ఆరిజోనా కాంగ్రెషనల్ ప్రైమరీ ఎన్నికల్లో అమిష్ షా సంచలన విజయం
ఆరిజోనా డెమోక్రటిక్ కాంగ్రెషనల్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అమిష్ షా ఘన విజయం సాధించారు. ఆయన మితవాద డెమోక్రటిక్ నేత. వృత్తిరీత్యా ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడైన అమిష్ షా ప్రచారంలో భాగంగా దాదాపు 28 వేల ఇళ్లకు నేరుగా వెళ్లి ప్రజలను కలిసి మద్దతు కోరారు. ఈ క్షేత్రస్థాయి ప్రచారంతో డెమోక్రటిక్ పార్టీ కమిటీ (ణ్పు్పు్పు) మద్దతు పొందిన మాజీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ మార్లీన్ గాలన్ వుడ్స్పై ఆయన ఘన విజయాన్ని నమోదు చేశారు. వచ్చే నవంబరులో జరిగే అమెరికా కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల్లో అమిష్ షా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కిక్కర్ జే ఫీలీతో తలపడనున్నారు.
ఈ విజయంపై అమిష్ షా స్పందిస్తూ… “ఇది కేవలం నా విజయం కాదు, ప్రజల విజయం. ఆరిజోనా ఓటర్లు తమ వాణిని స్పష్టంగా వినిపించారు. రాబోయే ప్రధాన ఎన్నికల్లో ప్రతి ఓటరు మద్దతు పొందడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో విజయం సాధిస్తాననే ధీమా ఉంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమిష్ షా నేపథ్యం: 1960ల్లో అమెరికాకు వలస వచ్చిన గుజరాతీ దంపతులకు అమిష్ షా చికాగోలో జన్మించారు. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత బెర్కిలీ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ పట్టా పొందారు.








