ఆటా గోల్ఫ్ పోటీలకు మంచి స్పందన
అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనున్న 19వ మహాసభలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను, ఆటల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, వర్జీనియా రాష్ట్రంలోని స్టోన్వాల్ గోల్ఫ్ క్లబ్, గైన్స్విల్లేలో నిర్వహించిన గోల్ఫ్ పోటీలకు మంచి స్పందన వచ్చింది. గోల్ఫ్ క్రీడాభిమానులు, తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు, ఆటా నాయకులు ఇతరులు ఈ పోటీలకు హాజరయ్యారు. క్రీడాస్ఫూర్తి, స్నేహపూర్వక వాతావరణంలో ఈ పోటీలు సాగాయి. పోటీల అనంతరం నిర్వహించిన అవార్డుల కార్యక్రమం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేతలకు ట్రోఫీలు, రాఫిల్ బహుమతులు, ప్రత్యేక గిఫ్ట్‌లను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో కృషి చేసిన మనోహర్ ఎనుగు, సురేందర్ యెడుల్ల, మురళి మల్యాల, ప్రసాద్ తుమ్ములూరి, విక్రమ్ కల్లేపు, రవి ముళ్లపూడిలను ఆటా నాయకులు ప్రశంసించారు. వారి సమర్థవంతమైన ప్రణాళిక, సమన్వయం, అంకితభావం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విశేషంగా దోహదపడిందని చెప్పారు.
ఈ పోటీలకు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ నాయకత్వ బృందం, కోర్ టీమ్ సభ్యులు, స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారులు హాజరై క్రీడాకారులను అభినందించారు. టోర్నమెంట్ నిర్వహణలో సహకరించిన గోల్ఫ్ కమిటీ సభ్యులు, స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు ప్రతి ఒక్కరికీ ఆటా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటా మహాసభలకు అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా ఆటా నాయకులు అందరినీ కోరారు.









