ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్… మోహన్‌లాల్ కూతురిపై ‘బాయ్‌కాట్’ తుఫాన్!
చాలా సార్లు కొన్ని వివాదాలు పెద్ద పేలుళ్లలా మొదలుకావు. నిశ్శబ్దంగా మొదలవుతాయి. ఒక క్లిక్‌తో. ఒక షేర్‌తో. ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీతో. చివరకి అది పోస్ట్ చేసిన వ్యక్తికి కూడా… కొన్ని గంటల్లో అది దేశవ్యాప్త చర్చగా మారుతుందని తెలియదు. అలాంటి పరిస్ధితే ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ విషయంలో జరిగింది.
ఆమె పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ తో సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే రేగుతోంది. ఆమెపై విమర్శల తుఫాన్ మొదలైంది. “యాంటీ నేషనల్” ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె తొలి చిత్రం ‘తుడక్కం’ ను బహిష్కరించాలని పిలుపులు మొదలయ్యాయి. #BoycottThudakkam పోస్టులు వైరల్ అవుతున్నాయి. సినిమా గురించి చర్చ జరగాల్సిన సమయంలో… ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ గురించే చర్చ నడుస్తోంది. ఎవరూ ఊహించని పరిణామం ఇది.
ఇంతకీ… ఆ ఒక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఏముంది?
ఢిల్లీలో జరిగిన NEET నిరసనలకు సంబంధించిన ఒక పోస్టును విస్మయ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీకి ప్రయత్నించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఇంటర్నెట్ సేవలపై కూడా పరిమితులు విధించారని నిరసనకారులు ఆరోపించారు. ఈ చర్యలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టునే విస్మయ తన స్టోరీలో షేర్ చేశారు.
ఆమె ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ సోషల్ మీడియాలో ఆ పోస్టును చాలామంది పూర్తిగా భిన్నంగా అర్థం చేసుకున్నారు. కొద్దిసేపటికే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
రాజకీయ అంశంపై ఎందుకు స్పందించారని కొందరు ప్రశ్నించారు. మరికొందరు ఎంపిక చేసుకున్న అంశాలపైనే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇంకొందరు ఆమెను “యాంటీ నేషనల్” అంటూ విమర్శిస్తూ, ‘తుడక్కం’ సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
విమర్శలతో ఆగలేదు
కొందరు ఈ వివాదాన్ని గతంలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘ఎంపురాన్’ చుట్టూ జరిగిన రాజకీయ చర్చలతో కూడా ముడిపెట్టే ప్రయత్నం చేశారు. మరికొందరు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ ఆమెపై విమర్శలు గుప్పించారు. మరికొందరు మోహన్‌లాల్‌ను కూడా ఈ వివాదంలోకి లాగుతూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
ఇదంతా విస్మయకు అత్యంత కీలకమైన సమయంలో జరిగింది. ఎందుకంటే ‘తుడక్కం’ సినిమాతో ఆమె తొలిసారి నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి ఉంది. అయితే సినిమా గురించి చర్చ జరగాల్సిన సమయంలో, ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీనే ప్రధాన చర్చగా మారింది.
ఇది మొదటిసారి కాదు.
గత కొన్నేళ్లుగా వివిధ అంశాలపై స్పందించిన పలువురు నటీనటులు, దర్శకులు, స్టార్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్, బాయ్‌కాట్ ప్రచారాలను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా అభిప్రాయాలను పంచుకునే వేదికగానే కాకుండా, కొన్ని సందర్భాల్లో విచారణకు ముందే తీర్పు చెప్పే వేదికగా కూడా మారుతోందనే అభిప్రాయం తరచూ వినిపిస్తోంది.
మోహన్‌లాల్ స్పందించారా?
ఈ వివాదంపై ఇప్పటివరకు మోహన్‌లాల్ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. విస్మయ కూడా ఈ ట్రోలింగ్‌పై ప్రత్యేకంగా స్పందించలేదు.
ఆ పోస్ట్ తొలగించారా?
ఈ కథనం రాసే సమయానికి, విస్మయ ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీని వివాదం కారణంగా తొలగించారని ధృవీకరించిన సమాచారం అందుబాటులో లేదు. ఆమె ఉద్దేశంపై కూడా అధికారిక వివరణ ఇవ్వలేదు.
ఏదైమైనా
ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది.సెలబ్రిటీలు సామాజిక లేదా రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు కలిగి ఉన్నారా? లేక వారి ప్రతి పోస్టును వారి సినిమాలతో, కుటుంబంతో, కెరీర్‌తో ముడిపెట్టి చూడాలా?
ఒక కళాకారుడి వ్యక్తిగత అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. అతను లేదా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టును విమర్శించొచ్చు. అది ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ… ఒక పోస్టుతో విభేదించడం వేరు.ఆ కళాకారుడి పనిని చూడకముందే తిరస్కరించడం వేరు. సినిమా విడుదల కాకముందే, నటనను చూడకముందే, కేవలం ఒక సోషల్ మీడియా పోస్టు ఆధారంగా ఒక కళాకారుడికి తీర్పు చెప్పడం ఎంతవరకు సమంజసం?








