అజయ్ బాబును అభినందించిన మంత్రి మండిపల్లి
కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు(Valluri Ajay Babu) కు ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి (Mandipalli Ramprasad Reddy), శాప్ చైర్మన్ రవినాయుడు (Ravi Naidu) అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి తీసుకురావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ రికార్డుతో పాటు రజత పతకం సాధించడం అజయ్ బాబు ప్రతిభకు నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu)తో నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకురావాలని క్రీడాకారులకు మంత్రి సూచించారు.








