన్న మానసిక వేదన, అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుని రూ.50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అదనంగా కేసు కోసం కుటుంబం చేసిన న్యాయపరమైన ఖర్చులకు రూ.25,000 చెల్లించాలని చెప్పింది. అంటే మొత్తం రూ.75,000.
రైల్వే ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలి. ఆలస్యం చేస్తే నెలకు లేదా నెలలో కొంత భాగానికి రూ.500 చొప్పున అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కేసు ప్రతి రైల్వే ప్రయాణికుడికి ఎందుకు ముఖ్యమంటే?
మన దేశంలో రైలు ప్రయాణంలో రద్దీ కొత్త విషయం కాదు. ముఖ్యంగా పండుగలు, సెలవులు, ప్రత్యేక రైళ్లు నడిచే సమయాల్లో రిజర్వ్డ్ కోచ్‌ల్లోకి కూడా ఇతర ప్రయాణికులు రావడం గురించి ప్రయాణికులు తరచూ ఫిర్యాదు చేస్తుంటారు.
అలాంటి సమయంలో చాలామంది “ఏం చేస్తాం.. ఇండియాలో రైలు ప్రయాణం ఇంతే కదా!” అనుకుంటారు. కానీ ఈ కేసు చెబుతున్న మెసేజ్ మాత్రం వేరుగా ఉంది. మీరు రిజర్వేషన్ కోసం డబ్బు చెల్లించారు. మీకు నిర్దిష్టమైన కోచ్, బెర్త్ కేటాయించారు. ఆ సేవను ఉపయోగించుకునే అవకాశం మీకు ఇవ్వడం కూడా రైల్వే బాధ్యతలో భాగమే.
అందుకే సమస్య ఎదురైతే కేవలం టీటీఈతో వాగ్వాదం చేసి ఆపేయకుండా, దానికి ఒక రికార్డు క్రియేట్ చేయటం చాలా ముఖ్యం.
రైలులో మీ బెర్త్‌ను ఇతరులు ఆక్రమిస్తే ఏం చేయాలి?
మొదట RailMadadలో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు నంబర్, స్క్రీన్‌షాట్‌ను భద్రపరచుకోవాలి. ఏ కోచ్, ఏ బెర్త్, ఏ రైలు, ఏ తేదీ, సుమారు ఏ సమయంలో సమస్య ఎదురైందో నమోదు చేసుకోవాలి.
పరిస్థితి సురక్షితంగా ఉంటే కోచ్‌లోని రద్దీ, మీ బెర్త్‌ను ఆక్రమించిన పరిస్థితిని చూపించే ఫొటోలు లేదా వీడియోలు తీసుకోవచ్చు. టీటీఈ లేదా రైల్వే భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసి, వారు తీసుకున్న చర్యను కూడా గమనించుకోవాలి.
ముఖ్యంగా మీ కన్ఫర్మ్డ్ టికెట్, చెల్లింపు వివరాలు, RailMadad ఫిర్యాదులు, ఫొటోలు, వీడియోలు అన్నింటినీ భద్రపరచుకోవాలి.
ఎందుకంటే ప్రయాణం పూర్తయిన తర్వాత “నాకు చాలా ఇబ్బంది అయింది” అని చెప్పడం ఒక విషయం. అదే విషయాన్ని ప్రయాణ సమయంలోనే ఫిర్యాదు చేసి, దానికి ఆధారాలు క్రియేట్ చేయటం మరో విషయం. ఈ కేసులో కుటుంబానికి అనుకూలంగా మారిన ప్రధాన అంశాల్లో ఇదే ఒకటి.
ప్రతీసారి 75,000 పరిహారం వస్తుందా
అయితే దీనర్థం ప్రతి రైల్వే సమస్యకు ఆటోమేటిక్‌గా రూ.75,000 పరిహారం వస్తుందని కాదు. ప్రతి కేసులో పరిస్థితులు, ఆధారాలు, ఎదురైన నష్టం, రైల్వే తీసుకున్న చర్యలు వేర్వేరుగా ఉంటాయి.
కానీ ఈ తీర్పు ఒక ముఖ్యమైన సూత్రాన్ని మాత్రం బలంగా ముందుకు తెచ్చింది. రిజర్వేషన్ అనేది కేవలం టికెట్‌పై ముద్రించిన బెర్త్ నంబర్ కాదు. మీరు చెల్లించిన సేవను ఉపయోగించుకునే హక్కుకు అది ఆధారం.
అందుకే రైలులో మీ బెర్త్‌ను ఎవరైనా ఆక్రమించినప్పుడు సమస్యను భరించి ప్రయాణం ముగించేయడం ఒక్కటే మార్గం కాదు. ముందుగా ఫిర్యాదు చేయాలి. ఆధారాలు సేకరించాలి. సమస్య పరిష్కారం కాకపోతే అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఉపయోగించుకోవచ్చు.
ఫైనల్ గా ..
రైల్వే టికెట్ కొనడం మీ ప్రయాణాన్ని మాత్రమే కన్ఫర్మ్ చేయదు. మీ హక్కును కూడా కన్ఫర్మ్ చేస్తుంది. ఆ హక్కు ఉల్లంఘించబడితే.. దానికి ఆధారాలు ఉంటే, ప్రశ్నించే అవకాశం కూడా మీకు ఉంటుంది.








