శాంతించిన ద్రవ్యోల్బణం.. పుంజుకున్న పసిడి: $4,400 దాటిన బంగారం ధరలు
అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణ నివేదిక వెలువడిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు (Gold Price) బుధవారం పుంజుకున్నాయి. జూలై నెల సీపీఐ (CPI) ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా నమోదుకావడంతో, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు బలపడ్డాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1.1 శాతం పెరిగి ఔన్సుకు $4,416.15కి చేరగా, గోల్డ్ ఫ్యూచర్స్ 0.8 శాతం లాభపడి $4,476.35 వద్ద ముగిశాయి.
శాంతించిన ద్రవ్యోల్బణం
అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వివరాల ప్రకారం.. జూలై నెల హెడ్లైన్ సీపీఐ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 3.5 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గింది. అలాగే ఆహార, ఇంధన ధరలను మినహాయించి చూసే కోర్ సీపీఐ 2.6 శాతం నుంచి 2.5 శాతానికి దిగివచ్చింది. ఇటీవల వెలువడిన బలహీనమైన ఉద్యోగ నివేదికకు తోడు, ద్రవ్యోల్బణం (Inflation) కూడా తగ్గడంతో సెప్టెంబర్ నెల సమీక్షలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం 60 శాతానికి పెరిగిందని సీఎంఈ ఫెడ్‌వాచ్ (CME FedWatch) టూల్ స్పష్టం చేసింది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే సూచనలు కనిపిస్తే, పసిడి (Gold Price) వంటి సురక్షిత పెట్టుబడులకు ఆదరణ పెరుగుతుంది.
90 డాలర్లు తాకిన క్రూడాయిల్
ఒకవైపు ఆర్థిక గణాంకాలు పసిడికి (Gold Price) ఊతమిచ్చినప్పటికీ, మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పునఃప్రారంభంపై అమెరికా, ఇరాన్‌ల మధ్య స్పష్టత రాకపోవడంతో ముడిచమురు ధరలు మళ్లీ మండిపడ్డాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒకానొక దశలో పీపా (బ్యారెల్) $90 మార్కును తాకింది. హోర్ముజ్ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉందంటూ ఇరు దేశాలు ప్రకటనలు చేస్తుండటంతో సరుకు రవాణా నౌకలపై అనిశ్చితి కొనసాగుతోంది.
చైనా వద్ద పెరుగుతున్న పసిడి నిల్వలు
మరోవైపు చైనా కేంద్ర బ్యాంక్ ‘పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా’ (PBOC) తమ వద్ద ఉన్న పసిడి నిల్వలను (Gold Price) వరుసగా 21వ నెలలో కూడా పెంచుకుంది. జూలై నెలలో కొత్తగా 6,40,000 ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో చైనా మొత్తం నిల్వలు 7.60 కోట్ల ఔన్సులకు (76.08 million ounces) చేరాయి. దీనికి తోడు చైనా గోల్డ్ ఈటీఎఫ్‌లలో కూడా భారీగా పెట్టుబడులు వస్తుండటం పసిడి ధరకు అదనపు బలాన్ని ఇస్తోంది.
సాంకేతిక విశ్లేషణ:
విశ్లేషకుల అంచనా ప్రకారం.. బంగారం ధర (Gold Price) $4,460 – $4,495 శ్రేణి వద్ద ప్రధానమైన నిరోధాన్ని (Resistance) ఎదుర్కొంటోంది. ఈ స్థాయిని దాటి పసిడి స్థిరపడితే మళ్లీ $5,000 మార్కు వైపు వేగంగా పయనించే అవకాశాలు ఉన్నాయని టెక్నికల్ నిపుణులు భావిస్తున్నారు.








