రంగనాథ్‌కు అండగా రేవంత్ రెడ్డి!?
హైదరాబాద్ నగర రూపురేఖలను మారుస్తామని.. చెరువులు, ఆక్రమణలను ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైడ్రా (HYDRAA)ను తెరపైకి తెచ్చింది. అయితే ఇప్పుడిది రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి తన ‘బ్రెయిన్ చైల్డ్’గా భావిస్తుంటారు. అందుకే హైడ్రా కమిషనర్‌గా సమర్థుడిగా పేరొందిన ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను నియమించి, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. అయితే, ఇటీవల హైకోర్టు రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశించడంతో ఈ ఉదంతం ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది.
హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడినట్లే కనిపించినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశంలో అంగుళం కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎలాగైనా రంగనాథ్‌నే అదే పదవిలో కొనసాగించాలనే దిశగా కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. అధికారుల నియామకం, బదిలీలు అనేది సంపూర్ణంగా ప్రభుత్వం పరిధిలోని అంశమని, ఇందులో కోర్టు జోక్యం సరికాదనే బలమైన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ నిపుణులతో వరుస సమావేశాలు నిర్వహించి లీగల్ ఆప్షన్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి రాగానే దీనిపై తుది సమీక్ష నిర్వహించి, హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. కోర్టు ఆదేశాలపై స్టే తెచ్చుకోవడమే కాకుండా, రంగనాథ్ బాధ్యతలను యథాతథంగా కొనసాగించేలా న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.
రాజకీయ కోణంలో చూస్తే, హైడ్రా అనేది కేవలం ఒక ప్రభుత్వ విభాగానికో లేదా ఆక్రమణల తొలగింపుకో పరిమితమైన అంశం కాదు. ఇది రేవంత్ రెడ్డి పొలిటికల్ ఇమేజ్‌తో నేరుగా ముడిపడి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి అత్యంత ఆవేశంగా, పట్టుదలతో ముందుకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ హైడ్రా. ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల కారణంగా వెనకడుగు వేస్తే, అది ప్రతిపక్షాలైన బిఆర్ఎస్, బీజేపీలకు పెద్ద ఆయుధంగా మారుతుంది. అధికారుల నియామకంలో కోర్టుల ఆదేశాలకు తలొగ్గితే, భవిష్యత్తులో పరిపాలనాపరమైన నిర్ణయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రా లక్ష్యాలను నిర్భయంగా అమలు చేయడంలో రంగనాథ్ చూపిన చొరవ రేవంత్‌కు బాగా నచ్చింది. ఆయనను తొలగిస్తే పథకం వేగం మందగిస్తుందనేది సర్కార్ భయం.
న్యాయస్థానాలు కోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెబుతుంటే, ప్రభుత్వం మాత్రం తమ పరిపాలనాధికారాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు చట్టబద్ధత, కోర్టు ధిక్కరణ ఆరోపణలు, మరోవైపు రాజకీయ వ్యూహాలు, ప్రభుత్వ పట్టుదల.. ఈ రెండింటి నడుమ హైడ్రా వ్యవహారం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం వినిపించే వాదనలు ఎంతవరకు నిలబడతాయి? కోర్టు రంగనాథ్ నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, రేవంత్ రెడ్డి తీసుకోబోయే తుది నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లోనూ, అధికారుల నియామక ప్రక్రియల్లోనూ ఒక కొత్త చర్చకు దారితీయడం ఖాయం.








