ఘనంగా టిఎజిడివి పిక్నిక్ వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ (టిఎజిడివి) తన వార్షిక ‘సమ్మర్ పిక్నిక్ 2026’ ను లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్క్ లో ఘనంగా నిర్వహించింది. 53 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్న టిఎజిడివి, తెలుగు భాష, సంస్కృతి మరియు కమÖ్యనిటీ మధ్య బంధాలను బలోపేతం చేయడంలో తనదైన శైలిలో ముందుకు సాగుతోందని ఈ పిక్నిక్ మరొకసారి నిరూపించింది. పెన్సిల్వేనియా, డెలావేర్ మరియు న్యూజెర్సీ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన తెలుగు కుటుంబాలవారు ఇందులో పాల్గొన్నారు. దాదాపు 550మందికిపైగా ఇందులో పాల్గొన్నారు. రుచికరమైన వంటకాలు, ఆటపాటలు మరియు ఆత్మీయ కలయికల మధ్య ఈ పిక్నిక్ ఘనంగా జరిగింది.
ఈ పిక్నిక్ కోసం వలంటీర్లు ఉదయం 6:30 గంటలకే పార్కుకు చేరుకుని, వంటకాలను సిద్ధం చేసే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి శ్రమఫలితంగా, మధ్యాహ్న సమయానికి వచ్చిన అతిథులకు తాజా, రుచికరమైన భోజనాన్ని అందించగలిగారు. మరోవైపు ఇంట్లోనే స్వయంగా రకరకాల వంటకాలను వండి తెచ్చి విందును మరింత ఆకర్షణీయంగా చేసిన మహిళా వాలంటీర్లకు టిఎజిడివి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ పిక్నిక్ వేళ పార్కంతా ఆత్మీయ పలకరింపులు, చిరునవ్వులతో కనిపించింది. రుచికరమైన భోజనం, ఉత్సాహభరితమైన ఆటలు, అపరిమితమైన వినోదం అనే నినాదానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి. అక్కడికక్కడే సిద్ధం చేసిన వేడి వేడి భోజనాలు, తాజా తినుబండారాలు మరియు పానీయాలు, సాయంత్రం వేళ సర్వ్ చేసిన తాజా పుచ్చకాయ ముక్కలు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలకు మంచి స్పందన వచ్చింది. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను కూడా ప్రదానం చేశారు. ఈ వేడుక అందరిలోనూ సాంస్కృతిక వైభవాన్ని, ఐక్యతా భావాన్ని తెలియజేసింది. వేడుకకు హాజరైన ఒక సభ్యుడు మాట్లాడుతూ, మన తెలుగు వాళ్లతో గడిపిన ఈ పిక్నిక్ మనసుకు హాయిగా, ఇంటి వాతావరణం గుర్తు చేసింది అని తన సంతోషాన్ని పంచుకున్నారు.

కార్యక్రమం అత్యంత దిగ్విజయంగా జరగడానికి టిఎజిడివి కార్యవర్గ కమిటీ ప్రణాళికాబద్ధమైన కృషి ఎంతగానో తోడ్పడింది:
హరీష్ అన్నబత్తిని — ప్రెసిడెంట్, సురేష్ బొందుగుల — వైస్ ప్రెసిడెంట్, శివ అనన్తుని — సెక్రటరీ, మధు బుడాటి — ట్రెజరర్, లవ ఇనాంపూడి — జాయింట్ సెక్రటరీ, స్వాతి కొండేటి — జాయింట్ ట్రెజరర్తోపాటు కమిటీ సభ్యులు విక్రమ్ అర్జుల, శ్రావణి గుత్తా, గౌరి కర్రోతు, సురేంద్ర కొరిటాల, విజయ్ భాస్కర్ మక్కెన, ప్రశాంత్ పసుపుల, శ్రీసుధ విశ్వనాథ్, నిరంజన్ యానమండ్ర, సురేష్ యలమర్తి ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు. రిజిస్ట్రేషన్, లాజిస్టిక్స్, వంటలు వండడం, వడ్డించడం, ఆటల నిర్వహణ, ఫొటోగ్రఫీ, పారిశుధ్యం వంటి అన్ని విభాగాల్లో నిరంతరం శ్రమించిన ప్రతి ఒక్క వాలంటీర్కు టిఎజిడివి కార్యవర్గం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. రవి ఇంద్రకంటి, విశ్వనాథ్ కొగంటి, శ్రీధర్ యలమంచినేని, నరేష్, కేదార్, విశ్వనాథ్ పాలేపు, మధు ముప్పాల, మధు నల్లా, శ్రీధర్ సాదినేని, పవన్ అన్నే, భటవత్సల భవనం, మధు జల్లి, సుదర్శన్ లింగుంట్ల, రాధాకృష్ణ ముల్పూరి, నరేంద్ర కొల్లా, తిరుపతి రావు, వెంకట్ తుమ్మల, వల్లి యలమర్తి, రమేష్ గుత్తా మరియు ‘అన్నపూర్ణ’గా వ్యవహరించిన సభ్యులందరికీ కూడా టిఎజిడివి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
ఈ పిక్నిక్కు ప్రాంతీయంగా ఉన్న వివిధ తెలుగు సంఘాల నాయకులు విచ్చేసి తమ మద్దతు తెలిపారు. వారి రాక ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చడమే కాకుండా, తెలుగు సంఘాల మధ్య సమైక్యతను చాటిచెప్పింది. టిఎజిడివి పూర్వ అధ్యక్షులు హరినాథ్ దొడ్డపనేని, రవి పొట్లూరి, హరి బుంగతావుల, ముజీబుర్ రెహమాన్ ఈ వేడుకలో పాల్గొని కార్యవర్గాన్ని అభినందించారు.








