నోలన్‌కు ఎలాన్ మస్క్ బిగ్ ఛాలెంజ్! ‘ఒడిస్సీ’ని మళ్లీ తీస్తానన్న ప్రపంచ కుబేరుడు
— సూర్య ప్రకాష్ జోశ్యుల
సాధారణంగా ఒక దర్శకుడు తీసిన సినిమా బ్లాక్‌బస్టర్ అయి, విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ఆ చిత్ర ప్రయాణం పూర్తవుతుంది. కానీ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ విషయంలో మాత్రం అసలు కథ సినిమా విడుదలయ్యాకే మొదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం దిశగా దూసుకుపోతున్న సమయంలో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనూహ్యంగా రంగంలోకి దిగారు. “అదే ‘ఒడిస్సీ’ కథను నేను మళ్లీ తీస్తాను” అంటూ ఒక ట్వీట్‌తో హాలీవుడ్‌ను షాక్‌కు గురిచేశారు.
హాలీవుడ్లో ఒకరి ప్రాజెక్ట్‌పై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం అరుదేమీ కాదు. కానీ, ప్రపంచ సినిమా రంగంలో తిరుగులేని దర్శకుడిగా పేరుపొందిన క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఒక సంచలన చిత్రానికే ప్రత్యామ్నాయంగా మరొకటి తీస్తానని ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి
ఈ వివాదానికి బీజం ఎక్కడ పడింది?
ఇదేమీ ఒక్కరోజులో పుట్టుకొచ్చిన వివాదం కాదు. నోలన్ ‘ది ఒడిస్సీ’ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడే దీనికి పునాది పడింది. ఆ చిత్రంలో ‘హెలెన్ ఆఫ్ ట్రాయ్’ పాత్రకు ఆస్కార్ విజేత లుపిటా నియోంగోను ఎంపిక చేశారనే వార్త రాగానే మస్క్ తీవ్రంగా స్పందించారు. ఆ కాస్టింగ్‌ను తప్పుబడుతూ, “నోలన్ తన సృజనాత్మక ప్రామాణికతను (Integrity) కోల్పోయాడు” అని సోషల్ మీడియాలో ఘాటుగా వ్యాఖ్యానించారు.
అప్పట్లో అది ఒక అభిప్రాయంగా మాత్రమే కనిపించినా, ఇప్పుడు ఏకంగా “నేనే ఆ కథను మళ్లీ తీస్తా” అని సవాల్ విసరడంతో ఈ గొడవ నేరుగా నోలన్ సినిమాపై పోరాటంగా మారింది.
మస్క్ ప్లాన్ ఏంటి?
తాను రూపొందించబోయే ‘ది ఒడిస్సీ’ నోలన్ వెర్షన్‌లా ఉండదని మస్క్ స్పష్టం చేస్తున్నారు. హోమర్ రాసిన ఈ అమర మహాకావ్యాన్ని “చారిత్రకంగా మరింత కచ్చితమైన రూపంలో” తెరపైకి తీసుకొస్తానని, అది కూడా ఈ ఏడాది ముగిసేలోపే తన AI ప్లాట్‌ఫామ్ ‘Grok Imagine’ సాయంతో పూర్తి చేస్తానని వెల్లడించారు.
అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది—’ఒడిస్సీ’ నిజంగా ఒక చారిత్రక కథేనా? హోమర్ రాసిన మూల కథలో ఒంటికన్ను రాక్షసులు, సముద్రపు వింత జీవులు, మనుషులను పందులుగా మార్చే మంత్రగత్తెల వంటి పౌరాణిక పాత్రలే ఎక్కువ. చరిత్రకారులు కూడా దీనిని చారిత్రక గ్రంథంగా కాకుండా గ్రీకు పురాణ గాథగానే పరిగణిస్తారు. అలాంటప్పుడు దానికి “చారిత్రక కచ్చితత్వం” ఎలా ఇస్తారనేది విశ్లేషకులకు కూడా మింగుడుపడటం లేదు.
భారీ విజయం సాధించిన నోలన్ వెర్షన్!
ఇక్కడ విశేషమేమిటంటే… మస్క్ ఈ సవాల్ విసిరింది ఏదో పరాజయం పాలైన సినిమాకు కాదు! నోలన్ ‘ది ఒడిస్సీ’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సుమారు 264 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ సాధించడమే కాకుండా, రాటెన్ టొమాటోస్‌లో 97 శాతం రేటింగ్, ప్రేక్షకుల నుంచి ‘A’ సినిమాస్కోర్ సాధించి, 1 బిలియన్ డాలర్ల క్లబ్‌వైపు వేగంగా దూసుకెళ్తోంది. అంటే నోలన్ విజయాన్ని ఆపడం కాకుండా, ఆయన సినిమాటిక్ విజన్‌కు సమాంతరంగా తన సాంకేతిక శోధనను నిలబెట్టాలన్నదే మస్క్ భావనగా కనిపిస్తోంది.
సోషల్ మీడియా పబ్లిసిటీనా… నిజమైన ప్రయోగమా?
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్లు, అంతరిక్ష రాకెట్లు, AI ప్లాట్‌ఫామ్‌లతో ప్రపంచాన్ని శాసించిన ఎలాన్ మస్క్, ఇప్పుడు సినిమా రంగంలోకి, అదీ క్రిస్టోఫర్ నోలన్ లాంటి దిగ్గజ దర్శకుడుపై సవాల్ విసురుతూ అడుగుపెట్టాలని చూస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా ఒక్కదానిపైనే ఉంది: ‘Grok Imagine’ రూపంలో మస్క్ చెప్పే ‘ఒడిస్సీ’ నిజంగానే ఒక కొత్త సాంకేతిక విప్లవానికి తెరతీస్తుందా? లేక నోలన్ సాధించిన వెండితెర దృశ్యకావ్యం ముందు ఇదొక సోషల్ మీడియా హడావుడిగానే మిగిలిపోతుందా? త్వరలోనే తేలనుంది.








