28 వేల బఠానీ గింజలు… ఒక సన్యాసి… 34 ఏళ్ల తర్వాత ప్రపంచం ఆశ్చర్యం!
జనవరి 6, 1884.
ఆస్ట్రియన్ సామ్రాజ్యంలోని బ్ర్నో నగరం.
చర్చి గంటలు నెమ్మదిగా మోగుతున్నాయి.
మంచుతో కప్పుకున్న ఆ ఉదయం…ఒక సన్యాసి అంత్యక్రియలు జరుగుతున్నాయి.ఒక శవపేటిక నెమ్మదిగా నేలలోకి దిగుతోంది. అక్కడున్న వారందరికీ…అది ఒక సాధారణ అంత్యక్రియే. కానీ…చరిత్రకు మాత్రమే తెలుసు…తన గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరిని మట్టిలో దాచిపెడుతున్నానని. ఆ పెట్టెలో ప్రశాంతంగా పడుకున్న వ్యక్తి… ఒక రోజు ప్రపంచంలోని ప్రతి ఆసుపత్రిలో… ప్రతి DNA ల్యాబ్లో… ప్రతి జెనెటిక్ పరీక్షలో… జీవిస్తాడని.
ఆ కథ మొదలైంది… ఒక చిన్న తోటలో… 28 వేల బఠానీ మొక్కల మధ్య.
ఏడు సంవత్సరాలు…
ప్రతిరోజూ అదే తోట. అదే మొక్కలు. అదే పూలు. అదే గింజలు. అదే నోట్బుక్. వర్షం వచ్చినా… ఎండ మండినా… అతని పని ఒక్కటే. గమనించడం. రాసుకోవడం. మళ్లీ గమనించడం. మళ్లీ రాసుకోవడం.
ఒక్కో మొక్క ఎలా పెరిగింది… ఏ రంగు పువ్వు పూసింది… ఏ గింజ గుండ్రంగా వచ్చింది… ఏది ముడతలు పడింది… ఏది పొడవుగా పెరిగింది… ఏది పొట్టిగా ఆగిపోయింది… అన్నీ అతను ఓపికగా నమోదు చేశాడు.
చెప్పాలంటే— విత్తన ఆకారం, రంగు, పువ్వు రంగు, కాయ ఆకారం, కాయ రంగు, పువ్వుల అమరిక, మొక్క ఎత్తు… ఇలా ఏడు విభిన్నమైన లక్షణాలను (Contrasting Traits) ఆయన చాలా సూక్ష్మంగా గమనించాడు.
చూసిన వాళ్లకు… అది ఒక సన్యాసి విచిత్రమైన హాబీలా కనిపించింది. ఎవరూ ఆయనను శాస్త్రవేత్తగా చూడలేదు. ఎవరూ ఆయన పరిశోధనను సీరియస్గా తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి
కానీ… అతను బఠానీ మొక్కలను ఊరికే గమనించడం లేదు. ప్రకృతి రాసిన అత్యంత రహస్యమైన భాషను చదువుతున్నాడు. ఇదంతా చూసి ఆయన్ని పెద్ద శాస్త్రవేత్త అనుకుంటున్నారేమో . అదేమీ కాదు.అలాగని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాదు. పోనీ పెద్ద ల్యాబ్లో పనిచేసే పరిశోధకుడు కాదు. ఒక చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తి.
జీవితంలో డబ్బు కోసం పోరాడాడు. రెండుసార్లు టీచర్ ఉద్యోగం కోసం వెళ్లి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. చివరకు ఆర్థిక ఇబ్బందుల మధ్య…వేరే దారిలేక ఆస్ట్రియాలోని బ్ర్నో నగరంలోని ఒక చర్చిలో సన్యాసిగా చేరాడు. ఆయన పేరు గ్రెగర్ జోహాన్ మెండల్. ఆ ప్రయోగాల తర్వాత ఆయనకు ఓ కొత్త పేరు వచ్చింది. ప్రపంచం ఆయనను తర్వాత ‘ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్’ అని పిలిచింది.
ఇంతకీ ఆ ప్రయోగం ఏమిటి?
అప్పటికే ప్రపంచం ఒక ప్రశ్నతో 200 ఏళ్లుగా పోరాడుతోంది. సమాధానం…ఒక ల్యాబ్లో దొరుకుతుందని అందరూ అనుకున్నారు. కానీ…అది ఒక చిన్న చర్చి తోటలో 28 వేల బఠానీ మొక్కల మధ్య దాక్కుంది. ఆ విషయం మెండల్ కు అర్దమైంది. అందుకే అక్కడే వెతికాడు. ఆ తోటలోకి అడుగుపెట్టిన ప్రతిరోజూ మెండల్ ఒక మొక్కను కాదు…ప్రకృతిని విచారించేవాడు.ఒక్క ప్రశ్నే…మళ్లీ మళ్లీ…వేసేవాడు. ప్రపంచం వెతుకుతుకున్న ఆ ప్రశ్న..మెండల్ భుజాన ఎత్తుకున్న రీసెర్చ్ ప్రశ్న ఒకటే.
“తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు ఎలా చేరతాయి?”
“ప్రకృతి తన రహస్యాలను ఒక తరం నుంచి మరో తరానికి ఎలా పంపిస్తోంది?”
“ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల్లా కనిపిస్తారు?” ఎందుకు కొందరికి తండ్రి ఎత్తు వస్తుంది? , ఎందుకు అమ్మ కళ్ల రంగు పిల్లలకు వస్తుంది?, ఎందుకు కొన్ని వ్యాధులు తరతరాలుగా కుటుంబాన్ని వెంటాడుతుంటాయి?
ఈ ప్రశ్నలకు సమాధానం కోసం…ఆ సన్యాసి బఠానీ మొక్కలను తన గురువులుగా మార్చుకున్నాడు.
ప్రపంచం ఆ ప్రశ్నకు సమాధానం కోసం పుస్తకాలు తిరగేస్తూంటే…మెండల్ మాత్రం… ప్రకృతి పేజీలు తిరగేస్తున్నాడు.
ఏడు సంవత్సరాలు… ప్రపంచం గుర్తించని విప్లవం
..
దాదాపు ఏడు సంవత్సరాలు (1856 నుంచి…1863 వరకు. ) పాటు…వేరే ఆలోచన లేకుండా ఆయన వేలాది సంకరణ ప్రయోగాలు చేశాడు. ఒక మొక్క పువ్వు నుంచి మరో మొక్కకు పరాగాన్ని జాగ్రత్తగా మార్చేవాడు. ఆ తర్వాత… కొత్తగా వచ్చిన గింజలను లెక్కించేవాడు. మళ్లీ వాటిని నాటేవాడు. మళ్లీ ఫలితాలు రాసుకునేవాడు.
అలా రోజులు…నెలలు…సంవత్సరాలు…నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆయన నోట్బుక్ రోజువారీ గమనింపులతో నిండిపోతోంది. ఎక్కడా విసుగులేదు. చిరాకు లేదు. చేయగా, చేయగా, చూడగా..చూడగా…బాగా లోతులకు వెళ్లగా..ఆ బఠానీ మొక్కల్లో ఒక అద్భుతమైన విషయం ఆయనకు గ్రహింపుకు వచ్చింది.
ప్రకృతి ఏ లక్షణాన్నీ యాదృచ్ఛికంగా ఇవ్వదు. దానికి ఒక క్రమం ఉంటుంది. ఒక నియమం ఉంటుంది. ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కనే… ప్రపంచం ఈరోజు జెనెటిక్స్ అంటోంది. ఆ రోజు పనికి రాని లెక్క అని భావించింది.
ప్రపంచం గుర్తించిందా?
ఇలా తను కనుక్కున్న విషయాలు అన్నిటినీ ఆయన పరిశోధనా పుస్తకంగా ప్రచురించాడు. 1866లో బ్రూనో నేచురల్ హిస్టరీ సొసైటీ పత్రికలో “Experiments on Plant Hybrids” పేరుతో అది ప్రచురితమైంది.అది ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆయన అనుకుని ఉండొచ్చు. కానీ అలాంటిదేమీ జరగలేదు. బఠానీ గింజల ప్రయోగాలు ఎవరికి కావాలి అని అందరూ లైట్ తీసుకున్నారు. చిన్న ప్రశంస లేదు. కొద్దిపాటి చప్పట్లు లేవు. అభినందనలు లేవు. ఎక్కడా చర్చ జరగలేదు. చివరకి ఆ పుస్తకం… లైబ్రరీలోని ఒక మూలలో నిశ్శబ్దంగా పడిపోయింది. ప్రపంచం ఓ గొప్ప ఆవిష్కరణను పట్టించుకోకుండా వదిలేసింది.
చనిపోయింది మనిషే… ఆలోచన కాదు
కొంతకాలానికి ప్రకృతి ధర్మం ప్రకారం మెండల్ ఈ లోకాన్ని విడిచిపోయాడు.ఆయన కనుగొన్న సత్యాన్ని… ప్రపంచం ఒక్కరోజైనా,కొంచెమైనా అర్థం చేసుకోకపోవటంతో ఒక సాధారణ సన్యాసిగా ఆయన జీవితం ముగిసిపోయింది.
అయితే అక్కడితో కథ ముగియలేదు. కొన్ని ఆలోచనలు పక్వానికి రావటానికి, ప్రపంచం గుర్తించటానికి సమయం పడుతుంది.
అలా 34 ఏళ్ల తర్వాత…
ముగ్గురు శాస్త్రవేత్తలు (హ్యూగో డి వ్రీస్, కార్ల్ కొరెన్స్, ఎరిచ్ వాన్ షెర్మాక్)….వేర్వేరు దేశాల్లో…వేర్వేరు ప్రయోగాలు చేస్తూ…ఒకే చోటికి వచ్చి ఆగిపోయారు. ఆ క్రమంలో తమ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ఒక పాత రీసెర్చ్ పేపర్ గురించి తెలుసుకున్నారు. లైబ్రరీకి వెల్లి దాన్ని దుమ్ము దులిపి చదివారు. కొన్ని పేజీలు తిరగేశారు. కొన్ని టేబుల్స్ చూశారు.కొన్ని అంకెలు చదివారు. వారి కళ్లలో ఒక్కసారిగా ఆశ్చర్యం.
“ఇన్ని సంవత్సరాలు… ఇంత గొప్ప ఆవిష్కరణను ఎలా మిస్ అయ్యాం?”
అప్పుడే ప్రపంచం మేల్కొంది. ఆ క్షణమే మెండల్ పేరు చరిత్రలో నిలిచిపోవటం మొదలైంది.
ఈ కథ మనకి సంబంధించినదే
“మా నాన్నకు షుగర్…” “నాకు కూడా వచ్చింది.”
“మా అమ్మ కళ్ల రంగే…మా బిడ్డకూ వచ్చింది.”
“మా తాతలా…నాకు కూడా బట్టతల వచ్చింది.”
మనందరం ఎప్పుడో ఒకసారి ఇలాంటి మాటలు విన్నవాళ్లమే.
కానీ…ఇలా ఎందుకు జరుగుతుందో మొదటిసారి శాస్త్రీయంగా వివరించిన వ్యక్తి ఈ సన్యాసే. ఆయన ఈ రోజు మన DNAలో జీవిస్తున్నాడు
ఈరోజు…మనం చేయించుకునే DNA పరీక్ష… గర్భంలోని శిశువుకు జన్యుపరమైన సమస్యలున్నాయా అని చూసే టెస్ట్…థలసేమియా…సికిల్ సెల్ అనీమియా…కలర్ బ్లైండ్నెస్…కుటుంబంలో వచ్చే కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే సాంకేతికత…ఇవన్నీ…ఆ చిన్న తోటలో మొదలైన ప్రయాణానికి కొనసాగింపే.
బఠానీ మొక్కల నుంచి AI వరకు…
ప్రపంచం ఇప్పుడు AIతో మనిషి జన్యువులను చదువుతోంది. CRISPRతో జీన్లను సవరించే ప్రయత్నాలు చేస్తోంది. వ్యక్తికి తగ్గ మందులను తయారు చేస్తోంది. రేపు…పుట్టకముందే కొన్ని వ్యాధులను అడ్డుకునే రోజులు రావొచ్చు. కానీ… ఆ మహా విప్లవానికి తొలి అడుగు…ఏ సూపర్ కంప్యూటర్ వేయలేదు. ఏ బిలియన్ డాలర్ల కంపెనీ వేయలేదు.
ఒక చిన్న తోటలో…
28 వేల బఠానీ మొక్కల మధ్య…ఒక సన్యాసి నిశ్శబ్దంగా వేశాడు.
చివరికి…
చరిత్ర సరైన మనిషిని…సరైన సమయంలో గుర్తించకపోవచ్చు. కానీ…సత్యాన్ని మాత్రం ఎప్పటికైనా గుర్తిస్తుంది. గ్రెగర్ జోహాన్ మెండల్ కూడా అలాంటి మనిషే.
ఇవి కూడా చదవండి








