భోగాపురంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయండి
ప్రధాని పర్యటన విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రధాని పర్యటన విజయవంతానికి ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆగష్టు 1వ తేదీన రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై భోగాపురం విమానాశ్రయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడుతో కలిసి అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారుల పనులు, పార్కింగ్, టెర్మినల్ బిల్డింగ్, బహిరంగ సభ వేదిక, భద్రత, జనసమీకరణ, ప్రోటోకాల్ గ్యాలరీ, భోజనం, రవాణా ఏర్పాట్లపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నారా లోకేష్ పలు సూచనలు చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి 32 నియోజకవర్గాల నుంచి దాదాపు 3 లక్షల మంది హాజరవుతారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. బహిరంగ సభ వేదికలో వీవీఐపీ సీటింగ్ సామర్థ్యాన్ని 520 నుంచి వెయ్యికి పెంచామని, వీఐపీ 3వేలు, వెయ్యి మంది ఛాంపియన్స్, విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వారు ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల కోసం ప్రధాన రహదారికి ఇరువైపులా 20 భోజనం కౌంటర్లు ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. విద్యార్థుల విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కే.అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొలుసు పార్థసారథి, బీసీ జనార్థన్ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కళా వెంకట్రావు, ఏలూరి సాంబశివరావు, పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, కార్యక్రమాల కమిటీ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్ వర్మ, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ఛైర్మన్ జీబీఎస్ రాజు, స్టేట్ మీడియా కోఆర్డినేటర్ బీవీ. రాముడు, ప్రధాని పర్యటన నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








