ఎన్నారైలపై ట్రంప్ సర్కార్ మరో కఠిన నిబంధన..! ఇమిగ్రేషన్ అప్లికేషన్ ఆన్లైన్ ఫైలింగ్ తప్పనిసరి..!
వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్న అమెరికా ప్రభుత్వం.. తాజాగా మరో అస్త్రాన్ని బయటకు తీసింది. గ్రీన్‌కార్డ్, పౌరసత్వం, ఆశ్రయం వంటి ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది (Immigration Applications). త్వరితగతిన మెరుగైన సేవలు అందించేందుకు, నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది.
ఈ మేరకు కొత్త నిబంధనను ఫెడరల్ రిజస్టర్‌లో సోమవారం పబ్లిష్ చేసింది. గ్రీన్‌కార్డు దరఖాస్తులు, రెన్యువల్స్, ఫ్యామిలీ బేస్డ్ పిటిషన్లు, పౌరసత్వం కోసం, ఆశ్రయం కోసం చేసుకునే అభ్యర్థనలు, ఉపాధి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షిత హోదా ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఈ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే దరఖాస్తు దారులు యూఎస్సీఐఎస్ ఆన్లైన్ అకౌంట్ లేదా మెయిల్ (పోస్టు) ద్వారా పంపించే అవకాశం ఉంది.
మరోవైపు.. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకున్న పెద్ద సంస్థలు ఆ ఉద్యోగుల హెచ్1బీ వీసా పొడిగింపునకు 4000 డాలర్లు, ఎల్1 వీసా పొడిగింపునకు 4500 డాలర్లు ఫీజు రూపంలో చెల్లించాలని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనల్ని ప్రకటించింది. ఇంతకు ముందు హెచ్1బీ, ఎల్1లకై తొలిసారి సమర్పించే దరఖాస్తులకు లేదా వీసాదారుడు ..ఉద్యోగం మారినప్పుడు మాత్రమే ఈ ఫీజు వర్తించేది.
అమెరికాలో 50 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో 50 శాతానికి మించి ఉద్యోగులు హెచ్1బీ లేదా ఎల్1 నాన్ ఇమ్మిగ్రెంట్ స్థాయి కలిగి ఉంటే వారికి వర్తించే ‘‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ ఫీ’’ సెప్టెంబరు 9 నుంచి అమలులోకి వస్తుందని హోమ్‌ల్యాండ్ రక్షణ విభాగం పేర్కొంది. ఉద్యోగికి సంబంధించిన వీసా పొడిగింపునకు యథారీతిగా దరఖాస్తు చేసే సంస్థలు అందుకు అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.








