ఒక్క ఆరోపణ… 76 వేల కేసులు… ₹47 వేల కోట్ల సెటిల్మెంట్! Johnson & Johnson కథలో అసలు ట్విస్ట్ ఏంటి?
20 కేసుల్లో 19 గెలిచింది.
అయినా… ₹47 వేల కోట్లు పరిహారం చెల్లించడానికి ఒప్పుకుంది.
ప్రపంచంలో ఏ కంపెనీ ఇలా చేస్తుంది?. కోర్టులో గెలిచి కూడా వేల కోట్ల సెటిల్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఎలా వస్తుంది? ఇది ఓటమా? లేక కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత తెలివైన వ్యాపార నిర్ణయమా?. ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే… ప్రపంచాన్ని దాదాపు 12 ఏళ్ల పాటు కుదిపేసిన Johnson & Johnson తాల్క్ కేసు కథలోకి వెళ్లాల్సిందే.
ఒక బేబీ పౌడర్… ప్రపంచంలోనే అతిపెద్ద లీగల్ పోరాటాల్లో ఒకటి!
పసిపిల్లలు ఉన్న ప్రతి ఇంటా ఒకప్పుడు ఖచ్చితంగా కనిపించే డబ్బా అది. గులాబీ రంగు మూత… తెల్లటి పౌడర్… ఆ సువాసన చూస్తే చాలు, మన చిన్నతనమో లేదా మన పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలో ఒక్కసారిగా కళ్లముందు కదులుతాయి. పసిపాపకు స్నానం చేయించాక, ఆ పౌడర్ వేసి గుండెలకు హత్తుకోవడం మన ఇళ్లల్లో దాదాపు ప్రతి ఇంట్లో జరిగిన వ్యవహారం.
కానీ, అమాయకంగా అలా మన ఇళ్లల్లోకి వచ్చిన ఆ పౌడర్ డబ్బా… అమెరికా కోర్టుల్లో 76 వేల మంది ఆడవాళ్ల కన్నీటికి, కోపానికి కారణమవుతుందని ఎవరైనా ఊహించారా?
“నేను ఏళ్ల తరబడి నమ్మి వాడిన ఈ పౌడరే నా కడుపులో క్యాన్సర్ రగిల్చింది” అని ఒక తల్లి కోర్టు మెట్లెక్కినప్పుడు… అది కేవలం ఒక లీగల్ కేసుగా మిగలలేదు. లక్షలాది మంది గుండెల్లో ఒక రకమైన భయాన్ని, అనుమానాన్ని నింపింది.
భయం ఒకవైపు… నిశ్శబ్దం మరోవైపు!
“పౌడర్ వల్ల నాకు ఓవరియన్ క్యాన్సర్ వచ్చింది!” ఈ ఒక్క మాట వినగానే ఏ మహిళా ప్రశాంతంగా ఉండలేకపోయింది. అరే.. నా పిల్లలకు వేశానె, నా కూతురికి పూశానె… మరి వాళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.
అయితే, ఇక్కడే ఒక విచిత్రమైన నిజాన్ని మనం ఎదుర్కోవాలి. డాక్టర్లు, సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా… “అవును, ఈ పౌడర్ వల్లే క్యాన్సర్ వచ్చింది” అని ఏ ఒక్కరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
క్యాన్సర్ అనేది ఒక నరకం. ఆ వ్యాధిన పడ్డ మహిళల వేదన, ఆ కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. ఆ బాధలో ఉన్నప్పుడు “ఈ పౌడరే నా ప్రాణం తీస్తోంది” అని వారు నమ్మడంలో, అనటంలో వింతేమీ లేదు. కానీ, విచారణకు వచ్చిన ఇద్దరు నిపుణులు కూడా కోర్టులో చేతులెత్తేశారు. “మనం కచ్చితంగా చెప్పలేం” అన్నారు.
అప్పుడు జడ్జి అడిగిన ఆ ఒక్క మాట ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది: “సైన్స్‌కే స్పష్టత లేనప్పుడు… ఆ తల్లుల బాధకు ఎవరు బాధ్యులు? బాధితులు తమ ఆరోపణలను ఎలా నిరూపించుకోగలరు?” అని.
ఒక తల్లి వేదన… 76 వేల కేసుల సునామీ!
మొదట ఒక మహిళ ధైర్యంచేసి కోర్టు తలుపు తట్టింది. ఆమె వెనుక మరో పది మంది… వంద మంది… వెయ్యి మంది… చూస్తుండగానే 76,000 మంది మహిళలు ఏకమయ్యారు!కేసులు వేసారు.

అదెలా సాధ్యం అంటారా…అమెరికాలో ఉన్న న్యాయ వ్యవస్థ అలాంటిది. ఒక ప్రొడక్ట్ వల్ల తమకు అన్యాయం జరిగిందని భావిస్తే, వేలాది మంది కలిసి పోరాడే వెసులుబాటు అక్కడ ఉంది. లా ఫర్మ్‌లు ముందుకు వచ్చాయి. “మీరూ ఆ పౌడర్ వాడారా? మీకూ ఆ రోగం వచ్చిందా? రండి, పోరాడదాం!” అని పిలుపునిచ్చాయి. అమెరికాలోని Mass Tort Litigation అనే ప్రత్యేక వ్యవస్థ కీలక పాత్ర పోషించింది.
లా ఫర్మ్‌లు రకరకాల ప్రకటనల ద్వారా బాధితులను సంప్రదించి, కేసుల్లో చేరే అవకాశాన్ని తెలియజేశారు. దాంతో వేలాది కేసులు ఒకేసారి కోర్టులను ముంచెత్తాయి. శాస్త్రీయ నిరూపణల కంటే కూడా, కేసుల సంఖ్య సృష్టించిన ఒత్తిడే ఇక్కడ అతిపెద్ద సవాలుగా మారింది.
ఆ సమయంలో కంపెనీ తరఫున నిలబడ్డ లాయర్లు శాస్త్రీయ ఆధారాలు చూపించారు. కోర్టు గదుల్లో గంటల తరబడి వాదనలు జరిగాయి. చిత్రమేమిటంటే… నేరుగా విచారణకు వచ్చిన 20 ప్రధాన కేసుల్లో, ఏకంగా 19 కేసుల్లో కంపెనీయే గెలిచింది!
అయినా సరే… ఆ విజయం కంపెనీకి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఎందుకంటే బయట ఇంకా 76,000 కేసులు క్యూలో ఉన్నాయి!
శాస్త్రం ఓడిపోలేదు… మనిషి ఓపిక నశించింది!
ఒక్కొక్క కేసును విచారించుకుంటూ పోతే దశాబ్దాలు పడుతుంది. ప్రతీ వారం పేపర్లలో “జాన్సన్ పౌడర్-క్యాన్సర్” అని వార్తలు వస్తుంటే… ఎంత పెద్ద కంపెనీ అయినా బ్రాండ్ ఇమేజ్ తుడిచిపెట్టుకుపోతుంది. షేర్లు పడిపోతాయి.
ఈ మానసిక నరకం నుండి, లీగల్ చిక్కుల నుండి బయటపడటానికి కంపెనీ ఒక దారి వెతికింది. తమ అనుబంధ సంస్థను దివాలా తీసినట్లు చూపి, ఒక ట్రస్ట్ ద్వారా పరిహారం ఇచ్చి ముగించాలని చూసింది. కానీ, కోర్టులు ఆ ఆలోచనను నిష్కారణంగా తోసిపుచ్చాయి. “అన్ని వేల కోట్లు పెట్టుకుని దివాలా నాటకాలు ఆడకండి” అని మొట్టికాయ వేశాయి.
ఆ దారి మూసుకుపోయాక…
ఇక లాభం లేదు! కోర్టుల్లో గెలుస్తున్నా సరే… సమాజంలో, మార్కెట్లో తాము ఓడిపోతున్నామని గ్రహించింది. అందుకే, $5.5 బిలియన్లు (దాదాపు ₹47,000 కోట్లు) పరిహారంగా ఇస్తామని, ఈ వివాదానికి శాశ్వతంగా స్వస్తి పలుకుదామని ముందుకు వచ్చింది.
అసలు ట్విస్ట్: ఈ కథలో గెలిచింది ఎవరు?
ఈ 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో హాలీవుడ్ తరహా ట్విస్టులకూ కొదువలేదు. ఒకప్పుడు ఈ పౌడర్ కంపెనీ తరఫున పనిచేసి, రహస్యాలన్నీ తెలుసుకున్న ఒక లాయర్… తర్వాత సైలెంట్‌గా వెళ్లి కేసు వేసిన బాధితుల లాయర్లతో చేతులు కలిపాడు! కానీ, కోర్టు ఆ మోసాన్ని పసిగట్టి, ఆ లాయర్ల ఫర్మ్‌ను కేసు నుంచే బయటకు తోసేసింది.కోర్టు దీనిని తీవ్రమైన Conflict of Interest (పరస్పర ప్రయోజనాల ఘర్షణ)గా పరిగణించి, ఆ లా ఫర్మ్‌ను ఈ విచారణ నుంచి తప్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఎవరి గెలిచారు
ఇంత జరిగిన తర్వాత, ఇవాళ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే… ఈ కథలో నిజంగా గెలిచింది ఎవరు?.ఆ తల్లులా? ఆ డబ్బు వాళ్లకు పోయిన ఆరోగ్యాన్ని లేదా కోల్పోయిన ప్రాణాలను తిరిగి తేలేదు. కంపెనీయా? కోర్టుల్లో గెలిచినా… వేల కోట్లు చెల్లించి, నమ్మకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. శాస్త్రమా? ఇప్పటికీ ఆ పౌడర్‌కు, క్యాన్సర్‌కు మధ్య ఉన్న బంధం ఏంటో తేల్చలేక తలపట్టుకుని నిల్చుంది.
చివరకు మిగిలింది ఒక్కటే…
ఇది కేవలం ₹47 వేల కోట్ల సెటిల్మెంట్ కథ కాదు.
మనం ఎంతో ప్రాణంగా, సురక్షితం అనుకుని ఇంట్లోకి తెచ్చుకునే ఒక చిన్న పౌడర్ డబ్బా వెనుక… మనుషుల నమ్మకాలు, భయాలు, వేల కోట్ల వ్యాపారాలు, న్యాయపోరాటాలు ఎలా ఊపిరాడకుండా చేస్తాయో చెప్పడానికి ఈ కథ ఒక చేదు జ్ఞాపకం! ఇది ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో శాస్త్రీయ అనిశ్చితి, భారీ సమూహ వ్యాజ్యాలు, వ్యాపార వ్యూహాలు ఒకదానితో ఒకటి ఎలా ఢీకొంటాయో చూపించిన అత్యంత ఆసక్తికరమైన లీగల్ కథల్లో ఒకటిగా నిలిచిపోయింది.








