ఒక యానిమేషన్ సినిమా..20 వేల కోట్లు కలెక్షన్స్ ?ఇందులో అంత గొప్పతనం ఏముంది?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
హాలీవుడ్ దశాబ్దాలుగా యానిమేషన్ ప్రపంచాన్ని శాసిస్తూ వస్తోంది.
Disney…
Pixar…
DreamWorks…
వీళ్లే ఈ రంగంలో తిరుగులేని రాజులుగా నిలిచారు. కానీ ఇప్పుడు ఆ సింహాసనంపై కూర్చున్నది ఒక చైనా సినిమా. Ne Zha 2 ప్రపంచవ్యాప్తంగా $2.23 బిలియన్లకు (₹19,400 కోట్లు)పైగా వసూలు చేసింది. ఓటిటి అమ్మకాలు, మిగతా బిజినెస్ లు కలిపితే ఇరవై వేల కోట్లు దాటేసి, యానిమేషన్ చరిత్రనే తిరగరాసింది.
అసలు ఈ విజయానికి కారణం గొప్ప కథేనా? లేక దీని వెనుక ఇంకా పెద్ద వ్యాపార వ్యూహం ఉందా?
—
అసలు ఎవరీ ‘Ne Zha’?
మన భారతీయ పురాణాల్లో దేవతలు, అసురులు, దివ్యాస్త్రాలతో కూడిన పౌరాణిక ప్రపంచం ఉన్నట్లే, చైనాకు కూడా వేల ఏళ్ల పౌరాణిక సంప్రదాయం ఉంది. ఆ గాథల్లో అత్యంత ప్రజాదరణ పొందిన శక్తివంతమైన యోధుల పాత్రల్లో ‘Ne Zha’ ఒకడు. అసాధారణ శక్తులతో జన్మించిన ఈ బాలుడు, తన విధిని తానే మార్చుకోవడానికి దేవతలు, రాక్షసులు, డ్రాగన్ రాజులతో చేసే పోరాటమే ఈ కథ.
ఫస్ట్ పార్ట్ (2019): లోకానికి ముప్పుగా మారతాడని ముద్రపడిన ఒక బాలుడు, తన జన్మ కాదు… తన నిర్ణయాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని నిరూపిస్తాడు. ఈ సినిమా సాధించిన అపూర్వ విజయం రెండో భాగానికి తిరుగులేని పునాది వేసింది.
రెండో భాగం (Ne Zha 2): ఇందులో ‘నె ఝా’, అతని స్నేహితుడు ‘ఆవో బింగ్’ ఎదుర్కొనే అంతర్గత సంఘర్షణ, దేవతలు-డ్రాగన్ రాజ్యాల మధ్య జరిగే మహా యుద్ధం కథకు ప్రధాన బలం. అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలు, పౌరాణిక కథనాన్ని ఆధునిక యానిమేషన్‌తో మేళవించడం ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.
—
బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ వెనుక అసలు కారణాలు
ఈ సినిమా కేవలం కంటెంట్‌తో మాత్రమే విజయం సాధించలేదు; దీని వెనుక పక్కా వ్యాపార వ్యూహం ఉంది:
పురాణాన్ని ‘గ్లోబల్ IP’గా మార్చడం
డిస్నీ మాజీ సీఈఓ బాబ్ ఐగర్ ఒకసారి అన్నారు:”మేము కేవలం సినిమాల వ్యాపారంలో లేము, క్యారెక్టర్ బ్రాండ్ల (IP) వ్యాపారంలో ఉన్నాం.” అని. హాలీవుడ్ దశాబ్దాలుగా మార్వెల్, స్టార్ వార్స్, ఫ్రోజెన్ వంటి పాత్రలను బిలియన్ డాలర్ల బ్రాండ్లుగా మార్చింది. చైనా కూడా అదే వ్యూహంతో తన పురాణ పాత్రను గ్లోబల్ ప్రాంచైజీగా నిలబెట్టింది.
ఒకే దేశ మార్కెట్ శక్తి
ఒకప్పుడు గ్లోబల్ రికార్డు కొట్టాలంటే అమెరికా బాక్సాఫీస్ తప్పనిసరి. కానీ Ne Zha 2 వసూళ్లలో అత్యధిక భాగం ఒక్క చైనా నుంచే వచ్చింది. సరైన కంటెంట్ ఉంటే ఒకే దేశ మార్కెట్ ప్రపంచంలోనే నంబర్-1 సినిమాను సృష్టించగలదని ఇది నిరూపించింది.
ఫ్యామిలీ ఆడియన్స్ మల్టీప్లైయర్
యానిమేషన్ సినిమాల అసలు బలం పిల్లల కంటే వారి కుటుంబాలే. ఒక పిల్లాడు సినిమా చూడాలనుకుంటే అతనితో పాటు తల్లిదండ్రులు, తోబుట్టువులు, అవసరమైతే తాతయ్య-అమ్మమ్మలు కూడా వస్తారు. అంటే ఒకే ప్రేక్షకుడు నాన్-స్టాప్‌గా నాలుగు టికెట్లుగా మారతాడు!
పక్కా రిలీజ్ టైమింగ్
ఈ చిత్రాన్ని చైనాలో అత్యంత పెద్ద పండుగ అయిన ‘లూనార్ న్యూ ఇయర్’ సందర్భంగా విడుదల చేశారు. ఆ సమయంలో కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లడం అక్కడి సంప్రదాయం. కంటెంట్‌కు సరైన సీజన్ తోడైతే బాక్సాఫీస్ ఎలా బ్రద్దలు అవుతుందో ఇదో ఉదాహరణ.
వరల్డ్ క్లాస్ విజువల్ ఎక్స్పీరియన్స్
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట “ఇది యానిమేషన్ అని మర్చిపోయాం!” అంతలా డ్రాగన్ యుద్ధాలు, సీజీఐ (CGI) నాణ్యత, యాక్షన్ సీక్వెన్స్‌లను హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో డిజైన్ చేశారు.
వరల్డ్ వైడ్ ఆల్-టైమ్ టాప్ 5 యానిమేషన్ చిత్రాలు
సినిమా పేరు – ప్రపంచ వసూళ్లు (USD)
1 Ne Zha 2 $2.23 Billion
2 Inside Out 2 $1.69 Billion (₹14,700 కోట్లు)
3 The Lion King (2019) $1.66 Billion (₹14,400 కోట్లు)
4 Frozen II $1.45 Billion (₹12,600 కోట్లు)
5 The Super Mario Bros. Movie $1.36 Billion (₹11,800 కోట్లు)
గమనించండి…ఈ ఆల్-టైమ్ టాప్ లిస్ట్‌లో నాలుగు హాలీవుడ్ సినిమాలు ఉంటే… మొదటి స్థానంలో చైనీస్ సినిమా నిలవడం ఈ కథలోని అసలు ట్విస్ట్!
—
భారత్‌లో ఈ సినిమా చూడొచ్చా?
అవును. చూడచ్చు. Ne Zha 2 చైనాలో 2025 జనవరి 29న విడుదలైంది. తర్వాత భారత్‌లో కూడా థియేటర్లలో విడుదలైంది.
ప్రస్తుతం ఈ చిత్రం భారత్‌లో JioHotstar ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, ఇంగ్లీష్, మరియు ఒరిజినల్ మాండరిన్ భాషల్లో అందుబాటులో ఉంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), వరల్డ్ బిల్డింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
మన వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు
చైనా దగ్గర ‘Ne Zha’ ఉంది, జపాన్ దగ్గర ‘Anime’ ఉంది, అమెరికా దగ్గర ‘Marvel’ ఉంది.
మరి మన దగ్గర? రామాయణం, మహాభారతం, భాగవతం, శివ పురాణం, పంచతంత్రం…ఇలా చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత గొప్ప కథల నిధి మన సొంతం. కానీ వాటిని అంతర్జాతీయ మార్కెట్ ఆమోదించే స్థాయి యానిమేషన్ ఫ్రాంచైజీలుగా మార్చడంలో మనం ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది.
ప్రపంచాన్ని జయించడానికి హాలీవుడ్ కథలు అక్కర్లేదు. మన సంస్కృతిలోని కథలను గ్లోబల్ క్వాలిటీతో ప్రజెంట్ చేయగలిగితే చాలు అని ‘Ne Zha 2’ స్పష్టంగా చాటిచెప్పింది. చైనా ఆ పని చేసి చూపించింది… మరి భారతదేశం ఎప్పుడు అడుగులేస్తుంది? ఈ మధ్య కాలంలో మహావతార్ నరసింహ (Mahavatar Narsimha) అలాంటి ఓ అడుగు వేసిందనే చెప్పాలి.








