అమెరికా ప్రతినిధుల సభలో ఆటా సేవలకు చారిత్రాత్మక గుర్తింపు
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకీ, తెలుగు రాష్ట్రాల్లోని కమ్యూనిటీ సేవలందిస్తున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా)కు ఉన్నతమైన, చారిత్రాత్మకమైన గుర్తింపు లభించింది. తొలిసారిగా అమెరికా ప్రతినిధుల సభ (యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) వేదికగా అధికారిక గుర్తింపును పొందింది. కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం సభలో ప్రత్యేక ప్రసంగం చేస్తూ, జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న 19వ ఆటా మహాసభలు, యూత్ కాన్ఫరెన్స్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు అమెరికన్ తెలుగు అసోసియేషన్‌కే కాకుండా అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు అమెరికన్లందరికీ దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు.
ప్రజాసేవ, విద్య, వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగం, పారిశ్రామికవేత్తలుగా, సామాజిక నాయకులుగా తెలుగు అమెరికన్లు అందిస్తున్న విశేష సేవలను కాంగ్రెస్ సభ్యుడు తన ప్రసంగంలో కొనియాడారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను ఆటా నిర్వహిస్తోందని చెప్పారు. 1991లో స్థాపించబడిన అమెరికా తెలుగు సంఘం ప్రస్తుతం ఉత్తర అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాల్లో ఒకటిగా ఉంది. విద్యా కార్యక్రమాలు, యువత అభివృద్ధి, సాంస్కృతిక ఉత్సవాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, స్కాలర్షిప్లు, విపత్తు సహాయ చర్యలు, మానవతా సేవలు వంటి అనేక కార్యక్రమాల ద్వారా వేలాది తెలుగు కుటుంబాలకు సేవలందిస్తూ విశేష గుర్తింపు పొందింది.
అమెరికా ప్రతినిధుల సభలో తమ సంస్థను గుర్తించి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యంకు ఆటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ గుర్తింపు సంస్థకు సేవలందిస్తున్న వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలు, సభ్యులు, దాతలు, కమ్యూనిటీ నాయకులకు మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తుందని పేర్కొంది.
బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభలు, యూత్ కాన్ఫరెన్స్‌కు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రవాస తెలుగువారు హాజరుకానున్నారు. అమెరికాలోని తెలుగువారంతా ఈ మహాసభలకు రావాల్సిందిగా ఆటా నాయకులు ఈ సందర్భంగా కోరారు.








