కేవలం ఐదు మాటలు… 40 లక్షల మంది జీవితాలను మార్చేసాయి!
—శివ దువ్వూరు
మనిషిని జంతువుల నుంచి వేరు చేసింది బలం కాదు.
మాట.
నాగరికతలను నిర్మించింది కూడా మాటే.
యుద్ధాలను ఆపింది కూడా మాటే.
చరిత్రలో కొన్ని మాటలు పుస్తకాలుగా మారాయి. కొన్ని రాజ్యాంగాలుగా మారాయి. కానీ… కేవలం ఐదు మాటలు ఒక దేశ భవిష్యత్తును మార్చిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి సంఘటనల్లో ఒకటి…ఇప్పుడు మీరు చదవబోయే..
ఐదు మాటల కథ.
ఒక్క వివరణ లేదు. ఉపన్యాసం లేదు. అనవసరమైన అలంకారాలు లేవు. గంటలు, రోజులు తరబడి చర్చలు లేవు. అయినా… కేవలం ఓ ఐదు మాటలు ఒక యుద్ధం ముగింపును వేగవంతం చేశాయి. కొన్ని నెలల తర్వాత, దాదాపు 40 లక్షల మంది బానిసలకు చట్టబద్ధమైన స్వేచ్ఛ దక్కే మార్గాన్ని సుగమం చేసిన చారిత్రక పరిణామాల్లో భాగమయ్యాయి.
1865… అమెరికా అంతర్యుద్ధం చివరి రోజులు
దేశం అలసిపోయింది.
వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో యుద్ధరంగంలో ఉన్న మేజర్ జనరల్ ఫిలిప్ షెరిడాన్ తన పైఅధికారి యులిసిస్ ఎస్. గ్రాంట్‌కు ఒక కీలక టెలిగ్రాఫ్ సందేశం పంపాడు.
“ఒత్తిడిని ఇలాగే కొనసాగిస్తే… జనరల్ లీ లొంగిపోతాడని నేను భావిస్తున్నాను.” గ్రాంట్ ఆ సందేశాన్ని అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌కు పంపించాడు. ఇక్కడే ఈ కథ గొప్పదవుతుంది.
ఎందుకంటే లింకన్ ఆ సందేశాన్ని చదివి పొడవైన ఆదేశాలు ఇవ్వలేదు. సమావేశాలు పెట్టలేదు.వివరణలు అడగలేదు. ఆయన తిరిగి రాసింది…
కేవలం ఐదు మాటలు.
“Let the thing be pressed.”
తెలుగులో చెప్పాలంటే…
“ఒత్తిడిని అలాగే కొనసాగించండి.”
అంతే. రెండు రోజుల తర్వాత, 1865 ఏప్రిల్ 9న జనరల్ రాబర్ట్ ఈ. లీ లొంగిపోయాడు. అది అమెరికా అంతర్యుద్ధం ముగింపును వేగవంతం చేసిన చారిత్రక మలుపుగా నిలిచింది. ఆ తర్వాత అదే ఏడాది అమల్లోకి వచ్చిన అమెరికా రాజ్యాంగంలోని 13వ సవరణ ద్వారా దాదాపు 40 లక్షల మంది బానిసలకు చట్టబద్ధమైన విముక్తి లభించింది. ఈ మహత్తర మార్పు వెనుక నాలుగేళ్ల యుద్ధం ఉంది. వేలాది మంది త్యాగం ఉంది. అనేక మంది నాయకుల పాత్ర ఉంది.
అయితే…అదే సమయంలో, సరైన వ్యక్తిపై, సరైన ఐదు మాటలు ఎంత ప్రభావం చూపగలవో చరిత్ర ఈ సంఘటనతో మరోసారి నిరూపించింది.
ఈ కథ లింకన్ గురించి కాదు… మాటల గురించి
మన పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పారు. “అల్పాక్షరముల అనల్పార్థ రచన.” అంటే తక్కువ మాటల్లో…పెద్ద అర్థాన్ని చెప్పగలగడం. అదే అసలైన ప్రతిభ.
ఈ రోజుల్లో మనం ఒక ఈమెయిల్ రాయడానికి పది నిమిషాలు తీసుకుంటాం.లైన్స్ మీద లైన్స్ రాస్తూనే ఉంటాం. ఒక WhatsApp మెసేజ్‌లో కూడా అవసరం లేని మాటలు నింపేస్తుంటాం. కానీ చరిత్ర చెప్పే పాఠం ఒక్కటే. ఎక్కువ మాటలు స్పష్టతకు గుర్తు కావు. సరైన మాటలే స్పష్టతకు గుర్తు.
చివరగా…
చరిత్ర ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. ప్రపంచాన్ని మార్చేది పెద్ద ఆలోచనలు కాదు. ఆ పెద్ద ఆలోచనలను… సరైన సమయంలో… సరైన మాటల్లో చెప్పగలిగిన మనుషులు.
మాటలు అంటే కేవలం శబ్దాలు కావు. అవి నిర్ణయాలు. అవి దిశలు. అవి భవిష్యత్తులు. కొన్నిసార్లు… అవి కేవలం ఐదు మాత్రమే ఉంటాయి.








