Googleపై ప్రపంచ రచయితల తిరుగుబాటు! భారీ కేసు, అసలేం జరిగింది?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకరోజు మీరు ఆన్లైన్లో పుస్తకాలు తిరగేస్తూంటే ఓ కొత్త పుస్తకం కనిపించింది.
టైటిల్ చూసి “ఇది భలే గమ్మత్తుగా ఉందే!” అనిపించింది. కవర్ డిజైన్ అద్భుతంగా ఉంది. క్రింద మంచి రివ్యూలు కూడా కనిపిస్తున్నాయి. ఆలోచించకుండా వెంటనే ఆర్డర్ పెట్టేశారు.
రెండు రోజుల తర్వాత…
పుస్తకం మీ చేతికి వచ్చింది. టీ కప్పు పక్కన పెట్టుకుని ఆసక్తిగా మొదటి పేజీ తిప్పారు. మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం ఇలా తిరగేస్తున్న మీ చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. మీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎందుకంటే ఆ కథ కొత్తది కాదు.ఎక్కడో చదివినట్లు అనిపించింది. ఒక్క సెకనుకి అర్దమైంది. అది మీదే. అది మీరు ఐదేళ్లు కష్టపడి రాసిన నవల. అయితే పాత్రల పేర్లు మారాయి. ప్రదేశాలు పూర్తిగా మారాయి. టైటిల్ మారింది. కొన్ని సన్నివేశాలు కూడా మార్చేశారు. కానీ ఆ కథలోని ఆలోచనలు, ఆ భావోద్వేగాలు, ఆ ట్విస్టులు అన్నీ మీవే.
కోపంతో ఆ పుస్తకం రాసిన రచయిత ఎవరో వెతకడం మొదలుపెట్టారు. ప్రెండ్స్ తో చర్చించారు. కేసు వేయాలని నిర్ణయించుకున్నారు.కానీ అక్కడే అసలు షాక్ ఎదురైంది. ఆ పేరుతో అసలు ఏ రచయితా లేడు.
ఆ పుస్తకం రాసింది అసలు మనిషే కాదు. ఒక AI. ఇప్పుడు కేసు ఎవరిపై వేస్తారు? AI మీదా? దాన్ని తయారు చేసిన కంపెనీ మీదా? లేక అతి తెలివిగా మారిన పబ్లిషింగ్ కంపెనీ మీదా?
ఇదేమీ సరదాగా చెప్తున్న ఊహ కాదు. ప్రపంచవ్యాప్తంగా రచయితలు వ్యక్తం చేస్తున్న భయం ఇది. అదే భయం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన Googleను అమెరికా కోర్టు వరకు తీసుకొచ్చింది.
ఇక్కడే కథ మలుపు తిరిగింది
ప్రపంచ ప్రఖ్యాత ప్రచురణ సంస్థలు Hachette Book Group, Cengage, Elsevierతో పాటు ప్రముఖ రచయితలు Googleపై న్యూయార్క్ కోర్టులో కేసు వేశారు. వారి ఆరోపణ ఏమిటంటే Google Books వంటి సేవల కోసం అందుబాటులోకి వచ్చిన లక్షలాది పుస్తకాలను తమ Gemini AIకి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిందని వారు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు Gemini కొన్ని సందర్భాల్లో రచయితల రచనా శైలిని పోలి ఉండే కంటెంట్‌ను కూడా రూపొందిస్తోందని కోర్టులో వాదించారు. Google మాత్రం షరా మూమూలే. ఈ ఆరోపణలను ఖండిస్తూ కోర్టులో తన వాదనలు వినిపిస్తోంది. తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇదే కంటిన్యూ అయితే రేపు ఎవరో AIని ఓపెన్ చేసి “యండమూరి తరహాలో ఒక సైకాలజికల్ థ్రిల్లర్ రాయ్.”
అన్నారు. అది తడుముకోకుండా ఒక నవల సిద్ధం చేస్తే..అలాగే యద్దనపూడి శైలిలో ఒక ప్రేమకథ రాయమంటే రాసేస్తే. మల్లాది హాస్యంతో ఒక నవల ఇచ్చేయమంటే…మధుబాబు షాడో లా డిటెక్టివ్ నవల రాసేయమంటే…పరిస్దితి ఏమిటి?AI వారి అంత అద్బుతంగా రాయకపోవచ్చు. వారిని కాపీ కొడుతూ కంటెంట్ ని క్రియేట్ చేసేస్తే..భవిష్యత్ లో ఏదైనా జరగవచ్చు అనేది ఇప్పుడు రైటర్స్ సర్కిల్స్ లో నడుస్తున్న పెద్ద వివాదం.
ఇక్కడ మనం ఆలోచించాల్సింది. AI బాగా రాస్తుందా లేదా అని కాదు. ఆ రచనా శైలిని నిర్మించడానికి ఒక రచయిత జీవితకాలం పట్టింది. ఆ శైలికి ధర ఎంత? దానిపై హక్కు ఎవరిది? కష్టపడి నిర్మించుకున్న భవింతిని వేరే వాళ్లు ఆక్రమిస్తే ఎలా ఉంటుందో ఇదీ అలాంటిదే. సృజనా చౌర్యం.
ఈ రోజు రచయిత…ఓ జర్నలిస్ట్ శైలిని కాపీ కొట్టచ్చు, స్క్రిప్ట్ రాసే యూట్యూబర్ అనుకరించవచ్చు. ప్రతి ప్రకటనకు పదాలు వెతికే కాపీరైటర్ పనిని లాగేసుకోవచ్చు. సినీ రచయిత పొట్ట కొట్టచ్చు. ఈ రోజు AI వాళ్లకు సహాయకుడిలా కనిపిస్తోంది. కానీ ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా రేపు అదే AI వాళ్లకే ప్రత్యర్థిగా మారుతుంది. వాళ్ల జీవితాలని లాగేసుకుంటుంది. అప్పుడు కొత్త రైటర్స్ ఎవరూ తయారు కారు. రాసేవాళ్లు ఎవరూ ఉండరు. కొత్త సృజన ప్రపంచంలో మాయమైపోతుంది.
ఈ వివాద విషయంలో ప్రపంచం రెండు ముక్కలైంది… Googleతో పాటు AI కంపెనీలు చెబుతున్న మాట…”మేము నేర్చుకుంటున్నాం.” అని. కానీ రచయితలు చెబుతున్న మాట…”మా అనుమతి లేకుండా మా రచనలతో వ్యాపారం చేస్తున్నారు.” అని.
ఈ వాదనలో Google ఓడిపోతే…Gemini ఈ పనులు చేయటం ఆపేస్తుందా. అంటే AIకి శిక్షణ ఇచ్చే విధానం మారే అవకాశం ఉంది. అప్పుడు AI కంపెనీలు ఈ పుస్తకాలకు కాపీరైట్ తీసుకోవాలేమో? లేదా రచయితలకు రాయల్టీలు చెల్లించాలేమో?
అదే Google గెలిస్తే…
AI శిక్షణలో కాపీరైట్ ఉన్న రచనల వినియోగంపై AI కంపెనీలకు మరింత చట్టపరమైన వెసులుబాటు లభించే అవకాశముందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
అప్పుడు రచయితల హక్కులను ఎలా రక్షించాలి? ఈ కేసు అమెరికాలో మొదలైంది. కానీ ముగిసేది అక్కడ కాదు. అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతీయ భాషల్లోనూ సమస్యే.
ఏదైమైనా..
ఒక పుస్తకాన్ని దొంగిలిస్తే దాన్ని నేరం అంటాం.అదే ఒక ఆలోచనతో ప్రేరణ పొందితే… దాన్ని సృజన అంటాం. మరి లక్షలాది పుస్తకాలు చదివిన AI అదే రచయితలకు పోటీగా కొత్త కంటెంట్ సృష్టిస్తే… దాన్ని ఏమంటారు?








