జగన్ ట్రాప్లో కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే సంచలనం..!
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ వివాదం ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ సంతాప సభకు హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..(bonda uma) తాము వైకాపా నేతలతో వేదిక పంచుకోవడంపై వివరణ అడిగితే, గతంలో వైకాపా నేతలు నిర్వహించిన గోదావరి సభకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాలను కూడా వివరణ అడగాలంటూ వ్యాఖ్యానించారు. బొండా ఉమ చేసిన ఈ కామెంట్స్ పై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తాను ఎవరినో బ్లాక్మెయిల్ చేసేందుకు ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లలేదని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan) వేస్తున్న రాజకీయ వ్యూహాలు, “ట్రాప్”లలో తమ కూటమి నేతలే చిక్కుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ట్రాప్లో పడకుండా కూటమి నేతలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కాపు ఉద్యమమే ప్రధాన కారణమంటూ బొండా ఉమ చేసిన వ్యాఖ్యలను నెహ్రూ పూర్తిగా తప్పుబట్టారు.
ఒక ఎన్నికల ఓటమికి కేవలం ఒక్క అంశాన్ని లేదా ఒక ఉద్యమాన్ని మాత్రమే కారణంగా చూపించడం సమంజసం కాదని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో మెజారిటీ కాపు సామాజిక వర్గం ఏ వైపు మొగ్గు చూపితే ఆ ప్రభుత్వాలే అధికారంలోకి వస్తాయనే నిజాన్ని గ్రహించాలని గుర్తుచేశారు. కాపు సామాజిక వర్గం ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వాల వెంటే నడుస్తుందని జ్యోతుల నెహ్రూ విశ్లేషించారు. కాపుల సామాజిక, ఆర్థిక వికాసానికి, వారి అభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. అనవసర వివాదాలకు తావివ్వకుండా, కూటమి లక్ష్యాలకు అనుగుణంగా నేతలంతా కలిసికట్టుగా సాగాలని ఆయన పిలుపునిచ్చారు.








