సీజేపీ స్ఫూర్తితో తెలంగాణలో ఎండ్రిన్ పార్టీ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ నిరుద్యోగ యువతను తట్టిలేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి, రాజకీయ హామీల ఉల్లంఘనకు నిరసనగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, పోలీస్ జేఏసీ నేతలు ఏకమై ‘తెలంగాణ ఎండ్రిన్ పార్టీ’ (TEP) పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్యల సమగ్ర పరిష్కారమే అజెండాగా రూపుదిద్దుకున్న ఈ నిర్ణయం, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ సంచలనాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ప్రధాన కారణమని నిరుద్యోగ నాయకులు స్పష్టం చేశారు. “మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కాదు” అంటూ సీఎం చేసిన కామెంట్స్ నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి. దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువత ఆవేదనను ఎద్దేవా చేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలకు నిరసనగానే, ఆ పదాలనే ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రంగా మలచి ‘తెలంగాణ ఎండ్రిన్ పార్టీ’కి పురుడుపోశారు. ప్రజాస్వామ్యయుతంగా తమ గొంతును చట్టసభలు, రాజకీయ వేదికలపై వినిపించడమే ఈ నూతన వేదిక లక్ష్యమని ప్రతినిధులు వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను కూడా పెట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిర్దేశిత గడువులోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన యువత కోసం 20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను నింపాలన్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నియామక ప్రక్రియను ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా పారదర్శకంగా వేగవంతం చేయాని డిమాండ్ చేశారు.
పార్టీ నమోదు ప్రక్రియను వారం రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద పూర్తి చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో భారీ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విప్లవ పోరాటాల ప్రతీక మారోజు వీరన్న స్థూపం వద్ద తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అధికారిక లోగోను ఆవిష్కరించి తొలి బహిరంగ సభ ద్వారా తమ బలాన్ని చాటుకోనున్నారు.
ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన రాజకీయం మరొకటి ఉంది. జాతీయ స్థాయిలో వెలిసిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా పూర్తి మద్దతు పలికారు. యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు 21 ఏళ్లకే చట్టసభల్లోకి అడుగుపెట్టేలా వయోపరిమితిని సడలించాలని కాంగ్రెస్ గళమెత్తి సర్వత్రా ప్రశంసలు అందుకుంది. కానీ, సొంత రాష్ట్రంలో గత 50 రోజులుగా నిరుద్యోగులు రోడ్డెక్కి పోరాడుతున్నా, వారి సమస్యలను పట్టించుకోకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య హక్కులు మాట్లాడే కాంగ్రెస్, స్థానికంగా నిరుద్యోగుల ఆవేదనను తృణీకరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ బాటలోనే ‘తెలంగాణ ఎండ్రిన్ పార్టీ’ ఆవిర్భవించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించని పెద్ద రాజకీయ తలనొప్పిగా మారింది. నిరుద్యోగుల తిరుగుబాటు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, ఎన్నికల క్షేత్రంలో ఓటు బ్యాంకును శాసించే స్థాయికి చేరితే అది అధికార కాంగ్రెస్కు సవాలుగా మారడం ఖాయం. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం మొండివైఖరి వీడి నిరుద్యోగుల సమగ్ర డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఈ ‘ఎండ్రిన్’ ఉద్యమ సెగలు రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్ధృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.








