పెట్టుబడులే లక్ష్యంగా ప్రవాసులతో మల్లు భట్టి విక్రమార్క భేటీ!
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ (సీజీఐ ఎస్ఎఫ్ఓ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికగా బే ఏరియాకు చెందిన ప్రముఖ తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, అగ్రగామి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ వసతి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతరం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రధాన బలాలని వివరించారు.
పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి..
పారిశ్రామిక కారిడార్లు, పార్కుల్లో తయారీ, ఐటీ, జీవశాస్త్రం (ఫార్మా), స్వచ్ఛ ఇంధనం (గ్రీన్ ఎనర్జీ) మరియు నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా అనుమతులు ఇచ్చేందుకు పారదర్శకమైన సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఇతర సాంకేతిక విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.
అత్యాధునిక సాంకేతికత, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర పట్టణ ప్రణాళికను సమన్వయం చేస్తూ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమల విస్తరణలో భాగస్వాములు కావాలని ప్రవాస తెలుగు పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.
వేమో’ డ్రైవర్‌లెస్ వాహనంలో ప్రయాణం..
అమెరికా పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క శాన్ఫ్రాన్సిస్కోలో ‘వేమో’ (Waymo) స్వయంచాలక (డ్రైవర్‌లెస్) వాహనంలో ప్రయాణించారు. ఆటోమొబైల్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై స్వయంచాలక వాహన సాంకేతికత, దాని నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నియంత్రణ విధానాలపై విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్‌తో పాటు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలోనూ ఈ స్వయంచాలక మొబిలిటీ పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలపై ఆరా తీశారు. అధిక రిజల్యూషన్ మ్యాపింగ్, సెన్సార్ అనుకూల రోడ్డు డిజైన్, ప్రత్యేక టెస్టింగ్ కారిడార్లు, డేటా కనెక్టివిటీ, ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల గురించి వేమో బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. నూతన తరం మొబిలిటీ టెక్నాలజీని హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో అనుసంధానించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.








